close

తాజా వార్తలు

నిజమైన సమస్యని పక్కనపెట్టారు: శశి థరూర్‌

తిరువనంతపురం (కేరళ): పేదరికం, ఆకలి బాధలు వంటి నిత్య జీవిత సమస్యలపై కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం.. జాతీయ భద్రత అంశం ఆధారంగా ఈ ఎన్నికల్లో లాభం పొందాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ విమర్శించారు. 2019 ఓటింగ్‌ ప్రక్రియను ‘ఖాకీ ఎన్నికలు’ (యుద్ధ పరిస్థితి ప్రభావిత ఎన్నికలు) గా మార్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న సమయంలో తామే కాపాడతామనేలా, తాము జాతీయవాద సందేశం ఇస్తున్నామనేలా ఎన్డీఏ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కానీ, దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది అతి ముఖ్యమైన సమస్య అని కాంగ్రెస్‌ పార్టీ భావించట్లేదు’ అని వ్యాఖ్యానించారు. పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిణామాలను భాజపా వాడుకుంటోందని ఆరోపించారు. 

‘నేను దేశ భద్రత అంశాన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ, కేవలం ఒకే ఒక విషాద ఘటననే ప్రధానాంశంగా చూపుతూ ఎన్నికల్లోకి దిగాలని భాజపా చూస్తోంది. దేశంలో ప్రతిరోజు ఏదో ఒక విషాదం జరుగుతోంది.. కోట్లాది మంది ప్రజలు పేదరికం, ఆకలి బాధలు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది కూడా కోట్లాది మంది దేశ ప్రజలపై జరుగుతున్న ఉగ్రదాడి వంటిదే. వీటికి కూడా ప్రభుత్వం పరిష్కారాన్ని చూపాలి. నిజమైన సమస్యలను ప్రజలకు తెలియ చెప్పడం మా పార్టీ కర్తవ్యం’ అని శశి థరూర్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ పాలనలో మన ప్రజాస్వామ్య మూలాలపై దాడి జరుగుతోందని ఆయన మండిపడ్డారు. మరోసారి అధికారంలోకి వచ్చే అర్హత భాజపాకు లేదని, ప్రజలు ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని అన్నారు. దేశంలో రైతులు, నిరుద్యోగ సమస్యలు పెరిగిపోయాయని, పెద్దనోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిందని విమర్శించారు. ఎన్డీఏ పాలనలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు