close

తాజా వార్తలు

‘రాహుల్‌ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా’

కమల్‌నాథ్‌ వ్యాఖ్యలపై స్పందించిన దిగ్విజయ్‌ సింగ్‌

దిల్లీ: రాహుల్‌ గాంధీ ఆదేశిస్తే తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. ఈ సారి ఎన్నికల్లో దిగ్విజయ్‌ క్లిష్టమైన స్థానాన్ని ఎంచుకోవాలన్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు స్పందించారు.  ‘‘సవాళ్లను స్వీకరించడం నాకు అలవాటే. 1977లో జనతా పార్టీ హవా నడుస్తున్న సమయంలో నేను రాఘోగఢ్‌ నుంచి పోటీ చేసి గెలిచాను. రాహుల్‌ గాంధీ ఆదేశించిన స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా’’ అని దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. అలాగే ఎంత క్లిష్టమైన స్థానం నుంచి పోటీ చేసైనా గెలిచే సామర్థ్యం తనకు ఉందని కమల్‌నాథ్‌ భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అందుకు ఆయనకు కృతజ్ఞలు తెలుపుతున్నానన్నారు. 

దిగ్విజయ్ సింగ్‌ పోటీ చేయాలనుకుంటే రాష్ట్రంలోని క్లిష్టమైన స్థానం ఎంపిక చేసుకోవాలని కమల్‌నాథ్‌ శనివారం ఓ కార్యక్రమలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత 30-35 సంవత్సరాలుగా గెలవని స్థానాలు కొన్ని ఉన్నాయన్నారు. పరోక్షంగా దిగ్విజయ్‌ను అక్కడి నుంచి పోటీ చేయాలనే సంకేతాలు ఇచ్చారు. భోపాల్‌, ఇండోర్‌, విదిశ లోక్‌సభ స్థానాల్లో గత మూడు దశాబ్దాల్లో కాంగ్రెస్‌ గెలిచిన దాఖలాలు లేవు. ఇండోర్‌ నుంచి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ 1991 నుంచి గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి దిగ్విజయ్‌ సింగ్‌ గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన రాజ్‌గఢ్‌ నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.   


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు