close

ఆంధ్రప్రదేశ్

సీబీఎస్‌ఈ విద్యార్థులకు ఊరట

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య ప్రణాళికలో కోతకు కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టడమనే సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) కసరత్తు చేస్తోంది. ఇప్పుడున్న పాఠ్య ప్రణాళిక (సిలబస్‌)లో 50 శాతం దాకా కుదించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఏటా కొంత వరకు సిలబస్‌కు కోత పెట్టనున్నారు. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరానికి(2019-20) 10-15 శాతం వరకు భారం తగ్గనుంది. ఇది దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది విద్యార్థులకు ఊరట కలిగించనుంది. ప్రస్తుతం కేవలం పుస్తకాలే ప్రపంచంగా విద్యార్థులు ఉంటున్నారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ భావిస్తోంది. వ్యాయామం, నైతిక విద్య, జీవన నైపుణ్యాలు, ప్రయోగపూర్వక విద్య లేకుండా పోయిందని.. పిల్లలకు సంపూర్ణ విద్య(హోలిస్టిక్‌ ఎడ్యుకేషన్‌) అందించాలంటే వాటిని దైనందన కాలపట్టికలో చేర్చాలని అనుకుంటున్నారు. అది జరగాలంటే ఇప్పుడున్న పాఠ్య ప్రణాళికను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. దశలవారీగా 2021-22 విద్యా సంవత్సరం నాటికి 50 శాతం సిలబస్‌ను తగ్గించాలన్నది లక్ష్యం.

సీబీఎస్‌ఈ అనుబంధంగా నడిచే పాఠశాలల్లో ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన పుస్తకాలనే వినియోగిస్తారు. ఐసీఎస్‌ఈ బోర్డు సైతం ఇదే సిలబస్‌ను పాటిస్తుంది. సిలబస్‌ తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నందున ఆ దిశగా ఎన్‌సీఈఆర్‌టీ కసరత్తు చేస్తోంది. సైన్స్‌, భాషలు, గణితంతో పోల్చుకుంటే సాంఘికశాస్త్రంలో ఎక్కువగా భారం తగ్గనుంది. మరో వైపు 11, 12 తరగతుల్లో సిలబస్‌ తగ్గించాల్సిన అవసరం లేదని ఎన్‌సీఈఆర్‌టీ నిర్ణయించింది. మరోవైపు అసలు పాఠ్య పుస్తకాలు ఎలా రూపొందించాలి? ప్రాతిపదిక ఏమిటి? ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో సూచిస్తూ పూర్తిస్థాయి మార్గదర్శకాలు తయారీకి జాతీయ మండలి శ్రీకారం చుట్టింది. తెలంగాణ నుంచి విశ్రాంత ఆచార్యుడు ఉపేందర్‌రెడ్డిని సైతం ఆహ్వానించి ఇటీవల దిల్లీలో ఎన్‌సీఈఆర్‌టీ ఓ కార్యశాల నిర్వహించింది. ఆ అంశాలను ఆయా రాష్ట్రాల విద్యాపరిశోధన, శిక్షణ మండళ్లకు పంపించనున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు