close

తాజా వార్తలు

బ్యాంకుకే ‘ఆముదం’ తాగించారు

హైదరాబాద్‌: బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలంటే.. గ్యారెంటీలు కావాలి. తనఖా పెట్టేందుకు స్థిరాస్తి లేదా భూములుండాలి. రుణం  తీసుకుని ఎగవేయాలంటే. తప్పుడు పత్రాలుంటే చాలు.. బ్యాంకులు అప్పులిచ్చేస్తాయి. అందుకే ఘరానా నేరస్థులు కొందరు బ్యాంకుల్లో రుణాలు పొందేందుకు తప్పుడు పత్రాలు.. తమవి కాని స్థలాల దస్తావేజులు సమర్పించి రూ. కోట్లలో రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణం ఇప్పించేందుకు కమీషన్‌ తీసుకునే ఏజెంట్లు..రుణం కోసం ఆస్తి పత్రాలు ఇచ్చి ప్రతిఫలం పొందే వారు సహకరించడంతో నగరం, శివారులోని బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని ఆర్థిక నేరస్థులు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రుతు రుమాళ్ల తయారీ పరిశ్రమ పేరుతో రూ.2 కోట్లు, ఆముదం ఎగుమతులంటూ రూ.5 కోట్లను ఆర్థిక నేరస్థులు స్వాహా చేశారు.

ఆగ్రోటెక్‌ పవర్‌ పేరుతో... 
వ్యవసాయ ఆధారిత పంటలకు అదనపు విలువ జోడిస్తాం అంటూ హైదరాబాద్‌లో ఉంటున్న స్వర్ణజ్యోతి ఆగ్రోటెక్‌ పవర్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ బషీర్‌బాగ్‌లోని ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి ఏడేళ్ల క్రితం రూ.2.80 కోట్లు రుణం తీసుకుంది. పరిశ్రమలు, పెట్రో ఉత్పత్తులు, బైక్‌లు, ఆటోలకు రసాయనాలతో మిశ్రమం చేసిన ఆముదం (క్యాస్ట్రాల్‌)కు మార్కెట్‌ బాగుందని స్వర్ణజ్యోతి ఆగ్రోటెక్‌ ప్రతినిధులు మన్‌మోహన్‌ సాహు, ఇందిరా సాహు, ఎం.లక్ష్మారెడ్డి, ఎం.లక్ష్మణ్‌రెడ్డిలు బ్యాంకు అధికారులకు వివరించగా.. నిజమేనని నమ్మి రుణం ఇచ్చేందుకు అంగీకరించారు. రూ.2.80 కోట్ల రుణానికి గ్యారెంటీ కావాలని కోరగా.. మూడు నెలల్లో ఇస్తామన్నారు. గ్యారెంటీ ఇస్తారనే నమ్మకంతో బ్యాంకు అధికారులు రూ.2.80 కోట్లను విడుదల చేశారు. ఆరు నెలలైనా గ్యారెంటీ పత్రాలు సమర్పించకపోవడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి రుణ గ్రహీతలను ప్రశ్నించారు. వారు స్థాపించిన కంపెనీకి వెళ్లారు. అక్కడ ప్రతినిధులు లేకపోవడంతో తాఖీదులు జారీ చేశారు. వాటికి రుణ గ్రహీతలు స్పందించలేదు. ఆగ్రోటెక్‌ పవర్‌ పేరుతో తీసుకున్న రుణం, వడ్డీ కలిపి రూ.5 కోట్లయ్యింది.బ్యాంకుఅధికారులు కొద్ది రోజుల క్రితం సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

రుతు రుమాళ్లు తయారు చేస్తాం.. 
రుతు రుమాళ్లు, మహిళల పరిశుభ్రతకు అవసరమైన లోదుస్తుల తయారీకి రూ.2 కోట్ల రుణం కావాలంటూ తప్పుడు ఆస్తి పత్రాలు సమర్పించి బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రను మోసం చేశారు. బ్యాంకు ఫిర్యాదుతో సూత్రధారులు డాక్టర్‌ గౌరి అనిల్‌ కుమార్‌, వై.శ్రీనివాస్‌లను సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డాక్టర్‌ గౌరి అనిల్‌ కుమార్‌, వై.శ్రీనివాస్‌లు, జి.శ్రీకర్‌, వై.వెంకటేష్‌, డాక్టర్‌ పీసపాటి నారాయణలతో కలిసి అన్నా ఎకోలాజిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో బేగంపేటలో సంస్థను ప్రారంభించారు. కొన్ని నెలల క్రితం రుణం కావాలంటూ ఖైరతాబాద్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రను సంప్రదించారు. పూచీకత్తుగా బీకేగూడలోని 500 చ.గ.భూమి పత్రాలను సమర్పించారు. బ్యాంకు అధికారులు రూ.2 కోట్ల రుణాన్ని విడుదల చేశారు. దీన్ని నిందితులు ఆర్‌.ఎస్‌.క్లే టెక్‌, శివానీ సేల్స్‌ కార్ప్‌, నీతా కెమికల్స్‌, బీకేస్‌, దీప్తి ఫార్మా సంస్థలకు మళ్లించారు. కిస్తీలు కట్టలేదు. వీరు తనఖా పెట్టిన స్థలాన్ని వేలం వేసేందుకు బ్యాంకు ప్రయత్నించగా ఆ స్థలం సొంతదారులు వేరే ఉన్నట్లు తేలింది.

అంతా అయ్యాకే ఫిర్యాదులు... 
ఇళ్ల స్థలాలు, ఫ్లాట్ల కొనుగోలు, పరిశ్రమల విస్తరణ, రియల్‌ వెంచర్లకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. రుణ గ్రహీతలు సమర్పించిన పత్రాలను పరిశీలించి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రుణం మంజూరు చేసేందుకు  నివేదిక పంపించాలి. ఇవన్నీ సక్రమంగా జరిగితేనే రుణం మంజూరవుతుంది. సీసీఎస్‌కు ఫిర్యాదు చేసిన బ్యాంకుల అధికారులను పరిశీలిస్తే.. రుణం తీసుకున్నవారు కిస్తీలు చెల్లించనప్పుడు తాఖీదులు పంపుతున్నారు. అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా రికవరీ డెట్‌ ట్రిబ్యునల్‌కు సమాచారం ఇస్తున్నారు. బ్యాంకు ఉన్నతాధికారులు ప్రశ్నించినప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఏడేళ్ల క్రితంనాటి మోసాలపై బ్యాంకు అధికారులు ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు