close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
విధుల్లో వేగం పెరగాలంటే?
నేనో ఫార్మా సంస్థలో పనిచేస్తున్నా. ఉద్యోగరీత్యా చాలా వేగంగా పనిచేయాలి. అలాగే ఒత్తిడీ ఎక్కువే. వేగంగా పనిచేయలేకపోవడమే నా సమస్య. అందరితో పోటీపడి పనిచేయాలని ప్రయత్నించినప్పుడల్లా, సత్ఫలితం కనిపించదు. ఒక్కోసారి నా సహోద్యోగుల సాయం తీసుకోమంటూ మా బాస్‌ నాకు సలహా ఇస్తూ ఉంటారు. మొదట్లో సాయం చేయడానికి ముందుకొచ్చిన వారంతా, ఆ తరువాత మారిపోయారు. నా నిదానాన్ని చూసి  విసుక్కుంటారు. వేగంగా పనిచేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా?
 

ఓ సోదరి

ఉద్యోగరీత్యా పనిలో వేగాన్ని పెంచుకోవడం అత్యవసరం. ఇచ్చిన గడువులోపు పనిని పూర్తిచేసే ఉద్యోగికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగని ఓ యంత్రంలా రోజంతా పని చేయాలని కాదు. సమయంలో పూర్తి చేయగలిగితే, మిగిలిన సమయమంతా ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు. అయితే....
తక్కువ సమయంలోనే... ప్రస్తుత కాలంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ  పని చేయవలసి వస్తోంది. అలాగని నిరంతరాయంగా పని చేయడం వల్ల ఒత్తిడికి గురవుతాం. కొన్ని ప్రాజెక్టులను ఎంత వేగంగా పూర్తి చేద్దామన్నా .. ముందుకు కదలవు. అలా చేయాలంటే చురుగ్గా ఆలోచించాలి. సృజనాత్మకత ఉండాలి. పనిలో వేగాన్ని పెంచుకోవాలంటే ఈ కింది అంశాలు పాటించి చూడండి.
సమయపాలన... పని తీరుని వేగవంతంగా మార్చుకోవాలంటే సమయపాలనను పాటించాలి. ఏదైనా పని ప్రారంభించే ముందు, పూర్తి చేయడానికి ఓ సమయాన్ని కేటాయించుకోవాలి. దానికి తగినట్లుగా ప్రణాళికలు వేసుకుని పూర్తి చేయాలి. అనుకున్న సమయానికన్నా ముందుగానే చేయడానికి కృషి చేయాలి. మీకు మీరే పోటీ పడాలి. దీంతో పనిలో మీ వేగం పెరుగుతుంది. స్టాప్‌ వాచ్‌లో నిర్ణీత సమయాన్ని పెట్టి, పని మొదలుపెట్టాలి. అలాగే ఎంత సమయం పట్టిందో గుర్తించాలి. క్రమేపీ మీ చేతిలో సమయం మిగులుతుంది. సమయపాలన మాత్రమే కాదు, పని పట్ల క్రమశిక్షణ కూడా అలవడుతుంది. ప్రయత్నించి చూడండి. అలాగే చేసే పనిపై దృష్టి పెట్టాలి. దానివల్ల వీలైనంత వేగంగా చేయగలుగుతారు.
విరామం కూడా...  ఎంత పనిఒత్తిడి ఉన్నా సరే... మధ్యమధ్య విరామం తీసుకోవడం కూడా అవసరమే. అప్పుడే మెదడు చురుగ్గా ఉంటుంది.
కావలసినంత నిద్ర... రోజుకి ఎనిమిది గంటల నిద్ర అవసరం. దానివల్ల శరీరానికి కావలసినంత శక్తి అందుతుంది. అలాగే అతిగా నిద్రపోయినా కూడా లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. అందుకే మీ ఇంటిపనులన్నీ కూడా ప్రయాళిక ప్రకారం.. ఓ సమయానికి చేసుకునేలా చూడాలి. నిద్రాహార నియమాలు వేళకు పాటించేలా చూసుకోవాలి.
పోషకాహారం... ఆహారం విషయంలో ఆరోగ్యాన్ని పాటిస్తూ, వ్యాయామం చేస్తే, శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది.  దీంతో మీ శరీరం చురుగ్గా పని చేస్తుంది. కాబట్టి కొన్నాళ్లు పోషకాహారం తీసుకుంటూ కనీసం ఓ అరగంట వ్యాయామం చేయండి. ఒత్తిడి సమస్య కూడా ఉండదు. మొదట్లో వేగంగా చేయడం కష్టమే కానీ... నెమ్మదిగా అలవాటు చేసుకోండి. సాంకేతిక పరిజ్ఞానం సాయం తీసుకోండి. అవసరం అయితే... సహోద్యోగులను కొన్ని సలహాలు అడగండి. మీ తపనను వాళ్లు కూడా అర్థంచేసుకుంటారు.

- మీ సందేహాలను, సమస్యల్ని vasucareer@eenadu.net కు పంపించగలరు.


మరిన్ని