close

తాజా వార్తలు

ఐపీఎల్‌ ఆటగాళ్ల డబ్బుల పంట

సాధారణ ఆటగాళ్లను రాత్రికి రాత్రే శ్రీమంతులను చేసింది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. అటు ఆటలోనూ ఇటు ఆర్జనలోనూ క్రికెటర్లు అదరగొట్టారు. యువ క్రీడాకారులు ఒకప్పుడు చిన్న స్పాన్సర్‌షిప్‌ను సంపాదించుకొనేందుకు అష్టకష్టాలు పడేవారు. దేశవాళీకి ఎంపికైతే కొన్ని డబ్బులు వచ్చేవి. ఎప్పుడైతే ఐపీఎల్‌ రంగప్రవేశం చేసిందో ఈ సినిమా కష్టాలకు తెరపడింది. తమ సత్తాచాటితే డబ్బులు వాటంతట అవే వస్తాయని వారు గ్రహించారు. ఎంతో మంది సీనియర్‌ ఆటగాళ్లు కోట్లాది రూపాయలను ఆర్జిస్తూ కుర్ర క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఐపీఎల్‌ 12వ సీజన్‌ ఆరంభం అవుతున్న సందర్భంగా ఈ లీగ్‌ ద్వారా ఏయే ఆటగాళ్లు తమ నెట్‌వర్త్‌ను రూ.100 కోట్ల వరకు పెంచుకున్నారో చూసేద్దామా.

‘మహీ’ అగ్రస్థానం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సూపర్‌ హిట్‌ జట్టేదైనా ఉందంటే అది చెన్నై సూపర్‌ కింగ్సే. క్రికెట్‌ విజ్ఞానవంతుడు మహేంద్రసింగ్‌ ధోనీయే కారణమంటే అతిశయోక్తి కాదేమో! ధనాధన్‌ సిక్సర్లతో, హెలికాప్టర్‌ షాట్లతో అభిమానులను అలరించాడు. తన మేధస్సుతో ఓడిపోయే మ్యాచ్‌లెన్నిటినో మలుపు తిప్పాడు. చెన్నైని మూడు సార్లు విజేతగా నిలిపాడు. అంతేనా ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న ఎంతోమంది క్రికెటర్లను మళ్లీ జోరందుకొనేలా చేశాడు. ఐపీఎల్‌ ద్వారా ధోనీ ఇప్పటి వరకు సంపాదించిన మొత్తం ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే! 12 సీజన్లతో కలిపి రూ.122.84 కోట్లు ఆర్జించాడు. 2008-10 వరకు సీజన్‌కు రూ.6 కోట్లు అందుకున్నాడు. 2011-13 వరకు రూ.8.28 కోట్లు, 2014-17 వరకు రూ.12.5 కోట్లు తీసుకున్నాడు. ఇక 2018 నుంచి రూ.15 కోట్లు పుచ్చుకుంటున్నాడు. ఏ ప్రకారంగా చూసినా మహీ తాను అందుకున్న మొత్తానికి న్యాయం చేశాడనే చెప్పాలి.

హిట్‌మ్యాన్‌ ‘శతకం’

ముంబయి ఇండియన్స్‌ను మూడుసార్లు విజేతగా నిలిపిన సారథి రోహిత్‌ శర్మ. క్రీజులో నిలబడితే విధ్వంసమే పరమావధిగా భావించే అతడు ఐపీఎల్‌లో రెండో అత్యధిక ఆర్జనాపరుడు. తనదైన శైలిలో సొగసైన సిక్సర్లు బాది అభిమానులను అలరిస్తాడు. తొలి మూడు సీజన్ల వరకు దక్కన్‌ ఛార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత అంబానీ శిబిరంలో చేరాడు. డబ్బుల పంట పండించాడు. లీగ్‌లో హిట్‌మ్యాన్‌ ఆర్జించిన మొత్తం రూ.116.60 కోట్లు. తొలి మూడు సీజన్లకు రూ.3 కోట్లు, 2011-13 వరకు రూ.9.20 కోట్లు, 2014-17 వరకు రూ.12.5 కోట్లు తీసుకున్నాడు. 2018 నుంచి రూ.15 కోట్లు అందుకుంటున్నాడు.

ఆర్జనలో ‘నిలకడ’

ఇప్పటి వరకు ఫ్రాంచైజీ మారని ఆటగాడు విరాట్‌ కోహ్లీ. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును విజేతగా నిలిపేందుకు శక్తివంచన లేకుండా కష్టపడుతూనే ఉన్నాడు. క్రిస్‌గేల్‌, డివిలియర్స్‌ వంటి విధ్వంసకారులు జట్టులో ఉన్నా అతడి కల నెరవేరలేదు. పరుగుల వరదతో బెంగళూరు అభిమానులను అలరిస్తున్నాడు. 2008లో అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిపించిన విరాట్‌కు తొలి మూడు సీజన్లకు రాయల్‌ ఛాలెంజర్స్‌ చెల్లించింది రూ.1.2 కోట్లే. తన పరుగుల దాహంతో ఆ ధరను రూ.8.28 కోట్లకు పెంచుకున్నాడు. 2013 వరకు ఆ మొత్తం అందుకున్నాడు. ఆ తర్వాత సీనియర్ల కోటాలోకి వెళ్లి 2014-17 వరకు రూ.12.50 కోట్లు తీసుకున్నాడు. 2018 నుంచి అందర్నీ మించి ఏకంగా రూ.17 కోట్లు అందుకుంటున్నాడు. మొదటి మూడు సీజన్లలో ఎక్కువ మొత్తం తీసుకొని ఉంటే ధోనీని మించేవాడే. ఇంతకు విరాట్‌ ఆర్జన ఎంతంటే రూ.109.20 కోట్లు.

 

సంపద ‘పరుగు’

2016 వరకు ఐపీఎల్‌ పోస్టర్‌ బాయ్‌ ఎవరంటే సురేశ్‌రైనా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. లీగ్‌లో పరుగుల సునామీ సృష్టించాడు. ఏకంగా 4,985 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి సగటు, స్ట్రైక్‌రేట్‌ సైతం తక్కువేమీ కాదు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయాల్లో రైనా పాత్ర అత్యంత కీలకం. ప్రత్యర్థి ఎవరో చూడకుండా బ్యాటింగ్‌ చేస్తాడు. రెండేళ్లుగా టీమిండియాలో లేకపోవడంతో అతడి ప్రాముఖ్యం కాస్త తగ్గింది. తొలి మూడు సీజన్లకు రైనా రూ.2.6 కోట్లు తీసుకోగా 2011-13 వరకు రూ.5.98 కోట్లు అందుకున్నాడు. 2014-16 వరకు రూ.9.5 కోట్లు పుచ్చుకున్నాడు. 2017లో రూ.12.5 కోట్లు అత్యధికంగా తీసుకున్నాడు. 2018 నుంచి రూ.11.0 కోట్లు అందుకుంటున్నాడు. చెన్నైపై నిషేధం విధించడంతో తొమ్మిది, పదో సీజన్‌లో గుజరాత్‌ లయన్స్‌కు ఆడిన సంగతి తెలిసిందే.

6 సిక్సర్లతో ‘ఆరోవాడు’

తొలి టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదేసి పొట్టి ఫార్మాట్‌లో తానే ఫేవరెట్‌ ఆటగాడినని చాటాడు యువరాజ్‌ సింగ్‌. ఐపీఎల్‌లో ఇప్పుడు ఏడో ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. క్రీజులో నిలిస్తే భారీ సిక్సర్లు బాదే యువీ ప్రస్తుతం మునుపటిలో ఆడటం లేదు. ప్రభ కోల్పోయాడు. ఐపీఎల్‌లోనూ అతడి మార్క్‌ కనిపించలేదు. నిలకడ లోపంతో ఫ్రాంచైజీలు మారుతున్నాడు. ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో ఉన్న యువీ విదేశాలకు వెళ్లి ఫిట్‌నెస్‌ పెంచుకొని వచ్చాడు. మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. 12వ సీజన్‌ను జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాడు. తాను ఆరాధించే సచిన్‌ తెందుల్కర్‌, మిత్రుడు రోహిత్‌ శర్మ ఉండటంతో ఈ సారి ముంబయి ఇండియన్స్‌ తరఫున ఏమాత్రం రాణిస్తాడో చూడాలి. తొలి మూడు సీజన్లకు కింగ్స్‌ ఎలెవన్‌ తరఫున రూ.4.25 కోట్లు తీసుకున్నాడు. 2011 నుంచి 13 వరకు పుణె వారియర్స్‌ నుంచి రూ.8.2 కోట్లు అందుకున్నాడు. 2014లో బెంగళూరు రూ.14 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. ఇక 2015లో దిల్లీ ఏకంగా రూ.16 కోట్లకు వేలంలో దక్కించుకుంది. 2016, 2017లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి రూ.7 కోట్లు తీసుకున్నాడు. 2018లో పంజాబ్‌ కనీస ధర రూ.2 కోట్లు చెల్లించింది. ఈ సారి ముంబయి అతడిని కోటి రూపాయలకే దక్కించుకుంది. మొత్తంగా అతడి సంపాదన రూ.84.60 కోట్లు.

www.eenadu.net ప్రత్యేకం


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు