close

ఆంధ్రప్రదేశ్

రైతు ఆత్మహత్యలపై ముగిసిన వాదనలు

నిర్ణయాన్ని వాయిదా వేసిన హైకోర్టు
ఈనాడు - అమరావతి

రైతు ఆత్మహత్యల నివారణకు తగిన చర్యలు తీసుకునేలా సర్కారును ఆదేశించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ధర్మాసనం.. నిర్ణయాన్ని వాయిదా వేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన రైతు కొల్లి శివరామిరెడ్డి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన విచారణలో శివరామిరెడ్డి నేరుగా వాదనలు వినిపిస్తూ.. పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫారసును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. బ్యాంకులు రుణాలివ్వక.. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) రమేశ్‌ వాదనలు వినిపిస్తూ.. రైతు సమస్యలను పరిష్కరించేందుకు రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలాంటి సమస్యలున్నా ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లొచ్చన్నారు. రైతు ఆత్మహత్యలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల పలు మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీచేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రస్తుత వ్యాజ్యంలోనూ తగిన ఆదేశాలు జారీచేస్తామని పేర్కొంటూ నిర్ణయాన్ని వాయిదా వేసింది.

సుబ్రహ్మణ్యస్వామి వ్యాజ్యంపై విచారణ 3కు వాయిదా
రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని(తితిదే) తప్పించాలని అభ్యర్థిస్తూ రాజ్యసభ సభ్యుడు, భాజపా నేత డాక్టర్‌ సుబ్రహ్మణ్యస్వామి, మరొకరు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ ఏప్రిల్‌ 3కు వాయిదా పడింది. సోమవారం కోర్టు విధుల ప్రారంభ దశలోనే సుబ్రహ్మణ్య స్వామి.. తాను దాఖలు చేసిన వ్యాజ్యం గురించి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఇప్పటి వరకు తమ వ్యాజ్యంలో సర్కారు, తితిదే ప్రమాణపత్రం దాఖలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వ్యాజ్యాలపై విచారణ త్వరగా జరపాలని కోరారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌   ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. విచారించేందుకు తాము సిద్ధమేనని, తేదీని మీరే ఖరారు చేయాలని కోరింది. ఏప్రిల్‌ 3న వాదనలు వినిపిస్తామని సుబ్రహ్మణ్యస్వామి తెలపడంతో విచారణ ఆ రోజుకు వాయిదా పడింది. తితిదే, తిరుచానూరు పద్మావతి దేవి ఆలయంతో పాటు మరో 11 ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణను తప్పించాలని సుబ్రహ్మణ్య స్వామి, దిల్లీకి చెందిన న్యాయవిద్యార్థి సత్యపాల్‌ సభర్వాల్‌ గతేడాది హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు