close

ఆంధ్రప్రదేశ్

వైకాపాలో చేరిన అలీ 

మంత్రి ఉమా సోదరుడు కూడా

ఈనాడు, అమరావతి-నందిగామ, న్యూస్‌టుడే: సినీనటుడు అలీ వైకాపాలో చేరారు. సోమవారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కండువా కప్పి అలీని జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అలీ అక్కడే విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘1999లో ఓ పార్టీ కండువాతో ఎన్నికల ప్రచారంలో తిరిగాను. 2019లో ప్రచారం చేసి జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని నా ఆశ. ఇప్పుడు పోటీ చేయను. వైకాపా కోసం ప్రచారం చేస్తా. జగన్‌ మాటిచ్చారంటే తప్పరు. అలీ.. వైకాపా కోసం ప్రచారం చేయ్‌. నిన్ను ఎలా చూసుకోవాలనేది నాకు వదిలేయ్‌. నాదీ బాధ్యత అని చెప్పారు. వైఎస్‌ కుటుంబంతో నా అనుబంధం కొత్త కాదు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డిని నెలకు రెండుమూడు సార్లు ఇంటికి వెళ్లి కలిసేవాడిని. ఇప్పుడు జగన్‌ వస్తే అభివృద్ధి బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు. విజయవాడ లేదా రాజమహేంద్రవరంలో టికెట్‌ ఇస్తే పోటీ చేస్తారా? అని విలేకరులు అడగ్గా.. పోటీ చేస్తానని అలీ సమాధానమిచ్చారు. తెదేపాలో గుంటూరు సీటు ఇవ్వనందుకే వైకాపాలోకొచ్చారా అని ప్రశ్నించగా..‘‘గుంటూరులో స్థానికులకే టికెట్‌ ఇవ్వాలని ఆ పార్టీలో చాలామంది నాయకత్వం వద్ద అభ్యంతరం తెలిపినట్టు నాకు తెలిసింది. పైగా ఎప్పుడు వెళ్లినా చూద్దాం చేద్దాం అనే మాట తప్ప.. నేనున్నా.. నేను చూసుకుంటాననే మాట ఎప్పుడూ అక్కడ రాలేదు. అందువల్లే తెదేపాలో కొనసాగడాన్ని విరమించుకున్నా’’అని అలీ వివరించారు. 
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్‌ సోమవారం వైకాపాలో చేరారు. హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లో ఆ పార్టీ అధినేత జగన్‌ నివాసానికి ఆయనను కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకటకృష్ణప్రసాద్‌ తీసుకెళ్లారు. చంద్రశేఖర్‌కు జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. వేర్వేరు కారణాలతో వైకాపాలో చేరుతున్నట్లు తెలిపారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు