close

ఆంధ్రప్రదేశ్

గాంధీ భారత్‌ కావాలా? గాడ్సే భారత్‌ కావాలా?

రాహుల్‌ గాంధీ ప్రశ్న
తానెప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేయలేదని వెల్లడి

దిల్లీ: ప్రేమతో నిండే మహాత్మా గాంధీ భారత్‌ కావాలో, విద్వేషం ఉండే గాడ్సే భారత్‌ కావాలో తేల్చుకోవాలంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. ‘మేరా బూత్‌- మేరా గౌరవ్‌’ కార్యక్రమంలో భాగంగా దిల్లీకి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలతో సోమవారం ఆయన మాట్లాడారు. ‘‘గాంధీ భారత్‌ కావాలో, గాడ్సే భారత్‌ కావాలో మీరే నిర్ణయం తీసుకొండి. ఒకవైపు ప్రేమ, సౌభాతృత్వం ఉన్నాయి. మరోవైపు విద్వేషం, భయం ఉన్నాయి. మహాత్ముడు ఎప్పుడూ భయపడలేదు. ఏళ్ల తరబడి జైలులో ఉన్నారు. కానీ బ్రిటిష్‌ వారితో ప్రేమగానే మాట్లాడారు. వీర్‌ సావర్కర్‌ మాత్రం తనను జైలు నుంచి విడుదల చేయాలంటూ బ్రిటిషువారికి క్షమాపణ పత్రాలు రాశారు’’ అని విమర్శించారు. ‘‘మన ఇద్దరు ప్రధానులు అమరులయ్యారు. మనం ఎవరికీ తల వంచం’’ అని చెప్పారు. ఇటీవలి మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి తప్పుడు వాగ్దానాలూ చేయలేదని, రుణ మాఫీని అమలు చేశామని తెలిపారు.

మోదీ సెల్‌ చైనాదే
రాహుల్‌ తన ప్రసంగంలో ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. రఫేల్‌, నిరుద్యోగం, జాతీయ భద్రత వంటి అంశాలను ప్రస్తావించారు. ‘‘ఆయన భారత్‌లో తయారీ గురించి మాట్లాడుతుంటారు. కానీ తొడుక్కొనే చొక్కా, వేసుకొనే బూట్లు, సెల్ఫీలు తీసుకునే సెల్‌ఫోన్లు అన్నీ చైనావే’’ అని విమర్శించారు.

మసూద్‌ను విడుదల చేసింది మీరే
ఉగ్రవాదంపై కాంగ్రెస్‌ మెతకగా వ్యవహరించిదంటూ మోదీ చేసిన విమర్శలను రాహుల్‌ తిప్పికొట్టారు. ‘‘పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడ్డ జైష్‌ ఎ మహ్మద్‌ సంస్థ అధినేత మసూద్‌ అజార్‌ 1999లో జైలులో ఉన్నప్పుడు విడుదల చేసింది మీరు కాదా? అతడిని కాందహార్‌కు తీసుకెళ్లి అప్పగించింది ప్రస్తుత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌ కాదా?’’ అని ప్రశ్నించారు.

మండిపడ్డ స్మృతి ఇరానీ
రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో ‘మసూద్‌ అజార్‌జీ’ అంటూ గౌరవంగా సంబోధించారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఇది సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను రాహుల్‌ ప్రేమిస్తున్నారని విమర్శించారు.

వ్యంగ్యాన్నీ తప్పుపడతారా?: కాంగ్రెస్‌
‘మసూద్‌ అజార్‌జీ’ అని వ్యంగ్యంగా అంటే దాన్నీ తప్పుపడతారా అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ప్రశ్నించారు. మసూద్‌ను కాందహార్‌కు తీసుకెళ్లింది డోభాల్‌ కాదా? పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై చేసిన దాడిపై దర్యాప్తు జరపాలని పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐని మోదీజీ ఆహ్వానించలేదా?.. ఈ రెండు ప్రశ్నలకూ సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.

నేడు అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ భేటీ

అహ్మదాబాద్‌, దిల్లీ: మహాత్మా గాంధీ, సర్దార్‌ పటేల్‌లను స్మరిస్తూ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. 1930 మార్చి 12న మహాత్ముడు దండి యాత్ర (ఉప్పు సత్యాగ్రహం)ను ప్రారంభించడంతో ఆ రోజును జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఎన్నికల పోరును ప్రారంభించనుంది. ప్రధాని మోదీని ఆయన స్వస్థలంలోనే ఢీకొట్టేలా కార్యక్రమాలను రూపొందించింది. అహ్మదాబాద్‌లో జరిగే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఇందుకు వేదిక కానుంది.
తొలుత పార్టీ నాయకులంతా సబర్మతి ఆశ్రమానికి వెళ్లి మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ స్మారక కేంద్రంలో రోజంతా ఎన్నికల వ్యూహంపై చర్చలు జరుపుతారు. సాయంత్రం అదాలజ్‌లో ‘జన సంకల్ప్‌’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తారు. ‘జై జవాన్‌- జై కిసాన్‌’.... మళ్లీ పార్టీ నినాదం కానుంది. సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌,  రాహుల్‌ గాంధీతో పాటు ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా కూడా ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా పాటీదార్ల నాయకుడు హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు