close

ఆంధ్రప్రదేశ్

తెదేపా ఎంపీ అభ్యర్థులపై విస్తృత కసరత్తు

సామాజిక, రాజకీయ సమీకరణాలే కీలకం
ఇప్పటికే 13 మంది అభ్యర్థులు దాదాపు ఖరారు
ఈనాడు - అమరావతి

న్నికల షెడ్యూల్‌ వెలువడేనాటికే వందకు పైగా అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై ఓ స్పష్టతకు వచ్చిన తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు... లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు మాత్రం ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఇంతవరకు 13 లోక్‌సభ స్థానాల అభ్యర్థులపై ఆయన దాదాపు ఓ నిర్ణయానికి వచ్చారు. మిగతా 12 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై విస్తృత కసరత్తు చేయాల్సి వస్తోంది. కొన్ని అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపిక, లోక్‌సభ స్థానాల అభ్యర్థులు ఎవరన్నదానితో ముడిపడి ఉండటంతో... అటు శాసనసభ అభ్యర్థుల్ని ఖరారు చేయడంలోనూ జాప్యం జరుగుతోంది. సామాజిక, రాజకీయ సమీకరణాలు, ఆర్థిక పరిపుష్టి వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కనీసం ఒక లోక్‌సభ టికెట్‌ అయినా మహిళలకు ఇవ్వాలన్న ప్రతిపాదనా పరిశీలనలో ఉంది. రాజమహేంద్రవరం టికెట్‌ను మహిళలకు కేటాయిస్తే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అక్కడి నుంచి మురళీమోహన్‌ కోడలు రూపకు గానీ, ఆమె పోటీకి నిరాకరిస్తే ముళ్లపూడి రేణుకకుగానీ టికెట్‌ ఇచ్చే అవకాశాలున్నాయన్న చర్చ పార్టీలో జరుగుతోంది. పోలింగ్‌కు తక్కువ సమయం ఉండటంతో... వీలైనంత త్వరగా శాసనసభ అభ్యర్థుల్ని ఖరారు చేసి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న చంద్రబాబు, లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియనూ వేగవంతం చేసే అవకాశముంది.

విజయనగరం నుంచి మళ్లీ అశోక్‌..!
పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుకే మళ్లీ విజయనగరం టికెట్‌ దాదాపు ఖాయమయ్యే అవకాశముంది. ఒక దశలో అశోక్‌గజపతిరాజును విజయనగరం అసెంబ్లీ స్థానానికి పోటీ చేయించి, మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుకు విజయనగరం లోక్‌సభ టికెట్‌ ఇవ్వాలన్న ఆలోచన చేశారు. కానీ బొబ్బిలి నుంచి సుజయ్‌కృష్ణ, విజయగనరం లోక్‌సభకు అశోక్‌గజపతిరాజు పోటీ చేసేందుకు చంద్రబాబు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఇక మార్పు ఉండకపోవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అమలాపురం బాలయోగి కుమారుడికే..!
అమలాపురం లోక్‌సభ టికెట్‌ను దివంగత నాయకుడు బాలయోగి కుమారుడు హరీష్‌ మాథుర్‌కు ఇవ్వాలన్న నిర్ణయం దాదాపుగా జరిగిపోయింది. హరీష్‌ను అసెంబ్లీకి పంపించి, లోక్‌సభ టికెట్‌ వేరొకరికి కేటాయించాలన్న ప్రతిపాదనా పరిశీలనలో ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. హరీష్‌ను లోక్‌సభకు పోటీచేయించేందుకే ఎక్కువ అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజమహేంద్రవరంపై మీమాంస..!
రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని చంద్రబాబుకు స్పష్టం చేశారు. వయోభారం, తాను ఏర్పాటు చేసిన ట్రస్ట్‌ను బలోపేతం చేయాల్సిన బాధ్యతల వల్ల పోటీకి దూరంగా ఉంటానని ఆయన తెలిపారు. మురళీమోహన్‌ కోడలు రూప... ఆయన ప్రతినిధిగా గతంలో కొన్ని రోజులు నియోజకవర్గంలో బాధ్యత నిర్వహించారు. ప్రస్తుతం పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు. తెదేపా అధిష్ఠానం ఈసారి ఆమెను బరిలోకి దించాలన్న ఆలోచనలో ఉంది. దానికి కూడా మురళీమోహన్‌ అంత సుముఖంగా లేనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రూప కాకపోతే... కొందరు పారిశ్రామికవేత్తల పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోంది.
* నరసాపురం లోక్‌సభ టికెట్‌ను గత ఎన్నికల్లో భాజపాకి కేటాయించారు. గోకరాజు గంగరాజు గెలిచారు. ఈసారి అక్కడి నుంచి రఘురామ కృష్ణంరాజు పేరు పరిశీలించినా... ఆయన పార్టీలో కొనసాగుతారా? లేదా? అన్న విషయంలో అనుమానాలు ఉండటంతో కొంత వేచి చూశారు. ఆయన వైకాపాలో చేరడంతో... బలమైన అభ్యర్థి కోసం పార్టీ పలువురి పేర్లు పరిశీలిస్తోంది. క్షత్రియ, కాపు సామాజిక వర్గాల నుంచి రెండేసి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విశాఖ లోక్‌సభ టికెట్‌ కాపులకు ఇవ్వకపోతే... నరసాపురం టికెట్‌ను కాపులకు కేటాయించే అవకాశముంది.
* నరసరావుపేట నుంచి ప్రస్తుతం రాయపాటి సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ టికెట్‌పై చాలా మంది ప్రముఖుల దృష్టి ఉంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని నరసరావుపేట, మాచర్ల తప్ప మిగతా అన్ని శాసనసభ స్థానాల అభ్యర్థుల్ని చంద్రబాబు ఖరారు చేశారు. సత్తెనపల్లి నుంచి మళ్లీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు పోటీ చేయనున్నారు. నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థిపై చంద్రబాబు మనసులో ఏముందో తెలియాల్సి ఉంది.
* బాపట్ల ఎంపీగా ప్రస్తుతం శ్రీరామ్‌ మాల్యాద్రి ఉన్నారు. ఈ టికెట్‌ కోసం మాల్యాద్రితో పాటు, ఇటీవలే పార్టీలో చేరిన విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి దేవీ ప్రసాద్‌ పోటీ పడుతున్నారు.

గంటా నిర్ణయం కీలకం..!

విశాఖ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలకు సంబంధించి గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా విశాఖ టికెట్‌ను భాజపాకు కేటాయించగా... హరిబాబు గెలిచారు. అనకాపల్లి నుంచి అవంతి శ్రీనివాస్‌ గెలుపొందారు. ఇటీవలే అవంతి వైకాపాలో చేరారు. అనకాపల్లి టికెట్‌ను బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆనంద్‌కు కేటాయించిన నేపథ్యంలో... విశాఖ లోక్‌సభ స్థానం కాపులకు కేటాయించాల్సి ఉంది. లోక్‌సభకు పోటీ చేయాలా? అసెంబ్లీకి వెళ్లాలా? అసెంబ్లీకి పోటీ చేస్తే ఎక్కడి నుంచి? అన్న నిర్ణయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావుకే పార్టీ అధిష్ఠానం విడిచిపెట్టింది. గంటా నిర్ణయంపై విశాఖ లోక్‌సభ టికెట్‌తోపాటు, జిల్లాలోని రెండు మూడు శాసనసభ స్థానాల అభ్యర్థుల ఎంపిక ఆధారపడి ఉంది. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

దర్శి నుంచే పోటీ చేయండి
మంత్రి శిద్ధా అనుచరుల డిమాండ్‌

త ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఈసారి తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ఒంగోలు అభ్యర్థిగా ఎవర్ని నిలబెట్టాలన్న అంశంపై పార్టీ అధిష్ఠానం తర్జనభర్జన పడుతోంది. పలువురి పేర్లు పరిశీలిస్తోంది. తాజాగా మంత్రి శిద్ధా రాఘవరావుపేరు పరిశీలనలో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. శిద్ధా అనుచరులు మాత్రం ఆయన మళ్లీ దర్శి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పట్టుబడుతున్నారు.
* నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా పలువురి పేర్లు పార్టీ పరిశీలిస్తోంది. అధినేత ఆలోచనేంటో తెలియాల్సి ఉంది.
* రాజంపేట టికెట్‌ను కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌కు ఇవ్వాలా? వేరొకర్ని అభ్యర్థిగా పెట్టాలా? అన్న విషయంలో సీఎం కసరత్తు చేస్తున్నారు.
* నంద్యాల టికెట్‌ విషయంలో శివానందరెడ్డి అభ్యర్థిత్వంపై అధిష్ఠానం మొగ్గు చూపుతోంది. అయితే అక్కడ సిట్టింగ్‌ ఎంపీ ఎస్పీవై రెడ్డి టికెట్‌ తనకే ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతుండటంతో నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్యం జరుగుతోంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు