close

ఆంధ్రప్రదేశ్

దర్యాప్తు అధికారం తెలంగాణ పోలీసులకు లేదు

సిట్‌ దర్యాప్తుపై అభ్యంతరం
డేటా చౌర్యం కేసులో అశోక్‌ తరఫున హైకోర్టులో వాదనలు
నోటీసులిచ్చాం.. స్పందనలేదు: పీపీ

ఈనాడు, హైదరాబాద్‌: ఓటర్ల డేటా చౌర్యం చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసే అధికారం తెలంగాణ పోలీసులకు లేదని ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూత్రా హైకోర్టులో పేర్కొన్నారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరపకుండా కేసులు నమోదు చేయడం తగదని వాదించారు. సిట్‌ దర్యాప్తుపై తమకు అభ్యంతరం ఉందన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ) ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారణ జరుపుతోందన్నారు. అశోక్‌కు నోటీసులు జారీ చేసినా స్పందించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌.. పోలీసులిచ్చిన నోటీసులకు బదులివ్వాల్సిందిగా పిటిషనర్‌కు సూచించారు. అప్పటి వరకు అరెస్ట్‌పై  నిలుపుదల ఉత్తర్వులివ్వాలన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థనపై స్పందిస్తూ ఎందుకు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు. మాదాపూర్‌, ఎస్సార్‌నగర్‌ ఠాణాల్లో తనపై నమోదైన కేసుల్ని రద్దు చేయాలని కోరుతూ అశోక్‌ హైకోర్టులో రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

అశోక్‌కు మరోసారి నోటీసులు
ఐటీ గ్రిడ్స్‌ అధినేత డాకవరపు అశోక్‌కు తెలంగాణ సిట్‌ అధికారులు సోమవారం మరోమారు నోటీసులు జారీ చేశారు. గతంలో రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. స్పందన లేదు. తాజాగా సిట్‌ అధికారులు సోమవారం కేపీహెచ్‌బీలోని అశోక్‌ ఇంటికి వెళ్లారు. తాళం వేసి ఉంది. నోటీసును తలుపునకు అంటించారు. ‘ఈనెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ గోషామహల్‌లోని సిట్‌ కార్యాలయానికి రావాలని అశోక్‌ ఇంటికిఅంటించిన నోటీసులో పేర్కొన్నాం’ అని సిట్‌ అధికారులు వివరించారు.

కొనసాగుతున్న దర్యాప్తు
ఐటీ గ్రిడ్స్‌, బ్లూఫ్రాగ్‌ సంస్థల్లో స్వాధీనం చేసుకున్న ఉపకరణాలకు సంబంధించిన ఫోరెన్సిక్‌ నివేదిక సోమవారం కూడా అందలేదు. అమెజాన్‌, గూగుల్‌ సంస్థల్లో నిల్వ చేసిన  క్లౌడ్‌ డేటాకు సంబంధించిన నివేదిక రాలేదు. దాంతో అధికారులు వారి వద్ద ఉన్న ఇతర ఆధారాలు, స్వాధీనం చేసుకున్న దస్త్రాల విశ్లేషణ కొనసాగిస్తున్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు