close

తాజా వార్తలు

దేశంలోని ప్రతి ఒక్కరు చౌకీదారేనట: రాహుల్‌ 

ఈటానగర్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయంలో ద్వేషం ఉందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. అప్పట్లో తాను ఒక్కడినే చౌకీదార్‌నని చెప్పిన ఆయన.. ఇప్పుడు దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఈటానగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ పాల్గొని ప్రసంగించారు. ‘ఈశాన్య రాష్ట్రాలకు యూపీఏ ప్రత్యేక హోదా ఇచ్చింది. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మేము ఈ పని చేశాము. అరుణాచల్‌ ప్రదేశ్‌కి మరిన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాల్సి ఉంది. మేము మీ సంస్కృతిని నాశనం చేయాలని అనుకోవట్లేదు. దేశం మొత్తం మీద ఒకే సంస్కృతిని రుద్దాలని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తున్నాయి. విద్యావ్యవస్థపై కూడా దాడి జరుగుతోంది. విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులుగా భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ తమకు చెందిన వ్యక్తులను నియమిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

‘ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన విధానాలను భాజపా పక్కకు పెట్టేసింది. జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) అంశం అరుణాచల్‌ ప్రదేశ్‌ను నాశనం చేసే కుట్ర. కాంగ్రెస్‌ విముక్త భారత్‌ తనకు కావాలని ప్రధాని మోదీ అన్నారు. ఆయన హృదయంలో ద్వేషం ఉంది. మేము మాత్రం ఎవరినీ నాశనం చేయాలని భావించట్లేదు. భాజపా తమ భావజాలాన్ని ఈశాన్య రాష్ట్రాలపై రుద్దడానికి వీల్లేదు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన సమయంలో మోదీ తన ప్రచారానికి సంబంధించిన ఫొటోలు తీసుకుంటూ బిజీగా గడిపారు. మోదీ దృష్టిలో అభివృద్ధి అంటే పెద్దనోట్లను రద్దు చేయడం. ఇది తెలివితక్కువ చర్య అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. నల్లధనానికి వ్యతిరేకంగానే ఈ చర్య తీసుకున్నామని ఆయన అన్నారు. కానీ, నల్లధన కుబేరులు ఎవరైనా బ్యాంకుల ముందు నిలబడడం మీరు చూశారా? రఫేల్‌ యుద్ధ విమానాల తక్కువ ధరకే కొనుగోలు చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ భావించారు. ఇప్పుడు మాత్రం అధిక ధరకు కొంటున్నారు. దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ఆయన ఎందుకు ప్రయత్నిస్తున్నారు? 2014లో తాను మాత్రమే చౌకీదార్‌ (కాపలాదారుడు)నని మోదీ అన్నారు. కానీ, ఇప్పుడు దేశంలోని ప్రతి ఒక్కరు చౌకీదార్లేనని అంటున్నారు. డోక్లాంలో భారత్, చైనా సైనికుల ప్రతిష్టంభన సమయంలోనూ మోదీ నోరు విప్పలేదు’ అని రాహుల్‌ గాంధీ విమర్శించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు