close

తాజా వార్తలు

రెండు చోట్ల పవన్‌ పోటీ.. ఇక్కడి నుంచే

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. ఆయన రెండు అసెంబ్లీ స్థానాల నుంచి ఈ సారి ఎన్నికల బరిలో దిగనున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఆయన నామినేషన్‌ ఎప్పుడు దాఖలు చేసేదీ ఇవాళ సాయంత్రం లేదా బుధవారం వెల్లడిస్తామని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 స్థానాలు (అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్ఛాపురం) పరిశీలించిన అనంతరం అంతర్గత సర్వే నిర్వహించి ఈ రెండు స్థానాలు ఎంపిక చేసినట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. 

పవన్‌కల్యాణ్‌ గాజువాక నుంచి పోటీ చేస్తారని తొలి నుంచీ ప్రచారం జరిగింది. భీమవరం పేరు మాత్రం అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది. పవన్‌ ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ నుంచి పోటీ చేస్తారని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలకు అనుగుణంగానే నిర్ణయం వెలువడింది. అయితే, ముందుగా అనుకున్నట్లు ఉత్తరాంధ్ర నుంచి ఒక స్థానంలో (గాజువాక) పోటీ చేస్తుండగా.. రెండో స్థానం ఆయన సొంత జిల్లా నుంచే కావడం గమనార్హం. సొంత జిల్లాతో పాటు సామాజికవర్గం పరంగా భీమవరం స్థానం పవన్‌కు కలిసొచ్చే అంశం.

అన్న బాటలోనే..

ఎన్నికల్లో పోటీ విషయంలో పవన్ తన సోదరుడు చిరంజీవి బాటను అనుసరిస్తున్నారనే చెప్పాలి. గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి కూడా రెండు చోట్ల పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తిరుపతిలో మాత్రమే చిరంజీవి గెలుపొందారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు