close

ఆంధ్రప్రదేశ్

భద్రతకు భరోసా

పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహిస్తాం
  రాష్ట్రంలోనే అత్యధికంగా కేంద్ర బలగాల వినియోగం
  392 కంపెనీల బలగాలను కోరాం
నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగం
  9వేల పోలింగ్‌ కేంద్రాలతో సమస్య
సమస్యాత్మక వ్యక్తులుగా 39 వేల మంది గుర్తింపు
శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌తో ‘ఈనాడు’ ముఖాముఖి
ఈనాడు - అమరావతి

దేశంలో తొలిదశ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలన్నింటిలోకెల్లా ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా భద్రతా బలగాలను వినియోగిస్తున్నామని శాంతి భద్రతల విభాగం అదనపు డైరెక్టరు జనరల్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తెలిపారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి సరిహద్దు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నామని, ఆ ప్రాంతాల్లో డ్రోన్‌లతో నిఘా పెడతామని వెల్లడించారు. ఎన్నికల్లో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, దౌర్జన్యానికి పాల్పడటంద్వారా సమస్యలు సృష్టించేందుకు అవకాశమున్న 39,591 మంది వ్యక్తులను గుర్తించామని, వీరిలో 36,725 మందిపై ముందస్తు నేర నిరోధక సెక్షన్ల కింద చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎన్నికల భద్రత- బందోబస్తు, నేరాల నిరోధానికి ముందస్తుగా తీసుకున్న చర్యలు, ఇతర అంశాలపై సోమవారం ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు.

పోలింగ్‌కు నెల రోజులే గడువుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు?
ఎన్నికల భద్రత- బందోబస్తుకు 1,06,468 మంది సిబ్బంది అవసరం. సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఆర్‌పీఎఫ్‌ వంటి కేంద్ర సాయుధ బలగాల నుంచి 392 కంపెనీలు, ఏపీఎస్పీ నుంచి 45 కంపెనీల బలగాలు అవసరమని ఎన్నికల సంఘాన్ని కోరాం. ఇప్పటికే 90 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నాయి. త్వరలో మిగతా బలగాలూ వస్తాయి.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ఎక్కడెక్కడ గుర్తించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
రాష్ట్రంలో మొత్తం 45,920 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిలో 17,671 కేంద్రాలను సాధారణమైనవిగా, 9,345 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. వాటి తీవ్రతను బట్టి 3 రకాలుగా విభజించాం. ఇలాంటి చోట్ల కేంద్ర సాయుధ బలగాలను వినియోగించుకుంటాం. అత్యంత సమస్మాత్మకమైన పోలింగ్‌ కేంద్రాల్లో ఒక ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు 10 నుంచి 20 మంది కేంద్ర సాయుధ సిబ్బంది ఉండేలా ప్రణాళిక రూపొందించుకున్నాం. ప్రతి పోలీసు స్టేషన్‌కు ఒకటి చొప్పున మొత్తం 940 స్ట్రైకింగ్‌ ఫోర్సులను సిద్ధం చేశాం. ఒక్కో బృందానికి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే వెంటనే అక్కడకు చేరుకునేలా 249 స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్సులను పెట్టాం. ఈ బృందాలకు డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు.

డబ్బు, మద్యం పంపిణీ, నియమావళి ఉల్లంఘనలపై నిఘాకు ఎలాంటి తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు?
ఎన్నికల వ్యయాన్ని పర్యవేక్షించేందుకు 660 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశాం. మొబైల్‌ తనిఖీ కేంద్రాల వద్ద 616 స్టాటిక్‌ నిఘా బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. 494 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశాం. వీటన్నింటి ద్వారా డబ్బుల పంపిణీ, అక్రమ నగదు రవాణా తదితర అంశాలపై నిఘా పెడతాం.

2014లో నియమావళి ఉల్లంఘన, ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో అత్యధిక శాతం వీగిపోయాయి? ఈ సారి నమోదు చేసే కేసులు భవిష్యత్తులో వీగిపోకుండా ఎలాంటి   ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
గత ఎన్నికల సమయంలో ఐపీసీ సెక్షన్లు, నియమావళి ఉల్లంఘన కింద మొత్తం 3,283 కేసులు నమోదయ్యాయి. వీటిలో 2,859 కేసుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేయగా.. 325 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ సాగుతోంది. 625 కేసుల్లో శిక్షపడగా.. 1909 కేసులు వీగిపోవటమో, జరిమానా విధించడమో జరిగింది. ఈ సారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌లు సహా ప్రతి తనిఖీ బృందంతో ఒక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఉండేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరాం. తనిఖీల్లో ఎక్కడైనా నగదు లభించినా, ఇతర ఉల్లంఘనలు జరిగినా మేజిస్ట్రేట్‌ల సమక్షంలోనే రికార్డు చేసేందుకు వీలవుతుంది. శరీరంపై ధరించే కెమెరాలతో అక్కడ జరిగే ప్రతి వ్యవహారాన్ని రికార్డు చేస్తాం.

లైసెన్సుడ్‌ ఆయుధాలను వెనక్కి తీసుకున్నారా?
రాష్ట్రంలో మొత్తం 9,363 లైసెన్సులతో 10,116 ఆయుధాలున్నాయి. వీటిలో 8,500 ఆయుధాలను ఇప్పటికే వెనక్కి తీసుకున్నాం. బ్యాంకులు, ఇతర భద్రత సంస్థల వద్ద మరో 1,485 ఉన్నాయి. వారు ఎన్నికల అధికారుల అనుమతి తీసుకుని వివరాలివ్వాలి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారివద్ద మరో 107 ఆయుధాలున్నాయి.

పెండింగ్‌లో ఉన్న బెయిలుకు వీలులేని వారెంట్లన్నీ (నాన్‌ బెయిల్‌బుల్‌) పరిష్కరించారా?
ప్రస్తుతం 6,357 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో 336 వారెంట్లను ఇప్పటికే అమలు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ప్రధానంగా భౌతిక దాడులకు సంబంధించిన కేసుల్లో 668 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

సమస్యాత్మక గ్రామాలెన్ని? చర్యలేంటి?
1,484 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. అవసరాన్ని బట్టి అక్కడ పోలీసు పికెట్లు ఏర్పాటు చేస్తాం. స్థానిక పరిస్థితులు, అవసరాన్ని బట్టి ఆ పికెట్లలో సిబ్బందిని పెడతాం. ముందు జాగ్రత్త చర్యగా 99,225 మందిని బైండోవర్‌ చేశాం.

నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలపై ఎలాంటి దృష్టి సారించారు?
ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నాం. తెలంగాణ మొత్తంతో పాటు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో మనతో పాటే తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల సరిహద్దులపై ప్రత్యేక దృష్టి సారించాం. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో నిఘా, బందోబస్తు కోసం డ్రోన్లు వినియోగిస్తాం. 121 డ్రోన్లను అందుబాటులో ఉంచాం.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు