close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ప్రతిభకు పురస్కారం

సమస్యలు సవాళ్లు విసిరినా... సమాజం ఎగతాళి చేసినా...
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా...
జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినా...
పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా...
ఒడుదొడుకులు తడబడేలా చేసినా...
మందలో ఒకరిగా కాకుండా.... లక్షల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు...
పురుషులు కూడా తమతో పోటీ పడలేరని నిరూపించుకుంటూ...
తమ బాధ్యతలూ సమర్థంగా నిర్వర్తించుకుంటూ... సమస్యలపై సునాయసంగా సవారి చేస్తూ...
అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు మహిళలు. వాళ్లందరినీ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘ఈనాడు-వసుంధర’ గౌరవించింది. పురస్కారాలతో సత్కరించింది.

ఆ మాటే స్ఫూర్తి
సరిత
అదనపు ఎస్పీ
పాలనా రంగం

ఆమె ప్రసంగం ఓ వ్యక్తిత్వ వికాస పాఠం. యువతరానికి దిశానిర్దేశం చేసి, బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపగలరు. ఆమే కేజీవీ సరిత. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు విభాగంలో అదనపు ఎస్పీగా విధులు చేపడుతూనే, సీఐడీ, మహిళా భద్రతా విభాగానికి ఇన్‌ఛార్జీ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కెరీర్‌ గైడెన్స్‌, వ్యక్తిత్వ వికాసం, స్ఫూర్తిని నింపే అంశాలపై సరిత చేసిన ప్రసంగాలు సామాజిక మాధ్యమాల్లో అందరి మన్ననలను పొందుతున్నాయి. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా ఇప్పటి వరకు 600కు పైగా ప్రసంగాలిచ్చారు. ఎక్కువగా బాలికలు, యువతుల సమస్యలపై స్పందిస్తారు. వీటి ఆధారంగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం ఈమె ప్రత్యేకత. బాధితులు, సమస్యలున్నవారు సరితను కలిస్తే, వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పరిష్కారం చూపుతారు.
సైకాలజీలో డిగ్రీ పూర్తిచేసిన సరిత... ఆ తరువాత ఎమ్మెస్సీ సైకాలజీని కూడా చదివారు. తన వృత్తిలో భాగంగానే మహిళల సమస్యలను తెలుసుకునేందుకు తన చదువు ఎంతో ఉపయోగపడుతోందని చెబుతారీమె. తన ప్రసంగాల్లో అధికంగా పురాణాలు, ఇతిహాసాల్లోని సారాంశాన్ని మిళితం చేసి వాటిని కథల్లాగా విద్యార్థులకు చెబుతారు. ఇవి వారి వ్యక్తిత్త్వాన్ని తీర్చిదిద్దేలా ఉంటాయి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు అనుసరించాల్సిన జాగ్రత్తలు కూడా తన ప్రసంగాల ద్వారా చెబుతారు.  ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో సబ్‌డివిజనల్‌ పోలీసు అధికారిణిగా తొలుత బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, బాలికల వసతి గృహాల్లో వందలాది అవగాహన సదస్సులు నిర్వహించారు. అక్కడివారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటికి పరిష్కారాన్ని చూపించేవారు. ఏలూరులో విధులు నిర్వహించేటప్పుడు ‘పల్లె నిద్ర’ పేరుతో ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో రాత్రిపూట నిద్రించేవారు. పిల్లల సమస్యలు తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. అలాగే జాతీయ సదస్సుల్లో పాల్గొని చిన్నారులపై లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణా, మహిళాభద్రతపై ప్రసంగించారు. ప్రస్తుతం మహిళాభద్రత విభాగం అధిపతిగా తన వద్దకు సూచనలు, సలహాల కోసం వచ్చేవారికి భరోసా కల్పిస్తున్నారు.  చిన్నారులపై లైంగిక వేధింపుల అంశంపై దిల్లీతో జరిగిన జాతీయ సదస్సులో పత్ర సమర్పణ చేశారు. డిజిటల్‌ యుగంలో బాలలపై లైంగిక వేధింపులు అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఏపీ పోలీసు ప్రతినిధిగా పాల్గొని ప్రసంగించారు. ఎనిమిదో జాతీయ మహిళా పోలీసు సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ విభాగం తరఫున హాజరై మాట్లాడారు. దీంతోపాటు మానవ అక్రమ రవాణా, బాలల అదృశ్యంపై దిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగించారు. వీరి సమస్యలపైనా పోరాడుతున్నారు.

గిరిజన భాషలకు ప్రాణం...
ప్రసన్నశ్రీ
సేవా రంగం

ఆంధ్రవిశ్వవిద్యాలయ ఇంగ్లిషు విభాగ ఆచార్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ 18 గిరిజన భాషలకు లిపులను సృష్టించి రికార్డు సాధించారు. గిరిజన పుత్రిక అయిన ఆమె గిరిజన భాషలకు లిపి లేని కారణంగానే వారు చదువంటే ఆసక్తి చూపలేకపోతున్నారని గమనించారు. 1990వ సంవత్సరం నుంచి 2010 వరకూ శ్రమించి 18 గిరిజన భాషలకు లిపిలను ఆవిష్కరించారు. గిరిజన పుత్రికగా తన జాతికి ఎంతో కొంత న్యాయం చేయాలనే లక్ష్యంతో ఓ పక్క విధులు నిర్వర్తిస్తూనే సెలవులు దొరికినప్పుడల్లా గిరిజన ప్రాంతాలకు వెళ్లి వాళ్ల వెనకబాటుతనంపై అధ్యయనం చేశారు. పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో విధులు నిర్వర్తించే రోజుల నుంచే ఈ అధ్యయనం చేయడం మొదలుపెట్టారు ప్రసన్నశ్రీ. ఆయా జాతుల మాటతీరు, యాస, ఉచ్ఛారణలకు అనుగుణంగా ఆమె సృష్టించిన లిపుల్లోని అక్షరాలు ఆయా గిరిజనుల జీవితాలను ప్రతిబింబించేలా ఉండడంతో ఆ అక్షరాలను గిరిజనులు అర్థం చేసుకోగలుగుతున్నారు. 1990వ సంవత్సరంలో ప్రారంభమైన అక్షరాల ఆవిష్కరణ క్రతువును 2010వ సంవత్సరం వరకు కొనసాగించారు. కమ్మర, కోయ, దౌడ్‌, కొటియా వంటి భాషలకు లిపులను రూపొందించారు. ఆంధ్రవిశ్వ విద్యాలయంలోనే ఎంఏ ఇంగ్లిషు పూర్తిచేశారు. 1987లో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగం సహాయ ఆచార్యురాలిగా ఉద్యోగంలో చేరి అసోసియేట్‌ ఆచార్యురాలిగా పదోన్నతి పొందారు. ఆపై ఆంధ్రవిశ్వవిద్యాలయ అసోసియేట్‌ ఆచార్యురాలిగా ఎంపికయ్యారు. అనంతరం ఆచార్యురాలిగా పదోన్నతి పొందారు. తన 32 ఏళ్ల ప్రస్థానంలో ఆమె వర్సిటీ ఆంగ్ల విభాగం ఆచార్యురాలిగానే కాకుండా విభాగాధిపతిగా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌గా, ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా, ఎ.యు. మహిళా వసతిగృహాల చీఫ్‌వార్డెన్‌గా, నాక్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యురాలిగా... మరెన్నో పదవులు అలంకరించారు.

వైద్యురాలిగా... స్వచ్ఛ సంరక్షణిగా...!
డాక్టర్‌ పద్మావతి
వైద్యం, సేవా రంగం

నాలుగున్నర సంవత్సరాలుగా కృష్ణాజిల్లా చల్లపల్లిలో జరుగుతున్న నిరంతర స్వచ్ఛ-సుందర ఉద్యమం దేశానికే మార్గదర్శకం. ఇందులో డాక్టర్‌ టి.పద్మావతి పాత్ర అద్వితీయం. ఆమె వృత్తిరీత్యా వైద్యురాలు. ఈ ఉద్యమానికి ఆమె భర్త డాక్టర్‌ డీఆర్‌కే ప్రసాద్‌ సారథ్యం వహిస్తుండగా, దీని ఫలితాల సాధనలో ఆమె పాత్ర ఎనలేనిది.
ప్రతి వేకువజామున నాలుగు గంటలకు ప్రారంభమయ్యే స్వచ్ఛ, పరిశుభ్రత సంకల్పంలో తొలి అడుగు ఆమే వేస్తారు. చీపురు పట్టుకొని రహదారి ఊడ్చేస్తారు. ఎంచుకున్న ప్రాంతాన్ని అద్దంలా తీర్చిదిద్దుతారు. శుభ్రం చేసిన ప్రాంతంలో పూల మొక్కలు పెడతారు. అలా రోజూ రెండుగంటలపాటు పరిసరాల శుభ్రతలో మునిగిపోతారు. డాక్టర్‌ పద్మావతి 31 సంవత్సరాలుగా కృష్ణాజిల్లా దివిసీమలో స్త్రీ వైద్య నిపుణురాలిగా సేవలందిస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛతవైపు దృష్టిపెట్టారు.   ఆమెను చూసి చాలామంది ఉద్యమంలో భాగస్వాములయ్యారు. తొలుత తన కాలనీ నుంచి ఈ స్వచ్ఛ ప్రతిజ్ఞను ప్రారంభించారు. కాలనీకి వచ్చే రహదారిలో బహిరంగ మల, మూత్ర విసర్జన జరుగుతుండేది. మూడు నెలల్లో దానిని పూర్తిగా నివారించేలా చర్యలు తీసుకున్నారు. 2014 నవంబరు 12 నుంచి గ్రామవ్యాప్తంగా స్వచ్ఛ కార్యక్రమం తలపెట్టారు. పరిశుభ్రత లక్ష్యంగా పెట్టుకొని ఇది ప్రారంభమైనా దీని రూపు రేఖలను డాక్టర్‌ పద్మావతి పూర్తిగా మార్చేశారు. అందుకు గ్రామంలో దాదాపు 5000లకు పైగా మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. గ్రామంలో చెత్తనంతా తరలించి ఎరువుగా మార్చే డంపింగ్‌యార్డు అభివృద్ధికి ఆమె కృషి చేశారు. పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంలో ఆర్థిక తోడ్పాటు ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఊరిని నందనవనంగా మార్చేశారు. ఇప్పటివరకు స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమానికి రూ.3 కోట్లకు పైగా ఖర్చు పెట్టగా, ఇందులో ఆమె ఇచ్చిన విరాళాలే అత్యధికం.  తన ఆదాయంలో ఎక్కువశాతం  ఊరికే కేటాయిస్తున్నారు.

ఒక్కో మెట్టు ఎక్కుతూ...
సైనా నెహ్వాల్‌
క్రీడా రంగం

ఆమె కోర్టులోకి దిగితే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. ఆమే భారత బ్యాడ్మింటన్‌ సత్తాను ప్రపంచానికి చాటిన సైనా నెహ్వాల్‌. లెక్కకు మిక్కిలి సూపర్‌ టైటిళ్లు సాధించిన క్రీడాకారిణి. సైనా నెహ్వాల్‌ 1990లో హరియాణాలోని హిస్సార్‌లో జన్మించింది. తండ్రి హరివీర్‌ సింగ్‌ నెహ్వాల్‌. వ్యవసాయ శాస్త్రవేత్త. తండ్రి ఉద్యోగరీత్యా ఎన్నోఏళ్ల క్రితమే ఆ కుటుంబం హైదరాబాద్‌కు మారింది. మొదట్లో స్థానిక భాష రాకపోవడంతో నెహ్వాల్‌ ఇక్కడున్నవారితో కలవకపోయేది. దీంతో తల్లి ఉషారాణి ఆమెతో బ్యాడ్మింటన్‌ ఆడటం మొదలుపెట్టింది. అప్పటికే సైనాకు కరాటేలో ప్రవేశం ఉంది. బ్యాడ్మింటన్‌లో ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు  ఎనిమిదేళ్ల వయసులో పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో చేర్పించారు. అక్కడ ఎస్‌.ఎం ఆరిఫ్‌ దగ్గర శిక్షణ పొందింది. సైనా గెలిచిన మొదటి మేజర్‌ టోర్నమెంట్‌ 2003 జూనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌. 2006లో జరిగిన కామన్‌వెల్త్‌ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరచి ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ జట్టు కాంస్య పతకం గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించింది. 2009లో ఇండోనేషియా ఓపెన్‌ నెగ్గి బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ సాధించిన మొదటి భారతీయ షెట్లర్‌గా అవతరించింది. 2012లో లండన్‌ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం నెగ్గిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా ఘనత కూడా ఆమెదే. ఇప్పటి వరకు మొత్తం 24 టైటిళ్లు న ఖాతాలో వేసుకుంది. 2015లో నెంబర్‌ వన్‌ ర్యాంకు సాధించింది. ఇటీవలే సహచర ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ను పెళ్లిచేసుకుంది. జీవితంలో ఎన్నో సూపర్‌ టైటిళ్లు సాధించినా ఆల్‌ ఇంగ్లాండ్‌ టైటిల్‌ను మాత్రం గెలవలేకపోయ. సైనా ప్రతిభను0 గుర్తించిన భారత ప్రభుత్వం 2009లో అర్జున అవార్డు అందజేసింది. 2010లో ప్రభుత్వం ఖేల్‌రత్న, పద్మ శ్రీ పురస్కారాలతో సత్కరించింది. 2016లో పద్మ భూషణ్‌తో గౌరవించింది.

రియాలిటీ షోలతో...
మల్లెమాల శ్రీదీప్తిరెడ్డి
టీవీ రంగం

కవి, నిర్మాత డాక్టర్‌ ఎం.ఎస్‌.రెడ్డి మనవరాలు, ప్రఖ్యాత సినీ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి తనయే శ్రీదీప్తి రెడ్డి. పదేళ్లుగా బుల్లి తెరపై వినోదాన్ని పంచుతూ... ఈటీవీతో కలిసి నడుస్తున్నారు. చిన్న వయసులోనే దీప్తి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ తండ్రికి తగ్గ తనయ అని అనిపించుకుంటున్నారు. ఆమె నిర్మాణ సారథ్యంలో ప్రసారమవుతోన్న బజర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌.. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న రియాలిటీ షోలు. ఎంతో మంది కళాకారులకు వేదిక పంచడమే కాదు.. వారికి జీవితాల్ని కూడా ఇచ్చారు. దీప్తికి ఇంజినీరింగ్‌ చదువుతుండగానే క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరాలా... ప్రొడక్షన్‌ బాధ్యతలు తీసుకోవాలా అని సందిగ్ధంలో పడ్డారు. చివరికి తండ్రి బాటలోనే అడుగులు వేయాలనుకున్నారు. అలాగని నేరుగా వచ్చేయలేదు.  మంజులానాయుడి దగ్గర మూడు నెలలు శిక్షణ పొందారు. ఆ తరువాత స్వయంగా శ్రావణ మేఘాలు అనే సీరియల్‌ని నిర్మించారు. అక్కడితో ఆగిపోకుండా.. మల్లెమాల సంస్థను.. ‘మల్లెమాల టెలీ ఎంటర్‌ప్రైజెస్‌’గా బుల్లి తెరకు మరలించారు. అప్పుడే ఈటీవీ ఒకేసారి ఎనిమిది సీరియళ్లను ప్రసారం చేసి గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకొంది. వాటిలో దీప్తి ఒక సీరియల్‌ నిర్మించే అవకాశం సొంతం చేసుకున్నారు. అది   హిట్టయ్యింది. ఆ కిక్‌తో తనదైన ముద్రతో రియాలిటీ షో చేయాలనుకున్నారు. ఇలా వచ్చిందే ‘ఢీ’ కార్యక్రమం.ప్రస్తుతం ఢీ 11గా ఈటీవీలో ప్రసారమవుతోంది. ఆ తరువాత ‘అదుర్స్‌’ ప్రోగామ్‌ని ఎనిమిది భాషల్లో తీశారు. దానికి బెస్ట్‌ ఫీచర్‌గా నంది అవార్డు వచ్చింది. ఈటీవీ అత్యంత ప్రతిష్ఠాత్మంగా ప్రసారం చేసే స్టార్‌ మహిళ బాధ్యతల్నీ దీప్తిరెడ్డి తన భుజాల మీద వేసుకున్నారు. అంతేకాదు ఈటీవీలో అత్యంత ఆదరణ ఉన్న ఉన్న ధారావాహిక ‘మనసు మమత’ మల్లెమాల నిర్మాణ సంస్థ తరఫున తొమ్మిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోంది.

అవకాశాలు అందుకుని...
నందిని రెడ్డి
సినిమా రంగం

మహిళా దర్శకుల్లో ఒకరిగా తనకంటూ గుర్తింపు సాధించారు నందినీరెడ్డి. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆమె జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయంలో నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. చిన్నప్పటి నుంచే నాటికలు, ఉపన్యాసాలు, ఇవ్వటంలో చురుగ్గా ఉండేవారు. సినిమాలంటే ఎంతో ఇష్టం. ఆ ఆసక్తితోనే నందిని సినిమాల్లోకి వచ్చారు. తొలుత లిటిల్‌ సోల్జర్స్‌ సినిమాకు సహాయ దర్శకురాలిగా పని చేశారు. తరువాత తొలి సినిమా అలా మొదలైందితో ఉత్తమ దర్శకురాలిగా నంది అవార్డు అందుకున్నారు. అతి తక్కువ మంది మహిళా దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. మొదట్లో లిటిల్‌ సోల్జర్స్‌కి సహాయ దర్శకురాలిగా పనిచేశారు. ఆ సమయంలో చాలామంది ఆమెని చూసి సహాయ దర్శకురాలు అని చెబితే నమ్మలేకపోయేవారు. ‘నువ్వు డ్యాన్సర్‌వా, హెయిర్‌ డ్రెస్సర్‌వా’ అని రకరకాలు అడిగేవారట. ఎలాగైనా ఈ రంగంలో మహిళల సంఖ్య పెరగాలని అనుకున్నారు. తాను కూడా దర్శకురాలిగా రాణించాలని కలలు కన్నారు. లిటిల్‌ సోల్జర్స్‌ తరువాత కొందరు దర్శకులు ఆమెకి అవకాశం ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆ తరువాత ఆమె ప్రతిభను గుర్తించి దర్శకులు, నిర్మాణ సంస్థలు.. నందినిని తమ బృందంలో చేర్చుకున్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా.. ఎన్ని ఆటంకాలు అడ్డుపడ్డా.. ఆమె దర్శకురాలిగా రాణించాలనే తపనను మాత్రం పక్కనపెట్టలేదు. ఆ లక్ష్యానికే కట్టుబడి ఉన్నారు. సినిమా రంగంలో సహాయకురాలిగా.. తనకంటూ అనుభవం వచ్చాక 2011లో ‘అలా మొదలైంది’తో వెండితెర మీద దర్శకురాలిగా మెరిశారు. ఆ తరువాత ‘జబర్దస్త్‌’, ‘కల్యాణవైభోగమే’.. వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. అలానే కొన్ని వెబ్‌సిరీస్‌లు చేశారు. నందిని ఆహార్యం అందరికంటే ప్రత్యేకం. హెయిర్‌ కట్‌తో, ప్యాంటు, షర్టు ధరిస్తారు. గంభీరంగా, ఉట్టిపడే ఆత్మవిశ్వాసంతో కనిపించడం ఆమె ప్రత్యేకత.

గాజుతెర బద్దలు కొట్టి...
బిందూ కునాటి
వ్యాపార రంగం

అందరూ నడిచే దారిలో కాకుండా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని సత్తా చాటారు బిందు కునాటి. లిఫ్ట్‌లు, ఎలివేటర్ల తయారీలో తనదైన ముద్ర వేశారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కెరీర్‌ ప్రారంభించి వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగారు. పురుషాధిక్యత కలిగిన ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ రంగంలో అడుగు పెట్టడమే కాదు... లిఫ్ట్‌ల తయారీతో బడా బ్రాండ్‌లకు సైతం పోటీగా తనకో ప్రత్యేకత సంపాదించుకున్నారు. అమెరికాలో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌, ఐటీలో ఎంఎస్‌ చేశారు. పెళ్లి, పిల్లలు... జీవితం అన్నీ సాఫీగానే సాగుతున్నా ఏదో సాధించాలన్న తపన ఉండేది. అందుకే భర్తను ఒప్పించి ఖాయిలా పడ్డ ఓ పరిశ్రమను చేపట్టారు. అలా సాల్జిగిట్టర్‌ హైడ్రాలిక్స్‌ సంస్థ ఏర్పాటైంది. బిందు ఉద్యోగం చేస్తూ మొదట్లో ఈ హైడ్రాలిక్స్‌ సంస్థలో పేరుకు భాగస్వామిగా ఉండేవారు. పూర్తి స్థాయిలో ఆ సంస్థపై దృష్టిపెట్టాలన్న ఆలోచనతో ఉద్యోగానికి రాజీనామా చేసి హైడ్రాలిక్స్‌ సంస్థలో నూతన పరిశోధనలు చేయాలనుకున్నారు. అలా చేస్తున్నప్పుడే మొదట ఫోర్క్‌ లిఫ్ట్‌లు, తరువాత హైడ్రాలిక్స్‌ లిఫ్ట్‌ల తయారీ ఆలోచన తట్టింది. అలా సాల్జిగిట్టర్‌ లిఫ్ట్స్‌ పేరుతో హైడ్రాలిక్స్‌ అనుబంధంగా మరో సంస్థను ప్రారంభించారు. ఒకటి తయారు చేయగానే ఆర్డర్లు రావుగా... దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనికి తోడు పురుషాధిక్యత రంగంతోపాటు మరిన్ని సమస్యలు తప్పలేదు. అన్నింటినీ ఆత్మవిశ్వాసంతో అధిగమించారు. రెండేళ్ల క్రితం భర్త అనారోగ్యంతో మరణించాక లిఫ్ట్స్‌ సంస్థతోపాటు హైడ్రాలిక్స్‌ బాధ్యతలనూ తీసుకున్నారు. మహిళ కదా! అని చిన్న చూపు చూసిన ప్రతిచోటా... అవును మహిళనే. నాకో అవకాశం ఇచ్చి చూడండి అంటూ అడిగి మరీ తన సత్తా నిరూపించుకున్నారు. క్రమంగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలెన్నో ఆమె సంస్థకు ఖాతాదారులుగా మారాయి.

సొంత గుర్తింపు కోసం...
స్వప్నాదత్‌
సినిమా రంగం

తెలుగు సినీ రంగంలో నిర్మాతగా స్వప్నాదత్‌ తనదైన ముద్ర వేశారు. ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్‌ వ్యవస్థాపకులైన అశ్వనీదత్‌  కుమార్తెగా కాకుండా... సొంతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓహియో యూనివర్సిటీ నుంచి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదివిన స్వప్న తండ్రికి చిత్ర నిర్మాణ రంగంలో సాయం చేస్తూనే సోదరి ప్రియాదత్‌తో కలిసి సొంతంగా సినిమాలు తీశారు. అలా ఇద్దరూ కలిసి ఎవడే సుబ్రమణ్యం, మహానటి చిత్రాల్ని నిర్మించారు. సావిత్రి జీవితకథ ఆధారంగా తీసిన మహానటి చిత్రం జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించింది.
విదేశాల్లో చదువుకొని వచ్చాక పెద్దవాళ్లు పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. స్వప్న మాత్రం ‘ప్రొడక్షన్‌ హౌస్‌ ఏర్పాటు చేస్తా అంటూ మనసులో మాట బయటపెట్టారు. ‘అలాగే, జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకో’ అన్న తండ్రి మాటల్నే స్ఫూర్తిగా తీసుకుని ఆ రోజు నుంచీ ఈరోజు వరకూ అదే ఒరవడితో, ఉత్సాహంతో ముందడుగు వేస్తున్నారు. ఆ సమయంలో చాలామంది స్వప్నని ‘ఏక్తాకపూర్‌ అవ్వాలనుకుంటున్నావా’ అనడిగారు. అప్పుడామె ‘నేను స్వప్నాదత్‌గా నాకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంటా’ అంటూ ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పారు. అలా ‘వైజయంతీ టెలీ వెంచర్స్‌’ ప్రారంభించి రియాలిటీ షోల మీద దృష్టి పెట్టారు. హుషారు పాటలూ, ఊపేసే డాన్సులూ, ప్రముఖుల పార్టిసిపేషన్‌ కలగలిపి ప్రోగ్రామ్స్‌ నిర్మించాలనుకున్నారు. ఈ ఆలోచన విజయవంతమైంది. వారానికి ఓ సెలబ్రిటీని అతిథిగా పిలిచి నిర్వహించిన ‘సరిగమప’, ‘ఝుమ్మందినాదం’... సూపర్‌హిట్టయ్యాయి. తరవాత ‘వాయిస్‌ ఆఫ్‌ ఆంధ్ర’, సప్తస్వరాలు’, ‘రాజూరాణి విత్‌ జగపతి’, ‘జయప్రదం’, ‘నీ కొంగుబంగారం కానూ’, ‘నర్తనశాల’... అన్నీ ‘సూపర్‌’ హిట్లే. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ స్వప్న రాకెట్‌లా టీవీ కార్యక్రమాలు, సినిమాలతో దూసుకుపోతున్నారు. స్వప్న జీవితంలో పెద్ద ప్రశంస అంటే...‘అశ్వినీదత్‌కి నువ్వు కూతురివి కాదు కొడుకువి’ అని అందరూ పొగడటమేనట.

ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ...
డా।। వెంకట కామేశ్వరి
వైద్యం, సేవా రంగం

ఆహారం, ఆరోగ్యం, సంతానం... ఈ మూడు అంశాలపై అలుపెరుగకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు డాక్టర్‌ సామవేదం వెంకట కామేశ్వరి. ఇందులో భాగంగానే సంతానలేమికి పోషకాహార లోపం కూడా కారణమని తెలుసుకున్నారు. ముఖ్యంగా గర్భాశయ ఆరోగ్యం గురించి మహిళలకు పదేళ్లుగా అవగాహన కల్పిస్తున్నారామె. మహిళల ఆరోగ్య సూచికగా, మాతృత్వపు ప్రమాణంగా ఉన్న గర్భసంచి విషయంలో జరుగుతున్న అన్యాయం మీద అనేక వేదికలపై గళం ఎత్తి పోరాడుతున్నారు. గర్భసంచి తీసేయడం వల్ల ఎదురయ్యే సమస్యల్ని ప్రతిఒక్కరికీ వివరించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా చెల్మెడ అనే ప్రాంతంలో మహిళలతో కలిసి ఇతర గ్రామాల్లోనూ గర్భాశయ ప్రాముఖ్యంపై అవగాహన అందిస్తున్నారు. తెలంగాణలోని వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో హిస్టరెక్టమీ ఆపరేషన్లు చేసుకునే వారి శాతం దాదాపు 15 వరకు ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు డాక్టర్‌ వెంకట కామేశ్వరి. ఆమె కృషితో ఆరోగ్యశ్రీలో అనవసరపు ఆపరేషన్లు రద్దు చేశారు. ‘గర్భసంచిని కాపాడుకుందాం’ అనే పుస్తకాన్ని రాశారు. హిస్టరెక్టమీ ఆపరేషన్లకు వ్యతిరేకంగా పోరాడారు. దీన్నో ఉద్యమంలా చేపట్టారు. దాదాపు తొంభైవేలమంది అమ్మాయిలకు నెలసరి, వ్యక్తిగత ఆరోగ్యం, గర్భాశయం ప్రాధాన్యం... ఇలా ఎన్నో అంశాలపై అవగాహన కల్పించారు. తన చివరి శ్వాస వరకూ మహిళల ఆరోగ్యం కోసం కృషిచేస్తానని చెబుతారామె. ఇక, రకరకాల కారణాలతో నగరానికి వచ్చేవారిలో కొందరికి ఉండేందుకు ఆశ్రయం దొరక్కపోవచ్చు. దాన్ని గుర్తించిన ఆమె... ఓపెన్‌ హౌజ్‌ పేరుతో ఓ ఆశ్రయాన్ని కల్పించారు. అక్కడ కావాల్సినన్ని రోజులు ఉండొచ్చు. వంట చేసుకోవచ్చు. తమ సమస్యల్ని కూడా పంచుకోవచ్చు. విద్యార్థులు, ఉద్యోగవేటలో ఉన్నవారు.. ఇలా ఎవరైనా సరే... ఇక్కడకు రావొచ్చని చెబుతారామె.

 


మరిన్ని