close

తాజా వార్తలు

నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ను గుర్తుచేసిన కార్తిక్‌

బంగ్లాతో ఫైనల్‌ మ్యాచ్‌కు ఏడాది పూర్తి

ఇంటర్నెట్‌డెస్క్‌: గతేడాది నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్‌లో బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి దినేశ్‌ కార్తిక్‌ టీమిండియాను గెలిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్‌ జరిగి నిన్నటికి సరిగ్గా ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా దినేశ్‌ కార్తిక్‌ ఆ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాల్ని వీడియోలో తెలుపుతూ కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఫేస్‌బుక్‌ పేజీలో ఓ పోస్టు పెట్టారు. మార్చి 18 2018 భారత్‌-బంగ్లా జట్లు నిదహాస్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడిన రోజు. మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 166/8 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 18 ఓవర్లకు 133/5తో నిలిచింది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తిక్‌ ఫోర్లు, సిక్సులు బాది టీమిండియాకి మరుపురాని విజయాన్నందించాడు. ఆఖరి రెండు ఓవర్లలో 34 పరుగులు చేయాల్సిన స్థితిలో దినేశ్‌ కార్తిక్‌ ఆడిన తీరు ఎంత కొనియాడినా తక్కువే. చివరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా సిక్స్‌ కొట్టి భారత్‌ను గెలిపించాడు.
ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలను దినేశ్ తాజాగా ఓ వీడియోలో వెల్లడించాడు. ఆ వీడియోలో మాట్లాడుతూ తన అనుభవాలను ఇలా పంచుకున్నాడు.. ‘ నిదహాస్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బంగ్లాపై గెలవడం మాకెంతో ప్రత్యేకం. రెండు ఓవర్లలో 34 పరుగులు చేయాలి. ఆఖరి ఎనిమిది బంతులకు 29 పరుగులు చేయాలి. ఇలాంటి స్థితిలో బ్యాటింగ్‌ చేయడం అంత సులువు కాదు. అయితే ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ఫైనల్‌ మ్యాచ్‌కన్నా ముందు శ్రీలంక, బంగ్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో స్వల్ప తేడాతో శ్రీలంక ఓడిపోయింది. ఆ సమయంలో బంగ్లా ఆటగాళ్లు నాగిని డ్యాన్స్‌ చేసి విజయ సంబరాలు చేసుకున్నారు. ఇది శ్రీలంక అభిమానులకు నచ్చలేదు. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక అభిమానులంతా భారత జట్టుకే మద్దతిచ్చారు. అలాంటి ఉత్కంఠ పరిస్థితుల నడుమ ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి గెలుపొందడం మా జట్టుకు చాలా ప్రత్యేకం. ఆ రోజు నా ఆటతీరుతో ఎంతో సంతోషించా’ అని దినేశ్‌ వీడియోలో చెప్పుకొచ్చాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు