close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ సుకుమారి... ఇప్పుడు లెఫ్టినెంట్‌ అధికారిణి

సౌకుమార్యం, పక్కాగా ఉండే శరీర కొలతలు... ఫ్యాషన్‌ ప్రపంచంలోకి రావాలనుకునే అమ్మాయిల మొదటి ప్రాధాన్యం. ధృఢమైన శరీరం, కఠినమైన వ్యాయామాలు...సడలని ఆత్మవిశ్వాసం నిండుగా ఉండాల్సిన రంగం సైన్యం. ఒకదానికొకటి సంబంధం లేకపోయినా భిన్నమైన రంగాల్లో మేటిగా నిలిచి నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది గరిమా యాదవ్‌.
అమ్మను తలెత్తుకునేలా చేయాలనే తపనే తనను లెఫ్టినెంట్‌ అధికారిణిగా మార్చిందని అంటుంది గరిమా యాదవ్‌. ఆమె 2017లో జరిగిన మిస్‌ ఇండియా ఛార్మింగ్‌ పోటీల్లో విజేతగా నిలిచింది. ఇటలీలో ప్రపంచ వ్యాప్తంగా జరిగే పోటీలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఎవరైనా అయితే... ఆ రంగుల ప్రపంచంలో అందివచ్చిన అవకాశాన్ని సువర్ణావకాశంగా భావిస్తారు. కానీ గరిమ మాత్రం వెళ్లాలనుకోలేదు. ఆర్మీ అధికారిణిగా నిరూపించుకోవాలనుకుంది. అసలు ఆమె మొదటి లక్ష్యం సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ కావడం. గరిమ తల్లి ఒంటరి. మహిళగా కూతురిని పెంచే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడింది. అవన్నీ దగ్గరుండి చూసిన గరిమ.. తల్లి కష్టాల్ని గట్టెక్కించాలనుకుంది. అందుకే సివిల్స్‌ లక్ష్యాన్ని పెట్టుకుంది. దిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో బీఏ ఎకనమిక్స్‌తో డిగ్రీ చదివింది.
అందాల పోటీలు:  డిగ్రీ పూర్తవ్వగానే... తన లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి మెయిన్స్‌కి సన్నద్ధమవడం మొదలుపెట్టింది. అదే క్రమంలో ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో పార్ట్‌టైం ఉద్యోగంలో కుదురుకుంది. అప్పుడే అందాలపోటీల్లో పాల్గొనే అవకాశం. దాంతో మెయిన్స్‌లో అర్హత సాధించలేకపోయింది. కానీ ఆ పోటీల్లో విజేతగా నిలిచింది. ఇటలీలో తుది దశ పోటీల్లో పాల్గొనే అవకాశం అందుకుంది. అయినా సర్దుకుపోలేదు. అదే సమయంలో ఆర్మీలోని వివిధ కేటగిరీలకు పరీక్షలు నిర్వహించే సర్వీస్‌ కంబైన్డ్‌ ఎగ్జామ్‌ పరీక్షల ప్రకటన గురించి తెలుసుకుంది. కష్టపడి చదివింది. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది. అక్కడ తీసుకోవాల్సిన కఠోరమైన శిక్షణ గురించి చెప్పి ఆమెను చాలామంది భయపెట్టినా వెనకడుగు వేయలేదు. ‘ఆడపిల్లవు ఎందుకిదంతా... హాయిగా మరో ఉద్యోగం చూసుకో...’ అన్నా తీసుకున్న నిర్ణయానికే ఓటేసింది. అందరూ భయపెట్టినట్లే చెన్నై ఓటీఏలోని వాతావరణం గరిమకు అస్సలు పడేది కాదు. శరీరం సహకరించేది కాదు. అయినా సరే... తనలోని బలహీనతల్ని క్రమంగా అధిగమించింది. లెఫ్టినెంట్‌ అధికారిణిగా దేశ సేవలు అందించనుంది.


మరిన్ని