close

ఆంధ్రప్రదేశ్

పొత్తులపై పార్టీల కసరత్తు 

కీలక రాష్ట్రాల్లో మైత్రిని ఖరారు చేసుకున్న భాజపా 
నేడో రేపో కొలిక్కి తీసుకురానున్న కాంగ్రెస్‌

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో దేశంలోని ప్రధాన పార్టీలు పొత్తులపై దృష్టిసారించాయి. చిన్నచిన్న పార్టీలతో ఒనగూరే ప్రతి స్వల్ప శాతం ఓట్లు కూడా తుది ఫలితాలపై గణనీయ ప్రభావాన్ని చూపే అవకాశం ఉండటంతో ఈసారి రాజకీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం పెరిగింది. కీలక రాష్ట్రాల్లో భాజపా ఇప్పటికే పొత్తులను ఖరారు చేసుకోగా.. విపక్ష కాంగ్రెస్‌ కూడా అదే బాటలో పయనిస్తోంది. 
కొన్ని సందర్భాల్లో మిత్రపక్షాలతో భాజపాకు పొసగని పరిస్థితి ఏర్పడింది. అయితే పొత్తుల ప్రాముఖ్యతను గుర్తించిన ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా చొరవ తీసుకొని ఆ పార్టీలు అధికార ఎన్‌డీయేతో కొనసాగేలా చూశారు. సీట్ల పంపకంలో పట్టుదలకు పోకుండా, మిత్రపక్షాల డిమాండ్లకు అనుగుణంగా సర్దుబాటు చేసుకున్నారు. తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రంలో భాజపాకు పెద్దగా పాత్ర లేదు. దీంతో అధికార అన్నాడీఎంకేతో జట్టుకట్టి కొన్ని సీట్లను తీసుకుంది. చిన్నచిన్న ద్రవిడ పార్టీలూ ఈ కూటమిలో ఉన్నాయి. 
అత్యంత కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ-బీఎస్పీ మహాకూటమిని ఏర్పాటు చేసుకొని జోరుమీదున్నాయి. అయితే ఇందులో కాంగ్రెస్‌కు స్థానం దక్కలేదు. ఇక్కడ ఓట్లలో స్వల్ప తేడాలు వచ్చినా గెలుపోటములు తారుమారవుతాయి. ఈ రాష్ట్రంలో భాజపాకు అప్నాదళ్‌, సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. నిజానికి ఈ రెండు పార్టీలూ కమలనాథుల తీరుపై గుర్రుగా ఉన్నాయి. అయితే వాటిని సర్దుబాటు చేసుకుంటామని భాజపా నేతలు చెబుతున్నారు. 
40 సీట్లున్న బిహార్‌లో మహాకూటమిగా ఏర్పడి భాజపా, జేడీయూలను ఢీకొట్టాలనుకుంటున్న విపక్షాల ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. ఆర్జేడీ, కాంగ్రెస్‌, ఆర్‌ఎల్‌ఎస్‌పీ, జితన్‌ రామ్‌ మాంఝీకి చెందిన హెచ్‌ఏఎం మధ్య సీట్ల పంపకంపై ఫార్ములా ఇంకా సిద్ధంకాలేదు. ఎన్‌డీయే కూటమి విషయానికొస్తే భాజపా, జేడీయూ, ఎల్జేపీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. ఇక్కడ భాజపా, జేడీయూలు చెరో 17 స్థానాలోను, ఎల్జేపీ ఆరు చోట్ల పోటీ చేయనున్నాయి. 
మహారాష్ట్రలో భాజపా 25 స్థానాల్లో, శివసేన 23 చోట్ల పోటీ చేయనున్నాయి. ఒకదశలో ఒంటిరిపోరుకు శివసేన సిద్ధపడింది. అయితే ఎక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా కమలనాథులు ఆ పార్టీని శాంతింపజేశారు. ఈ రాష్ట్రంలో ఎన్‌సీపీతోను, కర్ణాటకలో జేడీఎస్‌తోను కాంగ్రెస్‌ ఇంకా పొత్తులను ఖరారు చేసుకోవాల్సి ఉంది. మంగళవారం గుజరాత్‌లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో పొత్తులపై చర్చిస్తామని, రానున్న రోజుల్లో వీటిని కొలిక్కి తెస్తామని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు