close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రైతు శోకం జాతికి శాపం

వ్యవసాయ వైకుంఠపాళిలో తరచూ సర్పగండం పాలబడే దురవస్థ భారతీయ రైతాంగాన్ని నిలువునా కుంగదీస్తోంది. కాయకష్టం కన్నీటి కాష్ఠమై సాగుదారుల బతుకుల్లో గూడు కట్టిన దైన్యం తాలూకు దుష్పరిణామాలేమిటో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తాజా సేద్య గణన వెల్లడిస్తోంది. అయిదేళ్ల వ్యవధిలో దేశీయంగా సాగు విస్తీర్ణం 24 లక్షల హెక్టార్ల (60 లక్షల ఎకరాల) మేర కుంచించుకుపోయిందన్నది ఆ అధ్యయన సారాంశం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఆ కుంగుదల సుమారు ఏడు లక్షల 82 వేల ఎకరాలు! ఒక్క మహారాష్ట్ర మినహా తక్కిన పెద్ద రాష్ట్రాలన్నింటా సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. వాస్తవానికివి మూడేళ్ల క్రితంనాటి గణాంకాలు. ఏటా సగటున ఇంచుమించు అయిదు లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం పడిపోతున్నదన్న అంచనాల ప్రాతిపదికన, ఈ మూడు సంవత్సరాల్లో ఇంకో 15 లక్షల హెక్టార్ల (37 లక్షల ఎకరాల) దాకా భూముల్లో పంట దిగుబడుల్ని దేశం నష్టపోయింది! ఇంత పెద్దయెత్తున సాగు విస్తీర్ణం తెగ్గోసుకుపోతుండటం సమస్యకు ఒక పార్శ్వమే. మరోవైపు- పసిఫిక్‌, ఆసియా దేశాల్లో ముఖ్యంగా దక్షిణ భారతంలో వరి దిగుబడుల క్షీణత అనివార్యమన్న ఆసియా అభివృద్ధి బ్యాంకు హెచ్చరికలు బెంబేలెత్తిస్తున్నాయి. పేరుకు దేశం నలుమూలలా 660కి పైగా కృషి విజ్ఞాన కేంద్రాలు నెలకొన్నప్పటికీ, నిస్తేజమైన సాగు రంగానికి జవసత్వాలు సంతరింపజేసే ప్రణాళికాబద్ధ కృషి ఊపందుకోవడం లేదు. ఏళ్లతరబడి ప్రభుత్వాల ఉదాసీనత మూలాన దేశంలో సగటు రైతు కుటుంబ నెల ఆదాయం ఆరు వేల రూపాయలకు మించడంలేదు. రోజూ కనీసం రెండు వేల మంది రైతులు కాడీ మేడీ వదిలేసి ప్రత్యామ్నాయాల అన్వేషణలో పంటపొలాలకు దూరమవుతున్నట్లు ఏనాడో వెల్లడైనా సరైన దిద్దుబాటు చర్యలు కొరవడ్డ పర్యవసానంగా, దేశ ఆహార భద్రతే నేడు ప్రశ్నార్థకమవుతోంది. 
దేశంలో వ్యవసాయేతర కార్యకలాపాలకు భూముల మళ్లింపు జోరెత్తడానికి ప్రధాన ప్రేరణ, సాగుదారుల నష్టజాతకమే. మద్దతు ధరలపై నాయక గణం మాటలు కోటలు దాటుతున్నప్పటికీ, నిజంగా దక్కుతున్న సర్కారీ తోడ్పాటు అరకొరే. వరి సాగుకయ్యే నికర వ్యయం, సగటు దిగుబడి, వాస్తవంగా లభిస్తున్న ధరలు... అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే తెలుగు రైతులు ప్రతి ఎకరాకూ పెట్టుబడిలోనే ఆరువేల రూపాయలదాకా నష్టపోవాల్సి వస్తోంది. తరతమ భేదాలతో ఇతర పంటల ఉత్పత్తి వ్యయానికి, కేంద్రం కంటితుడుపు మద్దతుకు ఎక్కడా పొంతన కుదరడంలేదని రైతు సంఘాలు సూటిగా తప్పుపడుతున్నాయి. ఇటీవల దిల్లీని దిగ్బంధించిన సాగుదారులు- స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల అమలుతోపాటు ఇతరత్రా డిమాండ్లపైనా గళమెత్తడం ద్వారా సేద్యరంగ దుస్థితిగతుల తీవ్రతను లోకం కళ్లకు కట్టారు. ఇంతమొత్తం మద్దతు అన్నది కాదు, రైతు గౌరవప్రద జీవనానికి గరిష్ఠ దన్ను సమకూరే వాతావరణమే నేలతల్లి బిడ్డలకు సాంత్వన ప్రసాదించగలిగేది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ పేరిట అన్నదాతల్ని పస్తుపెట్టే విపరీత ధోరణుల పుణ్యమా అని, ఆరున్నర దశాబ్దాల్లో స్థూల దేశీయోత్పత్తిలో సేద్యరంగ వాటా 51 శాతం నుంచి 14 శాతానికి పడిపోయింది. ఏ కోశానా తన ప్రమేయం లేని ప్రకృతి విపత్తులు, చీడపీడలు, విపణిశక్తుల దాష్టీకాలు సహా ఎప్పుడు ఎటువంటి కష్టం దాపురించినా రైతే నిస్సహాయంగా నష్టాల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తోంది. దిక్కుతోచని స్థితిలో 1995-96 లగాయతు మూడు లక్షలమందికి పైగా కర్షకులు బలవన్మరణాలకు పాల్పడ్డట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ మదింపు వేసింది. అధికారికంగా నమోదుకాని ఆత్మహత్యలెన్నో ఎవరికెరుక! 2022 నాటికి రెండింతల రాబడి ప్రణాళికలపై ఏలికలు వేస్తున్న చిటికెల పందిళ్లు, బతుకుదీపాలు కొడిగడుతున్న బడుగు రైతులపట్ల క్రూరపరిహాసం. ఏ ఉత్పాదనకైనా ఉత్పత్తి వ్యయం, ఇతరత్రా ఖర్చులు, లాభం కలిపి ధర నిర్ణయించే పద్ధతిని పంట దిగుబడులకూ వర్తింపజేయడమే న్యాయం. 
వచ్చే రెండున్నర దశాబ్దాల్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఇండియాలో ఆహారధాన్యాల దిగుబడులు 50-75 శాతం దాకా ఇనుమడించాల్సి ఉంది. ‘బ్రిక్స్‌’ దేశాలన్నింటా కనిష్ఠంగా భారత్‌లో హెక్టారుకు 2.4 టన్నుల బియ్యం ఉత్పత్తి- తిండికి తిమ్మరాజు లాంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల పనిపోకడలకే అద్దం పడుతోంది. వంటనూనెలు, తృణధాన్యాలు తదితరాల వార్షిక దిగుమతి బిల్లే లక్షా 60 వేలకోట్ల రూపాయలు! భౌగోళిక విస్తీర్ణంలో కేవలం 15 శాతమే ఉన్న సేద్యయోగ్య భూముల్లో భూరి దిగుబడుల సాధనతో చైనా దేశీయ అవసరాల్లో 95 శాతం వరకు సొంతంగా నిభాయించగలుగుతోంది. సగం ఎడారి, అయిదోవంతు భూమే సాగుయోగ్యమైన ఇజ్రాయెల్‌ ఆధునిక పరిజ్ఞానంతో చేస్తున్న సృజనాత్మక సేద్యం అద్భుత పంటసిరులు కురిపిస్తోంది. వియత్నాం, థాయ్‌లాండ్‌, మియన్మార్‌ వంటి చిన్నదేశాలూ వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో విశేషంగా రాణిస్తున్నాయి. వాటితో పోలిస్తే ఎన్నో అనుకూలాంశాలు కలిగి ఉండీ, వ్యవస్థాగత అలసత్వంతో ఇండియా సేద్యసంక్షోభాల కేంద్రస్థలిగా భ్రష్టుపడుతోంది. వైవిధ్యభరితమైన పంటల సాగుకు అనుకూలించే భిన్నవాతావరణ జోన్లు కలిగిన దేశం మనది. చైనా, అమెరికా, ఆస్ట్రేలియాలకు దీటుగా దిగుబడులు పెంచుకోగలిగితే- దేశీయ ఆహారావసరాలకై పరాధీనత విరగడ కావడంతోపాటు, ఎగుమతుల అవకాశాలూ విప్పారుతాయి. రైతులకు జీవనభద్రత, మందకొడి సేద్య విశ్వవిద్యాలయాలూ పరిశోధన సంస్థలపై చర్యల కొరడా, జాతీయ స్థాయిలో సమగ్ర వ్యవసాయ కార్యాచరణ సాకారమైనప్పుడే- జైకిసాన్‌ ఉద్యమస్ఫూర్తికి నేతలు గొడుగు పట్టినట్లవుతుంది!


జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు