close

ఆంధ్రప్రదేశ్

చీరాల తెదేపా అభ్యర్థిగా కరణం బలరాం 

గుడివాడ, రాజమహేంద్రవరం అర్బన్‌ అభ్యర్థులూ ఖరారు

ఈనాడు, అమరావతి: మరో మూడు శాసనసభ స్థానాలకు తెదేపా అభ్యర్థుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల అభ్యర్థిగా సీనియరు నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తిని ఎంపిక చేశారు. ఈ టికెట్‌ కోసం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావు పోటీపడ్డారు. వారికి నచ్చజెప్పిన ముఖ్యమంత్రి... బలరాం అభ్యర్థిత్వాన్ని ఖాయం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ టికెట్‌ను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌కు ఖరారు చేశారు. రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గ అభ్యర్థిగా దివంగత నేత ఎర్రన్నాయుడి కుమార్తె, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవానిని ఎంపిక చేశారు. ఈ టికెట్‌ కోసం చల్లా శంకర్రావు పోటీ పడ్డారు. 
సత్తెనపల్లి నుంచే మళ్లీ కోడెల పోటీ 
శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు మళ్లీ సత్తెనపల్లి నుంచే పోటీ చేయనున్నారు. నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ స్థానాల అభ్యర్థుల ఎంపికలో భాగంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ముఖాముఖి నిర్వహించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం... సత్తెనపల్లికి కోడెల, వినుకొండకు జీవీ ఆంజనేయులు, గురజాలకు యరపతినేని శ్రీనివాసరావు, పెదకూరపాడుకు కొమ్మాలపాటి శ్రీధర్‌ అభ్యర్థిత్వాలను సీఎం ఖరారు చేయనున్నారు. వీరంతా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే. నరసరావుపేట, మాచర్ల స్థానాలపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. నరసరావుపేటలో రావెల సత్యం పేరు పరిశీలనలో ఉంది. మాచర్ల టికెట్‌ను నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు ఆశిస్తున్నారు. పారిశ్రామికవేత్త అంజిరెడ్డి కూడా మాచర్ల టికెట్‌ రేసులో ఉన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు