close

తాజా వార్తలు

మహారాష్ట్రలోనూ 48 స్థానాల్లో పోటీ చేస్తాం..

ముంబయి: లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లు తమ పొత్తులను మరో రాష్ట్రానికి విస్తరించుకున్నాయి. ఇప్పటికే ఈ పార్టీలు ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని 48 స్థానాల్లోనూ తాము పోటీ చేయనున్నట్లు మంగళవారం ఆ ఇరు పార్టీలు ప్రకటన చేశాయి. ఎస్పీ ఎమ్మెల్యే అబు అసీమ్‌ అజ్మీ ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. భాజపా, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా తమ పొత్తు మూడో కూటమిని కొనసాగిస్తుందని చెప్పారు. ‘దేశంలో లౌకిక వాదం ప్రమాదంలో పడింది. తమను తాము కాపలాదారులుగా చెప్పుకుంటున్న వారు తిరిగి అధికారాన్ని దక్కించుకోవడానికి అసత్య ప్రచారాలు చేస్తూ ఎంతకయినా తెగిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. 

‘మహారాష్ట్రలో భాజపాను ఆరు-ఏడు స్థానాలకే పరిమితం చేయడానికి బీఎస్పీ-ఎస్పీ చాలు. ఈ కూటమి చాలా శక్తిమంతంగా ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌.. ముస్లింలు, దళితులు, వెనుకబడిన తరగతుల వారి తరఫున పోరాడలేకపోతోంది. దేశ ప్రజలకి మూడో ప్రత్యామ్నాయ శక్తి అందుబాటులో లేదు. మేము మహారాష్ట్రలో 48 స్థానాల్లోనూ పోటీ చేస్తాం. ప్రజలకి మూడో ప్రత్యామ్నాయం దొరుకుతుంది. సీట్ల సర్దుబాటు సూత్రాన్ని మూడు రోజుల్లో ప్రకటిస్తాం’ అని అసీమ్‌ అజ్మీ తెలిపారు. తమ పార్టీ అధినేత్రి మాయావతి ఏప్రిల్‌ 5న నాగ్‌పూర్‌లో బహిరంగ సభలో పాల్గొంటారని బీఎస్పీ తెలిపింది. ఇందులో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌‌ కూడా పాల్గొనాలని తాము కోరుతామని వెల్లడించారు. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు