close

ఆంధ్రప్రదేశ్

200 మంది విద్యార్థినులపై లైంగిక దాడులు

ప్రేమ పేరిట వంచన
ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపు
సామాజిక మాధ్యమాలే వేదికగా వల
తమిళనాట వెలుగుచూసిన దారుణం
చెన్నై - న్యూస్‌టుడే

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా అపరిచితులను నమ్మి వారి కామకోరలకు చిక్కుకున్న విద్యార్థినుల ఉదంతాలు తమిళనాట నమోదవుతున్నాయి. యువతులు, బాలికలను నమ్మించి అకృత్యాలకు పాల్పడుతూ.. వారి రోదనలు, వేదనలను ఏకంగా చిత్రీకరిస్తూ వైరల్‌ చేస్తూ కొందరు భయపెట్టిస్తున్నారు. నిందితుల వలలో చిక్కి దీనంగా అభ్యర్థించే విద్యార్థినులకు సంబంధించిన రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఒక కేసులో నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న చరవాణుల్లో సుమారు వందకుపైగా వీడియోలు ఉన్నాయని, బాధితులు 200 మంది వరకు ఉండవచ్చనే వార్తలు వచ్చాయి. విద్యార్థినులను అశ్లీలంగా ఫొటోలు తీసి బెదిరిస్తూ డబ్బు రాబట్టడం, వాంఛ తీర్చుకోవడమే ముఠా లక్ష్యంగా అనుమానిస్తున్నారు. తమిళనాట ఓ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి చెందిన తిరునావుక్కరసు అదే ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినితో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్నాడు. సాన్నిహిత్యం పెరిగినందున తన మిత్రులకు పరిచయం చేస్తానంటూ ఫిబ్రవరి 12న ఆమెను కారులో తీసుకెళ్లాడు. ఊంచపేలంపట్టి అనే ప్రాంతంలో తిరునావుక్కరసు మిత్రులు నలుగురు కారులోకి ఎక్కారు. నిర్జన ప్రాంతానికి కారును తీసుకెళ్లి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దానిని చరవాణిలో చిత్రీకరించారు. లైంగికవాంఛ తీర్చాలని, లేకపోతే వీడియో, ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తామంటూ బెదిరించారు. విద్యార్థిని తన తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో శబరి, వసంతకుమార్‌, సతీష్‌కుమార్‌లను పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు. పరారీలో ఉన్న తిరునావుక్కరసును తిరుపతిలో గత వారం అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో కొందరు ప్రముఖులకూ సంబంధం ఉందంటూ అరెస్టుకు ముందు సామాజిక మాధ్యమంలో తిరునావుక్కరసు ఆడియో విడుదల చేయడం కలకలం రేపింది. విద్యార్థినులపై లైంగిక దాడుల ఘటనల వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయముందనే వదంతులు రావడంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. నిందితుల నుంచి నాలుగు వీడియోలను స్వాధీనం చేసుకున్నామని కోయంబత్తూరు ఎస్పీ పాండియరాజన్‌ తెలిపారు. ఈ వ్యవహారంతో రాజకీయ పార్టీలకు సంబంధం లేదని అన్నారు. విద్యార్థినులపై లైంగిక దాడుల కేసులో నలుగురిని అరెస్టు చేసినప్పటికీ దీని వెనక పెద్ద ముఠానే ఉందనే ఆరోపణలు వచ్చాయి. సుమారు రెండేళ్లుగా ఈ ముఠా అకృత్యాలకు పాల్పడుతోందని సమాచారం. దీనిపై న్యాయపోరాటం చేయనున్నట్టు ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ప్రకటించారు. దారుణాలను సినీ ప్రముఖులూ ఖండించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు