close

ఆంధ్రప్రదేశ్

‘పుల్వామా’ సూత్రధారి హతం

ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టిన భద్రతా బలగాలు

శ్రీనగర్‌: పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి సూత్రధారి ముదాసిర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ ‘మహ్మద్‌ భాయ్‌’ని భద్రతా బలగాలు ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని పింగ్లిష్‌లో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నట్లు నిఘావర్గాల నుంచి సమాచారం అందడంతో.. భద్రతా బలగాలు ఆదివారం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో గాలింపు కాస్తా ఎదురుకాల్పులుగా మారింది. ఆదివారం సాయంత్రం మొదలైన ఎదురుకాల్పులు సోమవారం ఉదయం వరకు కొనసాగాయి. ఈ క్రమంలో జైష్‌-ఎ-మహ్మద్‌ (జేఈఎం) ఉగ్రవాది ముదాసిర్‌ అహ్మద్‌ ఖాన్‌ మరణించాడు. మరణించిన రెండో ముష్కరుడు ఎవరన్నది తేలాల్సి ఉంది. తొలుత అతడిని పుల్వామా దాడికి వాహనం సమకూర్చిన జేఈఎం నిర్వాహకుడు సాజిత్‌ భట్‌గా అధికారులు పేర్కొన్నారు. అయితే భట్‌ సోదరుడు మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిరాకరించారు. మృతదేహాం గుర్తుపట్టలేనంతగా కాలిపోవడమే ఇందుకు కారణం.

మరో దాడికి జైష్‌ కుట్ర!
జమ్మూకశ్మీర్‌ లోయలో మరో పుల్వామా తరహా ఉగ్రదాడి జరిగే ముప్పు ఉందని భద్రతా బలగాలను నిఘావర్గాలు హెచ్చరించాయి. ఆత్మాహుతి బాంబు దాడి జరిపేందుకు జైష్‌-ఎ-మహ్మద్‌ కుట్ర పన్నుతున్నట్లు కూడా పేర్కొన్నాయి. ఈ మేరకు జైష్‌ కమాండర్‌ కశ్మీర్‌ లోయలోని యువతను నియమించుకుని వారికి పేలుడు పదార్థాల తయారీలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించాయి.  ఐదుగురు లేదా ఆరుగురు ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నట్లు పేర్కొన్నాయి. పుల్వామా దాడిలో వాడిన పేలుడు పదార్థం కేవలం 200 కిలోలని, 500 కిలోల పేలుడుకు సిద్ధంగా ఉండాలని  జైష్‌-ఎ-మహ్మద్‌తో సంబంధాలున్న సామాజిక అనుసంధాన వేదిక ఖాతాలో (ప్రస్తుతం మూసివేశారు) ఉన్నట్లు సంకేత సమాచారాన్ని విశ్లేషించి వెల్లడించాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు