close

ఆంధ్రప్రదేశ్

నరసరావుపేట నుంచి కన్నా లక్ష్మీనారాయణ!

విశాఖ నుంచి హరిబాబు లేదా పురందేశ్వరి
అభ్యర్థుల ఎంపికపై భాజపా సమాలోచనలు

ఈనాడు, అమరావతి, దిల్లీ: రాష్ట్రంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు  అభ్యర్థుల ఎంపికపై భాజపా రాష్ట్రశాఖ దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర నాయకత్వానికి త్వరలో ప్రతిపాదిత అభ్యర్థుల ఎంపిక జాబితాలు పంపించేందుకు కసరత్తును ముమ్మరం చేసింది. కొద్దికాలం కిందటే లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల వారీగా కన్వీనర్లను భాజపా ప్రకటించింది. సాధారణంగా కన్వీనర్లుగా వ్యవహరించే వారే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉంది. అయితే వారిలో పలువురు పోటీకి ఆసక్తి చూపకపోవటం, కన్వీనర్లుగా లేకున్నా మరికొందరు పోటీకి ఆసక్తి కనబరుస్తున్నందున మార్పులు, చేర్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో భాజపా ఒంటరిపోరును సాగిస్తోంది.రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాలకూ అభ్యర్థులను పోటీకి నిలబెట్టేందుకు భాజపా సిద్ధమవుతోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీకి సిద్ధమైన మాణిక్యాలరావు ప్రచారాన్ని ప్రారంభించారు. విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్‌రాజు యథావిధిగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కామినేని శ్రీనివాస్‌ ఈ ఎన్నికల్లో పోటీచేయబోనని ప్రకటించారు. మరో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరారు. విజయవాడ సెంట్రల్‌ స్థానం నుంచి తురాగా నాగభూషణం పోటీ చేసే విషయమై పార్టీలో పరిశీలన జరుగుతోంది. బీజేవైఎం అధ్యక్షుడు రమేష్‌నాయుడు, తదితరుల పేర్లు కూడా పార్టీ తరఫున పోటీకి నిలబెట్టాలనుకుంటున్న వారిలో ఉన్నట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుల నుంచి శాసనసభ నియోజకవర్గాల వారీగా దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. నరసరావుపేటలో సోమవారం జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధిష్ఠానవర్గం ఆదేశాలు అనుసరించి పోటీ చేస్తానని ప్రకటించగా నరసరావుపేట నుంచి పోటీచేయాలని కార్యకర్తలు కోరారు.

ఆగిన బస్సు యాత్ర
ఫిబ్రవరి మొదటి వారంలో శ్రీకాకుళం జిల్లా నుంచి బస్సు యాత్రను కన్నా లక్ష్మీనారాయణ ఆరంభించారు. అనంతరం గుంటూరు, విశాఖ నగరాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు. దీనివల్ల బస్సు యాత్రను మధ్యలో నిలపాల్సి వచ్చింది. ఈ నెల 13 నుంచి బస్సు యాత్రను తిరిగి ప్రారంభించేందుకు పార్టీ సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినందున సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకుని బస్సు యాత్రను రద్దు చేస్తున్నట్లు పార్టీ ఉపాధ్యక్షుడు తురాగా నాగభూషణం ఓ ప్రకటనలో తెలిపారు.

20 లోపు అభ్యర్థుల జాబితా: జీవీఎల్‌
ఆంధ్రప్రదేశ్‌లో భాజపా లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల జాబితాను ఈ నెల 20 లోపు విడుదల చేస్తామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. దిల్లీలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు