close

ఆంధ్రప్రదేశ్

వైకాపాలో వీడని సందిగ్ధత!

కొలిక్కి రాని ఎంపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ
ఈనాడు - అమరావతి

లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారు విషయంలో వైకాపా ఇంకా సందిగ్ధంలోనే ఉంది. మొత్తం 25 స్థానాల్లో ఇప్పటివరకూ పదింటికి కూడా అభ్యర్థులు కొలిక్కి రాని పరిస్థితి నెలకొంది. బలమైన అభ్యర్థుల ఎంపికకు, కొత్తవారి కోసం ప్రయత్నిస్తుండడం ఇందుకు నేపథ్యమవుతోంది.
* అనంతపురం, కర్నూలులో బీసీలకు, రాజమహేంద్రవరంలో శెట్టిబలిజ సామాజికవర్గానికి టికెట్‌ ఇస్తామని జగన్‌ పాదయాత్రలో ప్రకటించారు.
* రాష్ట్ర మంత్రి ఒకరు పార్టీలోకి వస్తారనుకున్నా ఆయన రాకపోవడంతో రాజమహేంద్రవరం స్థానానికి ఇటీవలే మార్గాని భరత్‌ పేరును ప్రకటించారు.
* అనంతపురంలో రంగయ్యను పార్టీ సమన్వయకర్తగా నియమించినా తెదేపా నుంచి జేసీ కుటుంబం బరిలో నిలుస్తుందని, దాన్ని ఢీకొట్టేందుకు అనంత వెంకట్రామిరెడ్డి అయితేనే సరిపోతారన్న భావనలో వైకాపా అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లే అనంతపురం నగర అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా అనంతను ఖరారు చేసినా ఆయన్ను అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం మొత్తాన్ని పర్యవేక్షించాలని చెప్పిందంటున్నారు. అక్కడ అనంతనా బీసీ అభ్యర్థినా అనేది తేలడం లేదు.
* కర్నూలులో తెదేపా నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి బరిలో నిలుస్తుండడంతో ఆయన్ను ఢీకొట్టేందుకు బలమైన బీసీ అభ్యర్థి కోసం వైకాపా వెతుకుతోంది. ఇక్కడ పార్టీ సమన్వయకర్తగా బీవై రామయ్య ఉన్నారు.
* నంద్యాలలో శిల్పా కుటుంబం ఆశించగా..వారి కుటుంబం నుంచే మూడు టికెట్లు సాధ్యపడదని ప్రత్యామ్నాయం కోసం వేచి చూసిందా పార్టీ అధినాయకత్వం. ఇప్పుడు వ్యాపారవేత్త పోచ బ్రహ్మానందరెడ్డి పార్టీలో చేరడంతో ఆయన పేరును పరిశీలిస్తున్నారు.
* తిరుపతిలో వైకాపా తరపున గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచి గతేడాది పార్టీ నిర్ణయం మేరకు రాజీనామా చేసిన వరప్రసాద్‌ను నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దించాలని నిర్ణయించిన అధిష్ఠానం తిరుపతి లోక్‌సభ స్థానం కోసం కొత్త అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది. ఇటీవలే పార్టీలో చేరిన మధుసూదనరావు పేరును ఇక్కడ పరిశీలించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

* విజయవాడలో పారిశ్రామికవేత్త, గతంలో తెదేపాలో పనిచేసిన దాసరి జైరమేష్‌ పార్టీలో చేరడంతో ఆయన పేరును ఇక్కడ పరిశీలిస్తున్నారు.
* ఏలూరులో ఒక సీనియర్‌ నేత పార్టీలోకొచ్చే అవకాశం ఉందని ఆ సీటును ఆపారంటున్నారు. ఇక్కడ కోటగిరి శ్రీధర్‌ పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు.
* రఘురామకృష్ణంరాజు పార్టీలోకి తిరిగిరావడంతో ఆయనకు నరసాపురం స్థానాన్ని దాదాపు ఖరారు చేశారు.
* విజయనగరంలో బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచే ఒకరికి అవకాశం ఉందంటున్నారు.
* శ్రీకాకుళంలో ప్రస్తుతానికి పార్టీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ ఉన్నారు. ఇటీవలే పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని వెంటనే శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షురాలుగా పార్టీ నియమించింది. వీరిద్దరిలో ఎవరు అభ్యర్థి అవుతారనేదీ తేలాల్సి ఉంది.
* గుంటూరులో మోదుగుల వేణుగోపాలరెడ్డి పేరును పరిశీలిస్తున్నారు.
* శనివారం పార్టీలో చేరిన విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పేరును అనకాపల్లి లోక్‌సభ స్థానానికి పరిశీలిస్తున్నారు. అయితే దాడి తన కుమారుడు రత్నాకర్‌కు అసెంబ్లీ నియోజకవర్గ సీటు ఇస్తే చాలని తాను పోటీ చేయనని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ లోక్‌సభ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా వరుదు కళ్యాణి కొనసాగుతున్నారు.
* అరకు, బాపట్ల, చిత్తూరు, కర్నూలు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులవిషయం కొలిక్కిరాలేదు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు