close

తాజా వార్తలు

ఎన్నికల్లో కుటుంబ కథా చిత్రం..!

 బరిలో నిలిచిన బంధువర్గాలు
 పోటీపడ్డ అధికార ప్రతిపక్షాలు


ఇంటర్నెట్‌డెస్క్‌: రాజకీయాల్లో గెలుపే ప్రధానం.. విజయం వరిస్తుందంటే ప్రత్యర్థులను సైతం కలుపుకొని టికెట్‌ ఇచ్చి బరిలోకి దింపేందుకు పార్టీలు వెనుకాడవు. హోరాహోరీ పోరులో ఒక్కసీటుతో అధికారాలు తారుమారైన సంఘటనలు కోకొల్లలు. రాష్ట్ర రాజకీయాలను సూక్ష్మస్థాయిలో చూస్తే జిల్లాల్లో కొన్ని కుటుంబాల హవా స్పష్టంగా కనిపిస్తుంది. వివాదాలు చెలరేగనంతవరకు రాజకీయ పార్టీలు కుటుంబాల పట్టును ప్రోత్సహిస్తాయనే చెప్పాలి. పార్టీ అంతర్గత నిర్వహణను సులభతరం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా కుటుంబాల నుంచి ఎక్కువ మంది ఎన్నికల బరిలో నిలవాలని ఆశిస్తారు. ఈ క్రమంలో గెలిచే అవకాశం లేకపోతే అధినేతల బంధువులకు కూడా పార్టీలు నిర్దాక్షిణ్యంగా సీట్లను నిరాకరిస్తాయి.. గెలిచే అవకాశం ఉంటే మాత్రం ఎన్ని విమర్శలు ఎదురైనా లెక్కచేయకుండా తమవారికి సీట్లను కేటాయిస్తాయి. అంతిమంగా  అధికార తీరాలకు చేరడమే లక్ష్యంగా సీట్ల కేటాయింపు సాగుతుంది. ఈ సారి కూడా ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ వారసులకు, బంధువులకు సీట్లు ఇచ్చేందుకు వెనుకాడలేదు. 
నారా-నందమూరి కుటుంబం నుంచి..
 ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం బరిలోకి దిగుతుండగా అనంతపురం జిల్లా హిందూపూరం నుంచి ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ రంగంలో ఉన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి నారా లోకేశ్‌, విశాఖ ఎంపీగా బాలకృష్ణ చిన్న అల్లుడు మతుకుమిల్లి శ్రీ భరత్‌ రంగంలోకి దిగారు. ఎన్టీఆర్‌ కుమార్తె పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరావు వైకాపా తరపున పర్చూరు నుంచి బరిలో నిలిచారు. 
వైఎస్‌  కుటుంబం నుంచి..
వైఎస్‌ కుటుంబం నుంచి కూడా నలుగురు బరిలోకి నిలిచారు. వీరిలో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌, కమలాపురం నుంచి ఆయన మేనమామ రవీంద్రారెడ్డి, కడప ఎంపీగా వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి బరిలో ఉండగా వైఎస్‌ కుటుంబానికి అత్యంత సమీప బంధువు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి  ఒంగోలు నుంచి బరిలో నిలిచారు.  
* కర్నూలు  జిల్లాలో భూమా కుటుంబం నుంచి ఇద్దరు బరిలో ఉన్నారు.  అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి బరిలో ఉండగా.. బ్రహ్మానందరెడ్డికి నంద్యాల టికెట్‌ లభించింది. ఇదే జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి చెందిన కేఈ ప్రతాప్‌ (డోన్‌), కేఈ శ్యాంబాబు(పత్తికొండ)కు టికెట్లు ఇచ్చారు. ఇటీవల తెదేపా తీర్థం పుచ్చుకున్న కోట్ల  కుటుంబంలో కూడా సుజాతమ్మకు ఆలూరు నుంచి టికెట్‌ ఇవ్వగా సూర్యప్రకాశ్‌ రెడ్డి(కర్నూలు ఎంపీ) టికెట్‌ ఇచ్చారు. వీరంతా తెదేపా నుంచి బరిలోకి దిగారు. ఇక వైకాపాలో శిల్పా, కాటసాని కుటుంబాల హవా కొనసాగింది. శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల నుంచి శిల్పా రవి చంద్రారెడ్డి బరిలో నిలిచారు. పాణ్యం నుంచి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, బనగానపల్లె నుంచి కాటసాని రామిరెడ్డిలు బరిలో ఉన్నారు. 
* అనంతపురంలో జేసీ కుటుంబానికి చెందిన ఇద్దరికి తెదేపా సీట్లు ఇచ్చింది. వీరిలో జేసీ అశ్మిత్‌ రెడ్డికి తాడిపత్రి నుంచి , అనంతపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా జేసీ పవన్‌ రెడ్డి రంగంలోకి దిగారు. 
*  చిత్తూరులో వైకాపా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి మూడు టికెట్లు కేటాయించింది. రామచంద్రారెడ్డి(పుంగనూరు) ద్వారకానాథ్‌ రెడ్డి (తంబళ్లపల్లి) మిథున్‌ రెడ్డి (రాజంపేట ఎంపీ)లకు అవకాశం ఇచ్చింది. 
* కిమిడి కుటుంబానికి తెదేపా రెండు జిల్లాలో సీట్లు కేటాయించింది. పార్టీ సీనియర్‌నేత కళావెంకట్రావుకు (ఎచ్చెర్ల), నాగార్జునకు (చీపురుపల్లి) స్థానాలను కేటాయించారు. 
* శ్రీకాకుళంలో ఎర్రన్నాయుడు కుటుంబం నుంచి  అచ్చెన్నాయుడు (టెక్కలి), కుమారుడు రామ్మోహన్‌నాయుడు(శ్రీకాకుళం ఎంపీ) కుమార్తె భవానీకి (రాజమహేంద్రవరం సిటీ) సీట్లు ఇచ్చారు. 
* వైకాపాకు చెందిన ధర్మాన ప్రసాదరావుకు(శ్రీకాకుళం), కృష్ణదాస్‌కు(నరసన్నపేట) సీట్లు లభించాయి. 
* విజయనగరంలో తెదేపా ఎంపీ టికెట్‌ అశోక గజపతిరాజుకు లభించగా ఎమ్మెల్యే టికెట్‌ అదితి గజపతి రాజుకు లభించింది. వైకాపా నుంచి బొత్స సత్యనారాయణక(చీపురుపల్లి), బొత్స అప్పల నరసయ్య(గజపతినగరం)లకు సీట్లు లభించాయి. 
* కృష్ణా జిల్లాలో తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నుంచి బరిలోకి దిగగా.. సమీప బంధువు దేవినేని అవినాష్‌కు గుడివాడ తెదేపా అభ్యర్థిగా టికెట్‌ లభించింది. 
* నెల్లూరులో వైకాపా నుంచి మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి(ఉదయగిరి), మేకపాటి గౌతమ్‌ రెడ్డి(ఆత్మకూరు)లకు టికెట్లు లభించాయి. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు