close

ఆంధ్రప్రదేశ్

జస్టిస్‌ ఎస్వీ భట్‌కు ఘనంగా వీడ్కోలు

న్యాయసేవలను కొనియాడిన ఏసీజే
ఈనాడు - అమరావతి

కేరళ హైకోర్టుకు బదిలీపై వెళుతున్న హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్వీ భట్‌కు సోమవారం హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలో న్యాయమూర్తులు అంతా మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ ఎస్వీ భట్‌ మాట్లాడుతూ.. విధినిర్వహణలో తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు ఏసీజే మాట్లాడుతూ.. జస్టిస్‌ ఎస్వీ భట్‌ కష్టించి పనిచేసేవారన్నారు. కీలక తీర్పులు ఇచ్చారని గుర్తుచేశారు. హైకోర్టు పరిపాలనాపరమైన నిర్ణయాల్లోనూ సహకారం అందించారన్నారు. జస్టిస్‌ భట్‌ 18వేల ప్రధాన వ్యాజ్యాల్ని, మరో 18వేల అనుబంధ పిటిషన్లను పరిష్కరించారని కొనియాడారు. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. జస్టిస్‌ ఎస్వీ భట్‌ ప్రస్థానాన్ని గుర్తుచేశారు.

జస్టిస్‌ ఎస్వీ భట్‌ను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. న్యాయవాదుల మండలి కార్యాలయంలో జరిగిన  కార్యక్రమంలో జస్టిస్‌ భట్‌.. న్యాయవాదులకు, న్యాయమూర్తులకు పలు సూచనలు చేశారు. న్యాయవాదిగా ప్రాక్టీసు చేసిన కాలంలో.. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు తన తీరు ఒకే విధంగా ఉందన్నారు. వృత్తి జీవితంలో నిబద్ధతతో పనిచేశానన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీజే జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌.. జస్టిస్‌ భట్‌కు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామన్నదొర, ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌, న్యాయవాదుల మండలి ఛైర్మన్‌ గంటా రామారావు, సిబ్బంది హాజరయ్యారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు