close

తాజా వార్తలు

ఫెడరల్‌ ఫ్రంట్‌తోనే అభివృద్ధి సాధ్యం: కేసీఆర్‌

16 ఎంపీలను గెలిపిస్తే దేశానికి మార్గదర్శనం చేస్తాం
ఈ నెల 21న అభ్యర్థులను ప్రకటిస్తాం

నిజామాబాద్‌: దేశంలో ఏం జరుగుతోందో, ఏం జరగాలో తాను చెబుతుంటే కాంగ్రెస్‌, భాజపా పీఠాలు కదిలిపోతున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. తాను కరీంనగర్‌ సభలో చెప్పిన మాటలపై సోషల్‌మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని  మండిపడ్డారు. ఫెడరల్‌ ఫ్రంట్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. మంగళవారం రాత్రి ఆయన నిజామాబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో ఎర్ర జొన్న రైతుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కొందరి నాయకుల మాటలు నమ్మి ఆగం కావొద్దని రైతులకు సూచించారు. ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీ గానీ, భాజపా గానీ ప్రజల సంక్షేమం కోసం ఏమీ చేయలేదని, కేవలం రాజకీయ డ్రామాలే ఆడుతున్నాయని దుయ్యబట్టారు. ఈ నెల 21న లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్టు చెప్పారు. ఫెడరల్‌ ఫ్రంట్‌రావాల్సిన ఆవశ్యకతను కేసీఆర్‌ వివరించారు. 

బీడీ కార్మికుల సమస్యలు ఎవరికీ పట్టలేదు

‘‘దేశంలోని 16 రాష్ట్రాల్లో 52.32లక్షల మంది బీడీలు చేసి బతికేవారు ఉన్నారు. వారిలో నాలుగున్నర లక్షల మంది తెలంగాణలో ఉన్నారు. తెరాస అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వాలు వారి బాధలను పట్టించుకోలేదు. కాంగ్రెస్‌, భాజపా రెండూ వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, యూపీ, మహారాష్ట్రలో బీడీ కార్మికులు ఉన్నా.. ఏ ఒక్కరాష్ట్రంలోనూ రూ.వెయ్యి పింఛను ఇవ్వడంలేదు. వచ్చే నెల నుంచి తెలంగాణలో బీడీ కార్మికులకు రూ.2వేలు పింఛను ఇవ్వబోతున్నాం. ఇందుకోసమే దేశంలో కాంగ్రెస్‌, భాజపా లేని  ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం.. తప్పా? గత 72 ఏళ్లపాటు కొనసాగిన పాలనను చూశాం. బీడీ కార్మికుల గురించి, రైతుల గురించి, ప్రజల తాగునీరు, విద్యుత్‌.. ఇలా ఏ సమస్యా పరిష్కారం కాలేదు.  అందుకే అనేక ఉద్యమాలు వచ్చాయి’’

కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ పెట్టరెందుకు?

‘‘రైతులు గిట్టుబాటు ధర విషయంలో తొందరపడొద్దు. మంది మాటలు నమ్మి రైతులు ఇబ్బంది పడొద్దు. దళితులు, గిరిజనులు తమకు జరగాల్సినంతగా జరగలేదనే అసంతృప్తితో ఉన్నారు. మాట్లాడితే బీసీ, బలహీన వర్గాలని కాంగ్రెస్‌, భాజపా నేతలు అంటుంటారు. అన్ని రాష్ట్రాల్లో బీసీ మంత్రిత్వ శాఖలు ఉన్నట్టే కేంద్రంలోనూ ఏర్పాటు చేయాలని కోరితే గతంలో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం గానీ, మోదీ సర్కార్‌గానీ పట్టించుకోలేదు. డైలాగులే తప్ప ఏ ఒక్కరూ క్రియాశీలంగా పనిచేయరు. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీలకు మంత్రిత్వశాఖను పెట్టకపోవడానికి కారణమేంటో మోదీ, రాహుల్‌ చెప్పాలని అడుగుతున్నా. అలా అడిగితే తిడతారా? ఇదేం నీతి? పాలన చక్కగా ఉంటే ప్రజలు అసంతృప్తితో ఎందుకు ఉంటున్నారు? రాష్ట్రాల హక్కులను హరించి ప్రజలకు చేయాల్సిన పనులు చేయడంలేదు. దేశంలో విదేశాంగ విధానం సరిగాలేదు. ఆర్థిక విధానం, వ్యవసాయ విధానం సరిగా లేదు. రాష్ట్రాల హక్కులను హరించి చిల్లర రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ పేర్లతో పథకాలు తెస్తారు.. భాజపా అధికారంలోకి వస్తే దీన్‌దయాళ్‌, శ్యాంప్రసాద్‌ ముఖర్జీ పేర్లతో పథకాలు వస్తాయి. వీళ్లు అధికారంలోకి వస్తే పేర్లు మారుతాయే తప్ప ఎవరూ పనులు చేయరు.’’

దీవించండి.. దేశాన్ని బాగుచేద్దాం

‘‘రైతులకు 24గంటలు విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. రైతుల హక్కులను కాపాడుతున్నాం. ఎస్‌ఆర్‌ఎస్పీ పునరుజ్జీవ పథకానికి నిధులు కేటాయించాం. నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ఎండిపోకుండా చర్యలు చేపడతాం. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పసుపు కొనుగోలుకు చర్యలు తీసుకుంటాం. తెలంగాణ బ్రాండ్‌ పేరుతో దేశమంతా విక్రయించేలా చేస్తాం. దేశంలో కావాల్సిన వనరులు ఉన్నా వాడుకునే తెలివిలేదు. దేశంలో 3.44లక్షల మెగావాట్‌ల విద్యుత్‌ అందుబాటులో ఉంది. సగం రాష్ట్రాల్లో రైతులకు నాలుగైదు గంటలే విద్యుత్‌ ఇస్తున్నారు. దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంటే దేశంలో 40 కోట్ల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. దేశంలో ఐదు కోట్ల ఎకరాల్లో పంట కాలువలకు నీళ్లు ఉన్నాయి. అయినా..  ప్రతి సంవత్సరం దేశంలో ఏదో మూల కరవుతాండవిస్తూనే ఉంటోంది. ఎందుకిలా జరుగుతోంది? ఫెడరల్‌ ఫ్రంట్‌ వస్తే ప్రజలే కేంద్రబిందువుగా పాలన సాగుతుంది. కొత్త ఆర్థిక విధానాలు, వ్యవసాయ విధానాలు రావాలి. రైతులకు కచ్చితంగా గిట్టుబాటు ధరలు అమలు చేయాలి. దేశంలో రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలుకావాలి. దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలి. జన్మభూముల గురించి మాట్లాడితే ప్రజల జాతకాలు మారవు. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను గెలిపించారు. అలాగే ఈ సారి తెరాస నుంచి 16 చోట్ల లోక్‌సభకు పోటీచేస్తున్నఅందరు అభ్యర్థులను గెలిపించాలి.  ఆ బలంతో రాష్ట్రాన్ని బాగు చేసుకోవడమే కాదు.. దేశానికి మార్గదర్శనం చేద్దాం. దేశాన్ని బాగు చేసేందుకు మీ దీవెన కావాలి. ఈ నెల 21న అభ్యర్థులను ప్రకటిస్తాం. నిజామాబాద్‌లో అభ్యర్థి ఎవరైనా దీవించి భారీ మెజార్టీతో గెలిపించాలి’’ అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు