close

తాజా వార్తలు

ఆ కుబేరుడి గర్ల్‌ఫ్రెండ్‌ తమ్ముడే లీకువీరుడు..!

 ఆ దెబ్బకు బెజోస్‌ కాపురం విచ్ఛిన్నం

వాషింగ్టన్‌: ప్రపంచ కుబేరుడు అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు సంబంధించిన అత్యంత వ్యక్తిగత సమాచారం లీకై వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అమెరికాలోని ‘నేషనల్‌ ఎంక్వైరర్‌’ అనే పత్రిక వీటిని ప్రచురించింది. వీటిని బెజోస్‌ స్నేహితురాలి తమ్ముడే రెండు లక్షల డాలర్లకు ఆ పత్రికకు విక్రయించినట్లు తేలింది. గత  జనవరిలో ఎంక్వైరర్‌ పత్రిక బెజోస్‌కు సంబంధించిన టెక్స్ట్ సందేశాలను ప్రచురించింది. మాజీ యాంకర్‌ లారిన్‌తో బెజోస్‌కు వివాహేతర సంబంధం ఉందని పేర్కొంది. ఈ విషయం బయటకు రాగానే జెఫ్‌ భార్య మెకన్జీ విడాకులు ఇచ్చేశారు. 
ఫిబ్రవరిలో తన కాపురంలో ఎంక్వైరర్‌ పత్రిక నిప్పులు పోసిందిని, డబ్బుకోసం బ్లాక్‌ మెయిల్‌ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడ ఇంకో వాదన కూడా ప్రచారంలోకి వచ్చింది. బెజోస్‌కు చెందిన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక తరచూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఆప్తమిత్రుడైన ఎంక్వైరర్‌ యజమాని డేవిడ్‌ పెస్కర్‌ రంగంలోకి దిగి ఈ టెక్స్ట్‌ మెసేజ్‌లను సంపాదించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జెఫ్‌ భార్యకు విడాకులు ఇచ్చాక అధ్యక్షుడు ట్రంప్‌ ఆయన్ను కసిదీరా ‘జెఫ్‌ బోజోస్‌’ అంటూ హేళన చేశారు. 

కొత్త సంచలనం..
తాజాగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ మరో సంచలన కథనం ప్రచురించింది. జెఫ్‌ రహస్య స్నేహితురాలు లారెన్‌ సోదరుడే మిషెల్‌ ఈ వ్యవహారానికంతా కారణమని పేర్కొంది. ఈ వ్యవహారం మొత్తాన్ని పరిశోధించిన సెక్యూరిటీ అధికారి కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. రాజకీయ కారణాలతోనే మిషెల్‌ వీటిని లీక్‌ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. ట్రంప్‌ అంతర్గత మిత్రవర్గంలో మిషెల్‌ కూడా ఉన్నాడని అభిప్రాయపడ్డారు. మిషెల్‌ ఈ సమాచారం లీక్‌ చేసినందుకు 2లక్షల డాలర్ల డబ్బు తీసుకొనే ఉంటాడని దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. సాధారణంగా డబ్బు చెల్లించని సమాచారాన్ని పత్రికలు ప్రచురించవు. కానీ ఇవి కేవలం వదంతులు మాత్రమేనని మిషెల్‌ కొట్టిపారేశాడు. దీనిపై బెజోస్‌, లారెన్‌ స్పందించాల్సి ఉంది. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు