close

తాజా వార్తలు

ఎన్నికల్లో గెలిచి భాజపాకు సమాధానమిస్తాం.. 

బెంగళూరు (కర్ణాటక): ఎన్డీఏపై మాజీ ప్రధాని, జేడీఎస్‌ నేత దేవెగౌడ విమర్శలు గుప్పించారు. అలాగే, కాంగ్రెస్‌-జేడీఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘మహాకూటమిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శిస్తున్నారు. మరోవైపు, భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలనే నడుపుతోంది. ఈ ఎన్నికల్లో మేము గెలుపొంది భాజపాకు సమాధానం చెబుతాం. కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రతి విషయంలోనూ కలిసి పనిచేస్తున్నాయి. మిత్రపక్షాల నేతలుగానీ, కార్యకర్తలుగానీ మన కూటమి ధర్మంపై ప్రభావం పడేలా వ్యాఖ్యలు చేయకూడదు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ అన్ని విభేదాలను పరిష్కరించుకున్నాయి. సీట్ల సర్దుబాటుపై గందరగోళానికి గురిచేసే ఎటువంటి అంశమూ లేదు’ అని దేవెగౌడ వ్యాఖ్యానించారు. బెంగళూరు ఉత్తర, తుంకూరు  స్థానాల్లో జేడీఎస్‌ అభ్యర్థులే పోటీ చేస్తారని ఆయన చెప్పారు. 

కాగా, మార్చి 31న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కలిసి దేవెగౌడ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొంటారని ఇరు పార్టీలు నేతలు మంగళవారం నిర్వహించిన సంయుక్త సమావేశంలో ప్రకటన చేశాయి. బెంగళూరు-మైసూరు ప్రాంతాల్లో ఈ ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో భాజపాను ఓడిస్తామని తెలిపారు. ‘కర్ణాటకలోని విభజన, మతపర, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ఓడించడంలో నిబద్ధతతో ఉన్నాం’ అని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌ 20, జేడీఎస్‌ 8 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు