close

ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులు ఇక బంద్‌

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలపై ఎన్నికల నియమావళి ప్రభావం
  మెట్రోరైలు, ఇళ్లు, విద్యుత్తు ప్లాంట్ల పనులు ఆలస్యం

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలోని అభివృద్ధి పనులపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రభావం పడింది. నెలాఖరులోగా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలని ప్రభుత్వం భావించింది. యుద్ధప్రాతిపదికన కొన్ని పూర్తి చేసినా ఇంకొన్ని మిగిలిపోయాయి. పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల ఆధ్వర్యంలో గత నాలుగున్నరేళ్లలో పెద్దఎత్తున అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్న దశలో ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో జాప్యం తప్పని పరిస్థితి ఏర్పడింది.
* విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు నెలాఖరులోగా భూమి పూజ చేయాలని భావించారు. నిర్మాణ పనులకు ఇప్పటికే ఐదు సంస్థలు ముందుకొచ్చాయి. నిర్మాణేతర పనులకు రూ.4,100 కోట్ల రుణాన్ని అందించేందుకు కొరియన్‌ ఎగ్జిం బ్యాంకు ముందుకొచ్చింది. నాలుగు రోజుల క్రితం బ్యాంకు ప్రతినిధుల బృందం అమరావతిలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి చర్చించింది. విజయవాడలో మెట్రో రైలుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారై ఇటీవలే అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌కి చేరింది.
* ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై), ఎన్టీఆర్‌ నగర్‌ పేరుతో రెండున్నరేళ్ల క్రితం 4 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పట్టణ ప్రాంతాల్లో ప్రారంభించారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీటిడ్కో)ను ప్రభుత్వం ఏర్పాటుచేసి ఇళ్ల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టింది. ఇటీవలే లక్ష ఇళ్లను ప్రారంభించగా మరో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధమైంది. గుత్తేదారు సంస్థలకు బకాయిపడిన రూ.2,500 కోట్లు చెల్లించి మిగతా పనులు పూర్తయ్యేలా ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోడానికి ఏర్పాట్లు చేశారు.
* వ్యర్థాల నుంచి విద్యుత్తు తయారీ ప్లాంట్లను విశాఖపట్నం, గుంటూరులో ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నాలు మొదటికొచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో వ్యర్థాల నుంచి విద్యుత్తు, ఎరువుల తయారీ ప్రాజెక్టుల నిర్వహణకు అధికారులు చేసిన ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. ఏడు చోట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల ఏర్పాటుకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మూడేళ్ల క్రితమే ప్రయివేట్‌ సంస్థలకు అనుమతులిచ్చింది. వీటిలో విశాఖపట్నం, గుంటూరులో మొదటి విడతగా ప్రారంభించాలని భావించారు. రెండు నెలల క్రితమే వీటిలో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో జాప్యమైంది.
* తిరుపతిలో 150 ఎకరాల్లో ఏర్పాటుకానున్న రిలయన్స్‌ ఎలక్ట్రానిక్‌ సెజ్‌ పనుల భూమి పూజ కార్యక్రమం ఎన్నికల ప్రవర్తన నియమావళితో తాత్కాలికంగా వాయిదా పడింది. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టుకు జనవరిలో భూమి పూజ చేయాలని భావించారు. అంబానీ కుటుంబంలో వివాహ వేడుకలతో సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు. ఇక్కడ జియో ఫోన్లతోపాటు సెట్‌టాప్‌ బాక్సులు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు కలిపి రోజూ పది లక్షలకుపైగా తయారు చేయనున్నారు.
* ఇండోనేషియాకి చెందిన ఏషియన్‌ పల్ప్‌, పేపర్‌ ఇండస్ట్రీ ప్రకాశం జిల్లాలో రూ.24 వేల కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మ³ందుకొచ్చింది. 16 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపించే ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూ సమీకరణకు యంత్రాంగం కొద్ది రోజులుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇంతలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో దీని ప్రభావం ప్రాజెక్టు పనులపై పడింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు