close

ఆంధ్రప్రదేశ్

జగన్‌ భవిష్యత్తుకు కేసీఆర్‌ భరోసా 

సముద్రతీరం, ఖనిజ సంపద, ఏపీపై పెత్తనం కోసమే 
వైకాపా, భాజపాల యాప్‌లు లేవా? 
ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు ధ్వజం

ఈనాడు-అమరావతి: ‘మీ భవిష్యత్తు మా బాధ్యత అంటూ సీఎం చంద్రబాబు అయిదు కోట్ల ప్రజల కోసం పనిచేస్తుంటే.. కేసీఆర్‌ మాత్రం జగన్‌ భవిష్యత్తును బాధ్యతగా తీసుకుని కుట్ర రాజకీయాలకు తెరలేపారు. రాష్ట్రంపై పెత్తనం చేయాలని పగటి కలలు కంటున్నారు’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. వైకాపా అభ్యర్థుల ఎంపిక నుంచి బీఫాం ఇచ్చే వరకు కేసీఆర్‌ నిర్ణయమే శిరోధార్యంగా జగన్‌ పనిచేస్తున్నారని విమర్శించారు. తెరాస భవన్‌లో స్విచ్‌ వేస్తే ఏపీలో ఫ్యాన్‌ తిరిగే పరిస్థితి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో ఆయన 22 ప్రశ్నలు సంధించారు. ‘మీరు, మీ సామంతుడు కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘంపై ఒత్తిడి చేశారు. చివరిదశలో నిర్వహించాల్సిన ఎన్నికలను మొదటి దశలోకి తెచ్చారు. మీ సామంతరాజును చిత్తుగా ఓడించడానికి అయిదు కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని వెంకట్రావు స్పష్టం చేశారు. 
విజయసాయిరెడ్డి ఫిబ్రవరి 19న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరించడం, వాటన్నింటినీ మీరు అమలు చేయడం కుట్రలో భాగమే. 
తెరాస కోసం రెసిడెంట్‌ డేటా హబ్‌ యాప్‌, టీఆర్‌ఎస్‌ మిషన్‌ కాల్‌ యాప్‌ రూపొందించ లేదా? బిహారీ ప్రశాంత్‌ కిశోర్‌ ఐప్యాక్‌లో తెదేపా యాప్‌లోని సమాచారం కంటే 50 రెట్లు ఎక్కువ లేదా? మీ ఇద్దరి యాప్‌లలో జన్‌ధన్‌ ఖాతాలు, ఆధార్‌ సమాచారం ఉందనేది వాస్తవం కాదా? 
రెసిడెంట్‌ డేటా హబ్‌ ద్వారా తెలంగాణలో లక్షలాది ఓట్లు తొలగించారు. ఏపీలోనూ 8 లక్షల ఓట్లు తొలగించాలని జగన్‌కు దిశానిర్దేశం చేశారు. 
గూగుల్‌, యాహూ, అమెజాన్‌ తదితర సంస్థలు ప్రజలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్న విషయం మీ కుమారుడిని అడిగి తెలుసుకోండి. 
కిశోర్‌ ఐప్యాక్‌, భాజపా నమో యాప్‌, తెరాస తెలంగాణ మిషన్‌ యాప్‌ల ద్వారా ప్రభుత్వ లబ్ధిదారుల వివరాలు సేకరించి వారికి ఫోన్లు చేసి ఓట్లు వేయమని అడిగితే తప్పులేదు.. తెదేపా తన కార్యకర్తల వివరాల నమోదుకు యాప్‌ తయారు చేస్తే నేరమా? 
సువిశాల సముద్ర తీరం, ఖనిజ సంపద, ప్రజలపై పెత్తనం మీకు అప్పగిస్తానని చెప్పినందుకే క్విడ్‌ ప్రోకో విధానంలో వైకాపాకు రూ.వెయ్యి కోట్లు పంపిస్తున్నారా? 
వ్యాపారాలున్న వారిని బెదిరించి వైకాపాలో చేర్చడం వెనక మీ పాత్ర లేదనగలరా? 
జరిగే అభివృద్ధితో తెలంగాణ పోల్చుకుంటే ప్రజల్లో మీపై వ్యతిరేకత వస్తుందనే  ఇక్కడ బలహీనుడైన సామంతరాజు ఉండాలని జగన్‌కు మద్దతిస్తున్నారా? 
వైకాపా, తెరాస, భాజపా కుట్రలను ఆధారాలతో బయటపెట్టాం. మీరు తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోవడానికి కారణమేంటి?


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు