close

తాజా వార్తలు

ప్రభుత్వంపై ఒత్తిడి పడింది: అన్నాహజారే

రాలేగావ్‌ సిద్ధి (మహారాష్ట్ర): ప్రజా ఉద్యమం, సుప్రీంకోర్టు ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం.. లోక్‌పాల్‌ నియామకం కోసం నిర్ణయం తీసుకుందని సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే తెలిపారు. దేశ ప్రథమ లోక్‌పాల్‌ నియామకానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ పేరు పరిశీలనలో ఉందని అధికారవర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై హజారే మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌పాల్‌ కోసం ప్రజలు కొనసాగించిన ఉద్యమం వల్ల కేంద్ర ప్రభుత్వం కదిలి ఈ నియామకం చేపడుతోంది. లోక్‌పాల్‌ నియామకం కోసం సుప్రీంకోర్టు ఏకంగా మూడుసార్లు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం స్పందించింది. తొమ్మిదేళ్లు ఉద్యమం జరిపిన తర్వాత లోక్‌పాల్‌ నియామకం చేపడుతున్నారు. సామాన్య ప్రజల శక్తి ఏంటో ప్రపంచం మొత్తం చూస్తోంది. సుప్రీంకోర్టు కూడా చాలా శక్తిమంతమైనది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

కాగా, దేశ అత్యున్నత వ్యవస్థలపై వచ్చే అవినీతి ఫిర్యాదులను స్వీకరించడానికి లోక్‌పాల్‌ను ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారన్న విషయాన్ని, ఇందుకోసం తీసుకుంటున్న చర్యలను తమకు తెలపాలని సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. లోక్‌పాల్‌ నియామకంలో జాప్యంపై కూడా అన్నాహజారే నిరాహార దీక్షలు చేశారు. ఇటీవల మరోసారి నిరాహార దీక్షకు దిగిన అన్నాహజారే.. ఏడురోజుల పాటు దాన్ని కొనసాగించి, ఫిబ్రవరి 5న ప్రభుత్వం నుంచి హామీ రావడంతో విరమించారు. కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తా అధికారులను నియమించాల్సి ఉంది. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు