close

ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాల తనిఖీకి పది రోజుల డ్రైవ్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మద్యం దుకాణాల తనిఖీకి పది రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ముకేష్‌కుమార్‌ మీనా అధికారులను ఆదేశించారు. ఎన్నికల వేళ రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున మద్యం నిల్వ చేసే అవకాశం ఉన్నందున తనిఖీలను విస్తృతం చేయాలన్నారు. సరకు ధ్రువీకరణకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. నిల్వ రిజిస్టర్‌ను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి నివేదిక పంపించాలన్నారు. విజయవాడలోని ఎక్సైజ్‌ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో మీనా మాట్లాడారు. గతేడాది ఇదే సమయంలో జరిగిన మద్యం విక్రయాల కంటే ఈసారి మించకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సుంకం చెల్లించని మద్యం రాష్ట్రంలోకి రాకుండా నివారించేందుకు 71 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ‘‘మద్యం దుకాణాల్లో రాజకీయ పార్టీల ప్రచార సామగ్రి ఉంటే తక్షణమే తొలగించాలి. దుకాణాలు ఎన్నికల ప్రచార వేదికలుగా మారకూడదు. నాటుసారా తయారీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిసారించాలి’’ అని సిబ్బందిని ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు అదనపు కమిషనర్‌ కేఎల్‌ భాస్కర్‌, ఉభయ గోదావరి జిల్లాలకు సంయుక్త కమిషనర్‌ చంద్రశేఖర్‌నాయుడు, నెల్లూరు, ప్రకాశం చిత్తూరు జిల్లాలకు సంయుక్త కమిషనర్‌ జోసఫ్‌, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సంయుక్త కమిషనర్‌ దేవ్‌కుమార్‌లను బాధ్యులుగా నియమించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు