close

తాజా వార్తలు

మన నాయకులకు ఆ సామర్థ్యం ఉంది: డోభాల్‌

గురుగ్రామ్‌: ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోనే శక్తి, సామర్థ్యాలు దేశ నాయకత్వానికి ఉన్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ అన్నారు. పుల్వామా ఉగ్రదాడిని భారతీయులు ఎప్పటికీ మరచిపోరని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి దాడులను తిప్పికొట్టడంలో నాయకులు దీటుగా స్పందిస్తారన్నారు.  80వ సీఆర్‌పీఎఫ్ రైజింగ్‌ డే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పుల్వామా లాంటి ఘటనల నేపథ్యంలో శత్రుమూకలకు ఎప్పుడు.. ఎలా.. సమాధానం చెప్పాలో నిర్ణయించడానికి మన నాయకుల ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశాలకు సైతం దీటుగా సమాధానం చెప్పే సత్తా మన దేశానికి ఉందని ధీమా వ్యక్తం చేశారు.

దేశ శాంతి భద్రతలను కాపాడటంలో సాయుధ బలగాలు కీలక పాత్ర పోషిస్తాయని అజిత్‌ డోభాల్‌ పేర్కొన్నారు. బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంలో ఏమాత్రం వెనకడుగు వేయోద్దని సూచించారు. జవాన్ల  సంకల్ప బలమే దేశాన్ని సురక్షితంగా ఉంచుతుందని వ్యాఖ్యానించారు. దేశ అంతర్గత భద్రతను పరిరక్షించడంలో సాయుధ బలగాలు తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు అంతర్గత భద్రతా సమస్యల్ని ఎదుర్కోలేక తీవ్ర సంక్షోభ పరిస్థితులు చవిచూడాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ఆయన నివాళులర్పించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు