చమురు మంటల్లో సామాన్యుడు 
close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చమురు మంటల్లో సామాన్యుడు 

పన్నులతో ఆజ్యం పోస్తున్న పాలకులు 

చమురు మంటల్లో సామాన్యుడు 

భారత్‌ ముడిచమురు దిగుమతులపైన అధికంగా ఆధారపడుతున్న దేశం. 80 శాతం చమురు అవసరాలను దిగుమతులే తీరుస్తున్నాయి. 2008లో పీపా ముడిచమురు ధర 146 డాలర్లు ఉండగా, 2016 జనవరి నాటికి 27 డాలర్లకు పడిపోయింది. తాజాగా 85 డాలర్లు దాటింది. 2008లో లీటరు పెట్రోల్‌ ధర రూ.50కి కాస్త అటూఇటూగా ఉండగా, లీటరు డీజిల్‌ ధర రూ.29గా ఉండేది. తరవాత ముడిచమురు ధర తగ్గినా ఫలితం లేకపోయింది. ఈ నెల నాలుగున ముంబయిలో లీటరు పెట్రోలు ధర రూ.91.34, డీజిలు రేటు రూ.80.10కు చేరింది. ప్రస్తుతం పెట్రోలు రూ.87.29కు, డీజిలు రూ.77.37కు విక్రయిస్తున్నారు. డిసెంబరులో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ధరల ప్రభావం ఉంటుందన్న ఆందోళన ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో వ్యక్తమవుతోంది. 2010 జూన్‌ నుంచి పెట్రోల్‌ పైనా, 2014 అక్టోబరు నుంచి డీజిల్‌ పైన కేంద్రం నియంత్రణ ఎత్తివేసింది. 2017 జూన్‌ 16 నుంచి రోజువారీ పెట్రోల్‌, డీజిల్‌ ధరల సవరణ విధానాన్ని అమలులోకి తెచ్చింది. అంతకుముందు 15 రోజులకు ఒకసారి ధరలు పెరిగేటప్పుడు దాని ప్రభావం తెలిసేది. కొత్త విధానంలో ప్రతి రోజూ కొన్ని పైసల వంతున పెంచుతుండటంతో వినియోగదారులు గమనించలేని పరిస్థితి నెలకొంది.

మున్ముందు మరిన్ని కష్టాలు 
చమురు ధరలు పెరగడానికి అంతర్జాతీయ అంశాలతోపాటు కొన్ని దేశీయ కారణాలూ దోహదపడుతున్నాయి. ముడిచమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలు రోజుకు 18 లక్షల పీపాల ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో అంతర్జాతీయ విపణిలో ఆ మేరకు ప్రభావం కనబడుతోంది. ముడిచమురు విస్తారంగా ఉత్పత్తి చేస్తున్న వెనెజువెలా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో 40 శాతం మేరకు ఉత్పత్తి పడిపోయింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ఫలితంగా ఉత్పత్తి రోజుకు 50 లక్షల నుంచి లక్ష కోట్ల పీపాల మేర కోతపడుతుందని అంచనా. జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి ఐరోపా దేశాలు, చమురు అధికంగా దిగుమతి చేసుకుంటున్న చైనా, భారత్‌ ఈ ఆంక్షలను పట్టించుకోకుండా దిగుమతులు కొనసాగించాయి. ఆర్థికమాంద్యం నుంచి ప్రపంచ దేశాలు కోలుకోవడంతో ముడిచమురు వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా ధరలు ఎగబాకడం మొదలైంది. అసలు సమస్య ఇప్పుడే మొదలైందని, మున్ముందు భారత్‌ తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఫలితంగా రూపాయి ఇంకా బలహీనపడవచ్చు. కరెంటు ఖాతా లోటు మరింత భారంగా మారవచ్చు. ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఇవి దేశ ఆర్థికాభివృద్ధికి ఇబ్బందికరమే. చమురు దిగుమతులకు ఏటా 87.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.5.6 లక్షల కోట్లు) చెల్లించాల్సి వస్తోంది. ఇది రాబోయే రోజుల్లో పెరగవచ్చు. ముడిచమురు ధరల పెరుగుదలను కట్టడి చేయడానికి అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు కనబడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలను పట్టించుకోకుండా కొన్ని దేశాలు దిగుమతులను కొనసాగిస్తున్నాయి. ఆంక్షలవల్ల ఇరాన్‌లో తగ్గబోయే ఉత్పత్తిని చమురు ఎగుమతుల దేశాల సంస్థ (ఒపెక్‌) సభ్య దేశాలు భర్తీచేయాలని భావిస్తున్నాయి. 
అంతర్జాతీయంగా పెట్రో ధరలు పైకి ఎగబాకుతున్నాయి. దేశీయంగానూ ధరలు పెచ్చరిల్లుతున్నాయి. కానీ 2014లో పీపా ముడిచమురు ధర 112 డాలర్లుగా ఉన్నప్పుడు దేశీయంగా లీటరు పెట్రోల్‌ రూ.71, డీజిల్‌ రూ.57లకు లభ్యమయ్యేవి. నేడు అంతకన్నా తక్కువగా పీపా 82 డాలర్లుగా ఉన్నప్పటికీ ముంబయిలో పెట్రోల్‌ లీటరు రూ.90కు, డీజిల్‌ రూ.80కు చేరడాన్ని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఎక్సైజ్‌ పన్నులు, రాష్ట్రాలు ‘వ్యాట్‌’ను విపరీతంగా పెంచడమే ఇందుకు కారణం. 2014 నవంబరు నుంచి 2016 జనవరి మధ్యకాలంలో కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని తొమ్మిదిసార్లు పెంచింది. ఎక్సైజ్‌ డ్యూటీపై పలు సెస్‌లతో కలిపి అదనంగా రూ.11.77 పెట్రోలుపై, రూ.13.47 డీజిల్‌పై విధించింది. ఫలితంగా 2013లో కేంద్రానికి రూ.88,600 కోట్లు పెట్రో పన్నులు రాగా, అది 2018 మార్చి నాటికి ఆ మొత్తం రూ.2,57,900 కోట్లకు చేరుకుంది. మరోపక్క రాష్ట్రాలు సైతం ఇష్టానుసారం వ్యాట్‌ను పెంచడం మొదలుపెట్టాయి. ఫలితంగా ధరలు తడిసి మోపెడయ్యాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు, కేంద్ర-రాష్ట్ర పన్నుల మూలంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కాస్త ఎక్కువ అనిపించినప్పటికీ భారమనిపించేవి కాదు. కానీ అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, కేంద్ర, రాష్ట్రాలు గతంలో పెంచిన పన్నులు తగ్గించకపోవడంతో వినియోగదారులపై భారం పడుతోంది. పెట్రోల్‌ ధరల్లో దాదాపు 50 శాతం పైగా, డీజిల్‌ ధరల్లో 40 శాతంపైగా పన్నులు, డీలర్ల కమీషన్లు ఉంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇవి వేర్వేరుగా ఉంటున్నాయి. ఇటీవల ప్రజాగ్రహానికి జడిసి కేంద్రం దిగివచ్చి కొంతమేరకు ధర తగ్గించింది. వెంటనే భాజపా పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌, తాజాగా భాజపాయేతర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక వ్యాట్‌ తగ్గించాయి. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెంపు కొనసాగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించినప్పటికీ వినియోగదారుడికి పూర్తి మేలు బదిలీ కాలేదు.

చమురు మంటల్లో సామాన్యుడు 

దేశంలో పెట్రోల్‌ కన్నా డీజిల్‌ వినియోగం అధికం. దీని ధర ఏ మాత్రం పెరిగినా నిత్యావసర వస్తువుల ధరలపై దాని ప్రభావం పడుతుంది. సామాన్యుల బతుకు భారమవుతుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం అయిదు శాతానికి చేరువగా ఉంది. డీజిల్‌ ధరల కారణంగా రవాణా అవసరాలకు ప్రజలు ఎక్కువ చెల్లించవలసి వస్తుంది. ఫలితంగా ప్రభుత్వానికి చమురు దిగుమతులు భారమవుతాయి. ద్రవ్యలోటు, వాణిజ్యలోటు పెరుగుతుంది. దేశీయ కరెన్సీ బలహీనమవుతుంది. దానివల్ల వృద్ధిరేటు పతనమవుతుంది. ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతుంది. విదేశ మారక నిల్వలు కరిగిపోవడం ప్రారంభిస్తాయి. కరెన్సీ విలువ తగ్గుతుంది. దిగుమతులపై ఆధారపడే కంపెనీల లాభాలు తగ్గుతాయి. బ్యారెల్‌కు కనీసం 10 డాలర్లు పెరిగితే, ఆర్థిక వ్యవస్థపై 0.1 శాతం, కరెంటు ఖాతాలోటుపై జీడీపీలో 0.4 శాతం ప్రతికూల ప్రభావం చూపుతుంది. 2017 ఏప్రిల్‌లో ముడిచమురు దిగుమతుల విలువ 736 కోట్ల డాలర్లు. 2018 ఏప్రిల్‌లో అది 1,041 కోట్ల డాలర్లు. 2016-17లో ముడిచమురు దిగుమతులపై కేంద్రం రూ.4.70 లక్షల కోట్లు ఖర్చు చేయగా, 2017-18లో రూ.5.65 లక్షల కోట్లు వెచ్చించింది. ఈ పెరుగుదల దేశ ఆర్థికవ్యవస్థను ఎక్కడకు తీసుకెళ్తుందోనని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. 
ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం ముందు కొన్ని మార్గాలున్నాయి. కేంద్రం కనీసం 50 శాతం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించాలి. రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గింపును రూపాయి, రెండు రూపాయలకే పరిమితం చేయకుండా కేంద్రం బాటలో నడవాలి. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయమై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి. వీటితోపాటు దేశీయంగా చమురు నిక్షేపాలను అన్వేషించాలి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా నాగాయలంకలో భారీగా చములు నిక్షేపాలు గుర్తించారు. ఇలాంటి అన్వేషణలు మరిన్ని చేయాలి. అదే సమయంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాలి. వాహనదారులూ స్వీయ నియంత్రణ పాటించాలి. వారంలో ఒకరోజు సొంత వాహనానికి దూరంగా ఉండాలి. ఇటీవలి కాలంలో బెల్జియంలోని క్యాథలిక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రంపపు పొట్టు నుంచి పెట్రోల్‌ను తయారుచేసే ప్రక్రియను కనిపెట్టారు. ఈ దిశగా భారత్‌ కూడా అడుగులు వేయాలి.

చమురు మంటల్లో సామాన్యుడు 

భారత్‌లోనే అధికం 
పెట్రో, డీజిల్‌ ధరలు ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. ధరల సమీక్ష విధానం చమురు సంస్థలకు లాభాలు పండిస్తుండగా ప్రజల జేబులకు చిల్లులు పెడుతోంది. భారత్‌ కన్నా పొరుగు దేశాల్లో వీటి ధరలు తక్కువ. పాకిస్థాన్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.50.6, డీజిల్‌ రూ.57. బంగ్లాదేశ్‌లో రూ.68.4, రూ.51.7, శ్రీలంకలో రూ.49.6, రూ.40.3, నేపాల్లో రూ.66.6, రూ.54.7గా ఉండటం గమనించాలి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల మధ్య తేడా తగ్గిపోతోంది. దీంతో డీజిల్‌ వాహన యజమానులు పొందే లబ్ధి సైతం తగ్గిపోతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌పై విధిస్తున్న పన్నులు ఎక్కువే. భారత్‌లో కేంద్ర, రాష్ట్రాలు తమ ఆదాయానికి కోత పడకుండా జాగ్రత్త పడుతున్నాయి తప్ప, సగటు మనిషి గురించి ఆలోచించడం లేదు. అమెరికాలో ఇంధనం పన్నులు 17 శాతం, పాకిస్థాన్‌లో 23.5 శాతం, ఐరోపా దేశాల్లో 21 శాతం, బంగ్లాదేశ్‌లో 15 శాతంగా ఉంది. భారత్‌ పెట్రోల్‌ ధరల్లో పన్నుల వాటా దాదాపు 50 శాతం, డీజిల్‌ ధరల్లో ఇది 40 శాతం. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినప్పుడు కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో, రాష్ట్రాలు వ్యాట్‌ రూపంలో లబ్ధి పొందుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాలు తమ పన్నులను తగ్గించుకోకపోతే ప్రజల నుంచి నిరసనను ఎదుర్కొనక తప్పదు. ప్రభుత్వాలు చమురు ఆధారిత భారీ పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇవ్వకుండా చమురు రహిత, చమురు అవసరం లేని రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది!

- ప్రొఫెసర్‌ పి.వెంకటేశ్వర్లు (రచయిత- ఆంధ్రా విశ్వవిద్యాలయ వాణిజ్య విభాగం ఆచార్యులు)

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo