close

తాజా వార్తలు

ముంబయి పేలుళ్లు.. అతి క్రూరమైన ఉగ్రదాడి

బీజింగ్‌: పదేళ్ల క్రితం భారత ఆర్థిక రాజధాని ముంబయిలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. 166 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడి గురించి చైనా తాజాగా స్పందిస్తూ.. ప్రపంచంలో జరిగిన అత్యంత క్రూరమైన ఉగ్రదాడుల్లో ముంబయి దాడి ఒకటి అని పేర్కొంది. జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంపై ఐక్యరాజ్యసమితిలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో చైనా భారత్‌కు సానుకూలంగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చైనాలోని జియాన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో ఉగ్రవాదుల ఏరివేతపై చైనా శ్వేతపత్రం విడుదల చేసింది. కొన్నేళ్లుగా ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్న అతివాదం, తీవ్రవాదం.. మానవాళిని తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయని చైనా ఈ సందర్భంగా తెలిపింది. శాంతిపరిరక్షణ, అభివృద్ధికి ఉగ్రవాదం ముప్పుగా మారుతోందని, దీని వల్ల మనుషుల జీవితాలకు పెను ప్రమాదం వాటిల్లుతోందని  అభిప్రాయం వ్యక్తం చేసింది. 2008లో భారత్‌లోని ముంబయిలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతి కిరాతక ఉగ్రదాడుల్లో ఒకటని ఆ పత్రంలో పేర్కొంది. 
జైషే అధినేత మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఐరాస భద్రతా మండలిలో తీసుకొచ్చిన ప్రతిపాదనకు చైనా ఇటీవల సాంకేతికంగా అడ్డుతగిలిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జైషే జరిపిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ గత నెల ఐరాస భద్రతామండలిలో ప్రతిపాదన తీసుకొచ్చాయి. ఈ ప్రతిపాదనను భద్రతామండలిలోని 15 సభ్య దేశాల్లో 14 సమర్థించాయి. ఒక్క చైనా మాత్రం దీన్ని హోల్డ్‌లో పెట్టింది. ఇది జరిగిన కొద్ది రోజులకే డ్రాగన్‌ దేశం ఉగ్రవాదంపై శ్వేతపత్రం విడుదల చేయడం గమనార్హం. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు