close

తాజా వార్తలు

కత్తెరతో యువతిపై ప్రేమోన్మాది దాడి

మరొకరితో నిశ్చితార్థం జరగడమే కారణం

జూబ్లీహిల్స్‌: తనను కాదని మరొకరితో నిశ్చితార్థం చేసుకుందనే ఆగ్రహంతో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తెరతో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో ఉంటూ, ఆటో నడుపుతున్న ఓ వ్యక్తి కుమార్తె పదోతరగతి వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. రెండేళ్ల క్రితం యూసుఫ్‌ అనే వ్యక్తి ఆ యువతి కుటుంబం ఉంటున్న భవనంలోని కింది భాగాన్ని దర్జీ దుకాణం పెట్టుకోవడానికి అద్దెకు తీసుకున్నాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వై.దుర్గాప్రసాద్‌ (25) ఆ దుకాణంలో పనికి కుదిరాడు. పదోతరగతి వరకు చదివిన అతడు పై అంతస్తులో ఉన్న యువతి బయటకు వెళ్లినపుడల్లా అనుసరిస్తూ, మాటలు కలిపేందుకు ప్రయత్నించేవాడు. కొద్ది రోజుల క్రితం తాను ప్రేమిస్తున్నాననంటూ చెప్పగా.. ఆ యువతి అతడి ప్రతిపాదనను తిరస్కరించింది. అయినా దుర్గాప్రసాద్‌ పెళ్లి చేసుకోవాలని ఆమెను వేధించేవాడు. ఈ నెల 2న ఆ యువతికి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. దుర్గాప్రసాద్‌ ఆదివారం ఆమె నివాసానికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. కత్తెరతో దాడి చేశాడు. ఆమె చెవికి, గొంతు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి మధ్య తోపులాట చోటుచేసుకొంది. దుర్గాప్రసాద్‌ చేతికీ గాయమైంది. యువతి గట్టిగా కేకలు వేయడంతో దుకాణంలో ఉన్న యూసుఫ్‌ పరుగున పైకి వచ్చి దుర్గాప్రసాద్‌ను అడ్డుకొని యువతిని రక్షించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, యువతిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆదివారం రాత్రి అరెస్ట్‌ చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు