close

తాజా వార్తలు

అక్కడ బాబాయ్‌- అబ్బాయ్‌ సవాల్‌

లఖ్‌నవూ: ఒకే స్థానం నుంచి అన్నదమ్ములు.. బావామరదులు పోటీ చేసే సందర్భాలు సాధారణమే. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది అవి మరింత ఆసక్తికరంగా మారుతుంటాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని ఓ నియోజకవర్గం కూడా అలాంటి పోరుకు వేదికైంది. యూపీలోని ఫిరోజాబాద్‌ ఎన్నికలు బాబాయ్‌-అబ్బాయ్‌ సవాల్‌గా మారాయి. రానున్న ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత, ఎంపీ అక్షయ్‌ యాదవ్‌ ఫిరోజాబాద్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇదే స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు శివపాల్‌ యాదవ్‌ నేడు ప్రకటించారు. 
శివపాల్‌ సోదరుడు రామ్‌ గోపాల్‌ యాదవ్‌ కుమారుడే అక్షయ్‌. అంటే శివపాల్‌కు అక్షయ్‌ వరుసకు కుమారుడు అవుతారు. 2016లో ములాయం కుటుంబంలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శివపాల్‌ను అఖిలేశ్‌ పక్కనబెట్టారు. ఈ నిర్ణయానికి రామ్‌గోపాల్‌ కూడా మద్దతిచ్చారు. దీంతో అసంతృప్తికి గురైన శివపాల్‌ సమాజ్‌వాదీ నుంచి బయటకొచ్చి ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ(లోహియా) పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 
రానున్న ఎన్నికల్లో శివపాల్‌ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఈ సందర్భంగా ప్రగతిశీల సమాజ్‌పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను శివపాల్‌ నేడు విడుదల చేశారు. ఇందులో ఆయన పేరు కూడా ఉంది. ఫిరోజాబాద్‌ నియోజకవర్గం నుంచి శివపాల్‌ బరిలోకి దిగుతున్నారు. 2014 ఎన్నికల్లో ఫిరోజాబాద్‌ నుంచి అక్షయ్‌ పోటీ చేసి విజయం సాధించారు. తాజా ఎన్నికల్లోనూ అక్షయ్‌ను సమాజ్‌వాదీ పార్టీ ఇదే స్థానం నుంచి బరిలోకి దింపుతోంది. దీంతో ఫిరోజాబాద్‌ స్థానం ఆసక్తికరంగా మారింది. మరి ఈ పోరులో అబ్బాయి మళ్లీ గెలుస్తాడో.. బాబాయి నిలుస్తాడో తెలియాలంటే ఫలితాల దాకా ఆగాల్సిందే. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు