close

తాజా వార్తలు

కోల్‌కతాలో కేంద్ర బలగాలు.. టీఎంసీ మండిపాటు

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో కేంద్ర భద్రతా బలగాలు మోహరించాయి. కోల్‌కతాలోనే కాకుండా ఆ నగర చుట్టుపక్కల ప్రాంతాలైన బెహాలా, నాక్తలా, బాన్స్‌ద్రోనీ, రీజెంట్‌ పార్క్‌ ప్రాంతాల్లోనూ భద్రతా బలగాలు కవాతు నిర్వహించాయి. కోల్‌కతా పోలీసు అధికారులు కూడా వారి వెంట ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతోందని ఇటీవల భాజపా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించినట్లు వార్తలు వెలువడ్డాయి.

కేంద్ర భద్రతా బలగాలు మోహరించడం పట్ల తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ‘ఎన్నికలకు ముందు ఇలా భద్రతా బలగాలు కవాతు నిర్వహించడం పట్ల అసలు ఉద్దేశం ఏంటీ? ఓ భద్రతా సిబ్బంది.. ఓ మహిళ వద్దకు వెళ్లి తన కుమారుడి గురించి వివరాలు అడిగారు. ఈ దృశ్యం టీవీలో వచ్చింది. ఇక్కడ వారు చేయాల్సిన పని ఇదేనా? వారి ఉద్దేశం ఏంటో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు’ అని టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది. ‘రాష్ట్రంలో 135 కంపెనీలకు చెందిన పారామిలిటరీ దళాలు ఉన్నాయి. జంగల్‌ మహల్‌లో మావోయిస్టుల సమస్య అధికంగా ఉన్న సమయంలోనూ ఇంత పెద్ద ఎత్తున భద్రతా బలగాలు లేవు. మాకు కేంద్ర బలగాలతో ఎటుంటి సమస్య లేదు. అయితే, వారు తమ బాధ్యతల నిర్వహణలో తటస్థంగా ఉండాలి. ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించొద్దు’ అని రాష్ట్ర మంత్రి, టీఎంసీ నేత పర్హాద్‌ హకీమ్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాల మోహరింపుని భాజపా నేతలు స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆ పార్టీ నేత సాయంతన్‌ బసు అన్నారు. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు