close

తాజా వార్తలు

ఉసురుతీసిన వైకాపా కార్యకర్తల వాహనం

దేవనకొండ: ఆ విద్యార్థికి తెల్లారితే పదో తరగతి పరీక్షలు.. వాటి కోసం ఏడాదంతా కష్టపడి చదివాడు. స్నేహితుడు పిలిచాడని పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం అతన్ని అనూహ్యంగా కబళించింది. కర్నూలు జిల్లా దేవనకొండలో  ఈ దారుణం చోటుచేసుకుంది. గుండ్లకొండ, గుడిమిరాళ్ల గ్రామాలకు చెందిన ఎనిమిది మంది ఆదివారం వైకాపాలో చేరేందుకు ఆలూరు వెళ్లి తిరిగివస్తుండగా వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.

తండ్రి లేని బిడ్డ..
కర్నూలు జిల్లా దేవనకొండకు చెందిన కౌలుట్ల, లక్ష్మి దంపతుల కుమారుడు కాశీం(16). తండ్రి కౌలుట్ల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ నేపథ్యంలో తల్లే కష్టపడి కుమారుడిని చదివిస్తున్నారు. ఆదివారం రాత్రి కాశీం తమ సమీప బంధువు, స్నేహితుడైన బోయ నాగేంద్రతో కలిసి పొలానికి నీరు కట్టడానికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. అక్కడ పని ముగించుకొని చెరువు కట్ట రహదారి మీదుగా తిరిగి వస్తుండగా గుడిమిరాళ్లకు వెళ్తున్న స్కార్పియో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. తీవ్రగాయాలైన కాశీం, నాగేంద్రలను వెంటనే పత్తికొండ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలు తీసుకెళ్తుండగా కాశీం మార్గమధ్యలో మృతిచెందాడు. ఎస్సై పీరయ్య ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మరోవంక.. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు