close

ఆంధ్రప్రదేశ్

గాయపడిన సైనికుల పాలిట సంజీవని

సరికొత్త ఔషధాలను కనుగొన్న డీఆర్‌డీవో ప్రయోగశాల

దిల్లీ: పోరాటాల్లో తీవ్రంగా గాయపడిన సైనికుల్లో దాదాపు 90 శాతం మంది కొద్దిగంటల్లోనే చనిపోతుంటారు. అత్యంత కీలకమైన ఈ ‘గోల్డెన్‌ అవర్‌’ను పొడిగించి, ఆసుపత్రికి తరలించేవరకూ ఆ సైనికుడిని కాపాడే అనేకరకాల ఔషధాలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన వైద్య పరిశోధనశాల రూపొందించింది. గాయాల నుంచి రక్తస్రావాన్ని నిలువరించే సీలెంట్లు, రక్తాన్ని ఎక్కువ శోషించుకునే సూపర్‌ అబ్సార్పిటివ్‌ డ్రెస్సింగ్స్‌, గ్లిజరేటెడ్‌ సెలైన్లు తదితరాలు ఇందులో ఉన్నాయి. డీఆర్‌డీవోకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అల్లయిడ్‌ సైన్సెస్‌ (ఇన్‌మాస్‌) వీటిని రూపొందించింది. పోరాటాల్లో గాయపడిన సైనికులకు తలెత్తే తీవ్ర రక్తస్రావం, సెప్సిస్‌, షాక్‌, రక్త పరిమాణం పడిపోవడం, నొప్పి వంటి వాటికి ఉపశమనం కోసం ఈ ప్రయోగశాల పరిశోధనలు సాగిస్తుంటుంది. ‘గోల్డెన్‌ అవర్‌’లో సమర్థమైన ప్రథమ చికిత్స అందిస్తే సైనికుల ప్రాణాలు కాపాడటానికి, చాలా తక్కువ వైకల్యంతో బయటపడటానికి అవకాశం ఉంటుందని ఈ సంస్థ శాస్త్రవేత్తలు తెలిపారు. వీరు రూపొందించిన గ్లిజరేటెడ్‌ సెలైన్‌ మైనస్‌ 18 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలోనూ గడ్డకట్టదు. సాధారణ సెలైన్‌కు భిన్నంగా ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. గాయపడిన సైనికుల కణజాలం, మెదడు, ఊపిరితిత్తుల్లో నీరు చేరిన సందర్భాల్లో ప్రాణాలు కాపాడటానికి ఇది పనికొస్తుంది. గాయాలకు కట్టు కట్టడానికి ఔషధాలు పూసిన ప్రత్యేక డ్రెస్సింగ్‌ మెటీరియల్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. దాదాపు 200 రెట్లు ఎక్కువగా రక్తాన్ని శోషించుకొనే సామర్థ్యం వీటికి ఉంది. గాయంపై ఒక పొరను ఏర్పరచి రక్తస్రావాన్ని అడ్డుకునే చిటోసాన్‌ జెల్‌ను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ఇన్ఫెక్షన్లను నిలువరించేందుకు హైపోక్లోరస్‌ ఆమ్లాన్ని కూడా రూపొందించారు. గాయాల వల్ల కలిగే నొప్పిని తగ్గించడానికి వాడే నాల్బుఫైన్‌ ఇంజెక్షన్‌ను శరీరంలోకి ఎక్కించడానికి కొత్త మార్గాన్ని కూడా కనుగొన్నారు. దీనివల్ల మెరుగైన ఉపశమనం లభిస్తుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు