close

ఆంధ్రప్రదేశ్

ప్రజాశాంతి పార్టీకే హెలికాప్టర్‌ గుర్తు

ఈనాడు, దిల్లీ: ప్రజాశాంతి పార్టీకే హెలికాప్టర్‌ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. హెలికాప్టర్‌  గుర్తు ఫ్యాన్‌ గుర్తును పోలి ఉన్నందున దానిని నిలిపివేయాలని వైకాపా నేతలు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత గుర్తును హోల్డ్‌లో పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం దానిపై ప్రజాశాంతి పార్టీకి నోటీసులు జారీ చేసింది. హెలికాప్టర్‌కు, ఫ్యాన్‌కు సంబంధం లేదని.. తమ గుర్తును తమ అభ్యర్థులకు కేటాయించాలని ప్రజాశాంతి పార్టీ ప్రతినిధులు విన్నవించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు హెలికాప్టర్‌ గుర్తు కేటాయిస్తున్నట్లు పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాశాంతి పార్టీకి లేఖ ఇచ్చింది. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట సోమవారం సాయంత్రం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్‌ మాట్లాడారు. అవినీతిపరుడైన జగన్‌ ఇప్పటికే ఓడిపోయారని.. వచ్చే ఎన్నికల్లో తెదేపాను ఓడించడమే మిగిలి ఉందని ఆయన చెప్పారు. చిన్న రాష్ట్రాల్లో నాలుగైదు దశల్లో ఎన్నికలు జరుపుతున్న ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం ఒకే దశలో నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఇదే విషయమై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు మరో ముగ్గురు కేంద్ర మంత్రులను కలిసి వివరించినట్టు చెప్పారు. మంగళవారం రోజున విజయవాడ లేదా బుధవారం నాడు నరసాపురం నుంచి తమ పార్టీ తరఫున ప్రచారాన్ని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు