close

ఆంధ్రప్రదేశ్

విజిలెన్స్‌ నివేదికతో అధికారులపై చర్యలు

ఎత్తిపోతల నిర్వహణలో అక్రమాలపై హైకోర్టుకు తెలిపిన సర్కారు

ఈనాడు, అమరావతి: ఉభయగోదావరి జిల్లాల్లో ఎత్తిపోతల నిర్వహణ విషయమై అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు ప్రారంభించామని సర్కారు హైకోర్టుకు తెలిపింది. బాధ్యులైన ఇంజినీర్లు, ఇతర అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు ఇచ్చిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) రమేశ్‌ తెలిపారు. వివరాలను నమోదుచేసిన ధర్మాసనం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ ప్రమాణపత్రాల దాఖలుకు ఆదేశించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశించింది. రబీ సీజన్‌ 2015-16 సంవత్సరానికి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తోడివేతకు కృత్రిమ అత్యవసర పరిస్థితి కల్పించిన అధికారుల తీరువల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.16 కోట్ల నష్టం వాటిల్లిందంటూ జర్నలిస్టు, హక్కుల ఉద్యమకారుడు ఎన్‌.శ్రీరంగనాథ్‌ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని విజిలెన్స్‌ నివేదిక బయటపెట్టినా బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. సోమవారం ఈవ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు ప్రారంభించామని ఎస్‌జీపీ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు