close

తాజా వార్తలు

కోహ్లీ వారికి కృతజ్ఞత చెప్పాలి: గంభీర్‌

దిల్లీ: ఐపీఎల్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు(ఆర్సీబీ) కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ ఆ జట్టు యాజమాన్యానికి కృతజ్ఞత చెప్పాలని టీమిండియా మాజీ ఓపెనర్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మాజీ కెప్టెన్‌ గౌతంగంభీర్‌ అన్నాడు. ఓ క్రీడా ఛానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్‌ ఐపీఎల్‌లో విరాట్‌ ప్రస్థానంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో ఆర్సీబీ ఇప్పటివరకూ టైటిల్‌ విన్నర్‌గా నిలవలేకపోయినప్పటికీ ఆ జట్టు యాజమాన్యం కెప్టెన్‌ కోహ్లీపై నమ్మకముంచిందని చెప్పాడు. 

గంభీర్‌ మాటల్లో.. ‘ఐపీఎల్‌లో కోహ్లీకి చాలా భవిష్యత్‌ ఉంది. ఆర్సీబీ టైటిల్‌ విన్నర్‌గా నిలవలేనంతమాత్రాన కోహ్లీ కెప్టెన్సీని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ధోనీ, రోహిత్‌శర్మ మూడుసార్లు ఆయా జట్లను విజేతగా నిలిపారు. ఇలాంటి సమయంలో కోహ్లీని వారితో  పోల్చిచూడొద్దు. గత ఏడెనిమిది సీజన్లలో ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ టైటిల్‌ గెలవలేకపోతోంది. అయినా ఆర్సీబీ యాజమాన్యం అతడిపై నమ్మకముంచింది, కోహ్లీకి అదెంతో అదృష్టం. అందుకు ఆర్సీబీ యాజమాన్యానికి అతడు కృతజ్ఞత తెలపాలి. విజేతలుగా నిలిస్తేనే కెప్టెన్లకు గౌరవం ఉంటుంది. అలా నిలవలేనివారు ఎంతో మంది జట్లు మారతున్నారు. అయినా కోహ్లీపై నమ్మకంతో ఆర్సీబీ యాజమాన్యం కొనసాగిస్తోంది’ అని గంభీర్‌ వివరించాడు. ఇదిలా ఉండగా మార్చి 23న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు మధ్య చెన్నై చిదంబరం స్టేడియంలో మొదటి మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు