close

తాజా వార్తలు

ఆ నలుగురు హ్యాట్రిక్‌ వీరులు

రికార్డుల గడ్డ హైదరాబాద్‌ 
తండ్రి, కొడుకుల అరుదైన ఘనత

అది హ్యాట్రిక్‌ వీరుల గడ్డ.. తండ్రి వరుసగా ఆరు సార్లు గెలిచి చరిత్ర సృష్టించారు. కొడుకు హ్యాట్రిక్‌ కొట్టి నాలుగోసారి విజయం సాధించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ తండ్రి, కొడుకుల కంటే ముందు ఇంకొకరు వరుసగా మూడుసార్లు విజయకేతనం ఎగురేశారు. మరొకరేమో తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించి.. ఆ తర్వాత వేరే నియోజకవర్గానికి వలస వెళ్లి హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్నారు. ఆ నలుగురు హ్యాట్రిక్‌ వీరుల గురించి తెలుసుకోవాలనుందా.. అయితే.. ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక్కసారి చుట్టేసి వద్దాం పదండి..!

ఈనాడు, హైదరాబాద్‌

నాలుగోసారి బరిలోకి..! 
ఇప్పటికే హ్యాట్రిక్‌ కొట్టిన అసదుద్దీన్‌ ఒవైసీ ఈ ఎన్నికల్లోనూ బరిలోకి దిగారు. 1994, 1999లో చార్మినార్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి మజ్లిస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తూ   వస్తున్నారు. 
2004లో భాజపా అభ్యర్థి జి.సుభాష్‌చందర్‌జీపై 100145 ఓట్లతో మెజార్టీతో గెలుపొందారు. 
2009లో గత ఎన్నికలతో పోలిస్తే మెజార్టీ పెరిగింది. తెదేపా అభ్యర్థి జహీద్‌ అలీఖాన్‌పై 113865 ఓట్లతో విజయం సాధించారు. 
2014లోనూ మెజార్టీ పెరిగింది. అది కూడా భారీగా. భాజపా అభ్యర్థి డాక్టర్‌ భగవంతరావుపై 202454 ఓట్ల మెజార్టీతో విజయ ఢంఖా మోగించారు.

డబుల్‌ హ్యాట్రిక్‌..! 
వరుసగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుసార్లు ఇదే స్థానం నుంచి గెలిచిన అరుదైన ఘనతను సలావుద్దీన్‌ ఒవైసీ దక్కించుకున్నారు. 1967, 1978, 1983లో చార్మినార్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984లో హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. అప్పటికీ మజ్లిస్‌ పార్టీకి అధికారిక గుర్తింపు దక్కలేదు. దీంతో ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 
1984 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కె.ప్రభాకర్‌ రెడ్డిపై 3481 ఓట్లతో గెలుపొందారు. 1989లో తెదేపా అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై 133078 ఓట్ల మెజార్టీతో.. 1991 ఎన్నికల్లో భాజపా అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డిపై 39524 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 
1996లో భాజపా అభ్యర్థి ఎం.వెంకయ్య నాయుడుపై 73273 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1998లో భాజపా అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డిపై 71622 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1999లో బద్దం బాల్‌రెడ్డిపై 71622 ఓట్లతో గెలుపొందారు.

రెండు సార్లు కాంగ్రెస్‌.. ఒక్కసారి..! 
జీఎస్‌ మెల్కోటే హైదరాబాద్‌ స్థానంలో రెండుసార్లు కాంగ్రెస్‌, ఒకసారి టీపీఎస్‌ నుంచి పోటీ చేసి వరుసగా గెలిచారు. 
1962లో స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్‌ వహీద్‌పై 43069 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 
1967లో స్వతంత్ర అభ్యర్థి వీఆర్‌ రావుపై 45585 ఓట్లతో విజయం సాధించారు. 
1971లో టీపీఎస్‌ తరఫున బరిలోకి దిగి స్వతంత్ర అభ్యర్థి బక్రుద్దీన్‌ త్యాబ్జిపై 49412 ఓట్లతో విజయ కేతనం ఎగురవేశారు.

ఒకసారి ఇక్కడ..  రెండుసార్లు అక్కడ..! 
అహ్మద్‌ మొహియిద్దీన్‌ ఒకసారి హైదరాబాద్‌లో.. మరో రెండు సార్లు సికింద్రాబాద్‌లో గెలుపొంది హ్యాట్రిక్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మూడుసార్లు కాంగ్రెస్‌ తరఫునే బరిలోకి దిగారు. 
1952లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగి పీడీఎఫ్‌ అభ్యర్థి ఎం.మొహియిద్దీన్‌పై 15660 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌కు మారారు. 
1957లో సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశారు. ఎస్‌సీఎఫ్‌ అభ్యర్థి జేహెచ్‌ సుబ్బయ్యపై 33295 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 
1962లో స్వతంత్ర అభ్యర్థి వీఆర్‌ రావుపై 24570 ఓట్లతో విజయఢంఖా మోగించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు