close

తాజా వార్తలు

రెండో భద్రాచలంగా ‘ఒంటిమిట్ట’: చంద్రబాబు

కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను గుండెపోటుగా ఎందుకు ప్రచారం చేశారని వైకాపా నేతలను తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అపరాధ భావంతో ఉన్న వ్యక్తి మరిన్ని తప్పులు చేస్తారని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శవపరీక్ష నివేదిక వచ్చాక మాట మార్చారని.. ఇదేం ప్రవర్తన అని చంద్రబాబు నిలదీశారు. కడపలో నిర్వహించిన తెదేపా ఎన్నికల సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. వివేకా హత్యపై  సీబీఐ దర్యాప్తు కావాలని జగన్‌ గవర్నర్‌ వద్దకు వెళ్లారని.. ప్రధాని మోదీ అండ చూసుకునేనా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘హత్యతో మీకు సంబంధం లేకుంటే ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారు. నేరస్థుడు ఎలా ప్రవర్తిస్తాడో కడప జిల్లా ప్రజలు గమనించాలి. గుజరాత్‌ ఘటనలో మోదీ రాజీనామా చేయాలని కోరిన వ్యక్తి నేనే. చట్టం అందరికీ సమానంగా ఉండాలి.. ముస్లింలకు తలాక్‌ చట్టం ఎందుకు తీసుకొచ్చారు?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

కడప అభివృద్ధిని అడ్డుకుంటోంది జగనే

‘‘కడప జిల్లాకు త్వరలోనే మరో 10 పరిశ్రమలు వస్తున్నాయి. ఒంటిమిట్టను రెండో భద్రాచలంలా మారుస్తాం. ముస్లింల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టాం. కడప దర్గాను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తాం. గండికోటను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తయారు చేస్తాం. జిల్లాలో ప్రతిపట్టణం, నగరాన్ని పరిశుభ్రంగా మార్చాం.  ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచినీరు అందిస్తాం. మూతపడిన కడప విమానాశ్రయాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఉక్కు పరిశ్రమ పూర్తయితే కడప జిల్లా రూపు రేఖలే మారిపోతాయి. జగన్‌ ఎప్పుడైనా కడప జిల్లాకు ఏదైనా కావాలని అడిగారా? సతీశ్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఈ ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలి. హత్యా రాజకీయాలు, నేరాలు చేయడం జగన్‌కు అలవాటు. మోదీ, కేసీఆర్‌ లేకుంటే వైకాపా ఫ్యాన్‌ తిరగదు. కడప జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నది జగన్‌ ఒక్కరే’’ అని సీఎం మండిపడ్డారు. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు