close

ఆంధ్రప్రదేశ్

వారిని నమ్మొద్దు

హోదాను చట్టంలో పెట్టకుండా కాంగ్రెస్‌ మోసం చేసింది
మోదీ, చంద్రబాబు, పవన్‌ హోదా అంశాన్ని హత్య చేశారు
మార్పునకు ఓటేయండి.. వైకాపాకు అవకాశం ఇవ్వండి
కాకినాడలో ఎన్నికల సమరశంఖం పూరించిన జగన్‌
కాకినాడ - ఈనాడు

ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్‌  కల్యాణ్‌, కాంగ్రెస్‌..  వీళ్లంతా దోషులేనని, ఎవరినీ నమ్మొద్దని వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణంలోని సర్పవరం పరిధిలో సోమవారం బూత్‌ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమర శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. వద్దంటున్నా కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని గుర్తుచేశారు.ప్రత్యేక హోదా ఇవ్వగలిగిన స్థానంలో ఉండి కూడా భాజపా మోసం చేసిందన్నారు.ఎన్నికలకు ముందు హోదా పదేళ్లు కాదు.. 15 ఏళ్లన్న చంద్రబాబు ఎన్నికలయ్యాక ఈ అంశాన్ని పక్కన పెట్టేసి నాలుగేళ్లు భాజపాతో సంసారం చేశారని వివరించారు. విడాకులు ఇచ్చాక ఎన్నికల సమయంలో నల్లచొక్కా వేసుకుని ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పవన్‌కల్యాణ్‌ ఎన్నికలకు ముందు చంద్రబాబుకు, భాజపాకు ఓటెయ్యండి.. వారి ద్వారా హోదా తెప్పిస్తానని చెప్పారని, ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి కారణాలు చెబుతున్నారని విమర్శించారు.

‘ఒక వ్యక్తిని చంపేటప్పుడు ఒకరు కత్తి ఇచ్చారు. ఒకరు కదలకుండా పట్టుకున్నారు. ఒకరు కత్తితో పొడిచారు. ముగ్గురూ కలిసి హోదా అన్న మనిషిని హత్య చేశారు’ అని జగన్‌ అన్నారు. ప్రతి ఇంట, గ్రామంలో వైకాపా కార్యకర్తలు తిరిగి దీనిపై చర్చ పెట్టాలని, నమ్మి అలసిపోయామని చెప్పాలని సూచించారు. ప్రతి ఓటూ వైకాపాకు పడేలా చూడాలని, 25 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకున్నాక కేంద్రంలో ఎవరు ప్రధాని కావాలన్నా హోదాపై సంతకం పెట్టాకే మద్దతిస్తామని చెబుదామని వ్యాఖ్యానించారు. అమరావతి కోసం 50 వేల ఎకరాలు తీసుకుంటే 49 వేల ఎకరాల్లో గడ్డి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. పోలవరం పనులపైనా ఆక్షేపించారు.

చంద్రబాబు జైలుకు వెళతారు.. ఆయన పార్టీని రద్దు చేయాలి
ఓటుకు నోటు కేసు, వ్యక్తిగత డేటా చౌర్యం, రూ.వేల కోట్లు కుమ్మరిస్తూ ఓట్లు తీసేస్తూ, ఓట్లు చేరుస్తూ దొరికిన చంద్రబాబు రేపోమాపో జైలుకు వెళ్తారని జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజల వ్యక్తిగత డేటా దొంగతనంలో దొరికినందున చంద్రబాబు పార్టీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈవీఎంలు దొంగతనం చేశారని కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తిని చంద్రబాబు సలహాదారుగా పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, అందరికి ఓట్లున్నాయో? లేదో సరిచూసుకోవాలని, లేదంటే 1950కి మెసేజ్‌ పెట్టి సరిచూసుకోవాలని సూచించారు. ఇంటెలిజెన్స్‌ పోలీసులను రాష్ట్రాన్ని కాపాడేందుకు కాకుండా వాచ్‌మెన్ల కంటే దారుణంగా చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపించారు.

పార్టీపెట్టి తొమ్మిదేళ్లు..
వైకాపా స్థాపించి తొమ్మిదో ఏడాదిలోకి అడుగుపెడుతున్నామని, ఈ శుభసమయంలో ఇక్కడినుంచే ఎన్నికల శంఖాన్ని పూరించడం అదృష్టంగా భావిస్తున్నానని జగన్‌ అన్నారు. తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న తనకు అండగా నిలిచారని అన్నారు. అధికారంలో ఉన్నవారు ఎన్ని కష్టాలు పెట్టారో తనకు తెలుసని పేర్కొన్నారు. ‘మీకు తగిలిన ప్రతి గాయం.. నా గుండెకు తగిలింది’ అని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త తన కుటుంబసభ్యుడేనని, అందరి బాగోగులు చూసుకుంటానని అన్నారు. అధికారంలోకి వస్తే కార్యకర్తలపై ఉన్న అక్రమ కేసులు ఉపసంహరిస్తానని ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రైతు రుణాలు రూ.87,612 కోట్లుంటే, మాఫీని రూ.24 వేల కోట్లకు కుదించారని తెలిపారు. ఇచ్చేది కూడా వడ్డీలకు సరిపోనట్లు ఆ సొమ్ములో నాలుగు, అయిదో విడతల కింద రూ.10 వేల కోట్లు బాకీ పడ్డారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన రోజునే మోసపూరితంగా రైతులకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.40 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, ఉద్యోగం ఉపాధి రెండింటిలో ఏదో ఒకటి ఇస్తానని చెప్పి ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు బకాయి పడ్డారని  వివరించారు. వైకాపా అధికారంలోకి రాగానే రూ.25 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తుందని అన్నారు. డ్వాక్రా సంఘాల అప్పులన్నీ నాలుగు దశల్లో చెల్లిస్తామన్నారు. తాను సీఎం కాగానే పిల్లలకు బడికి పంపితే కుటుంబానికి రూ.15 వేలు ఇస్తామని తెలిపారు. అంతకుముందు వైఎస్‌ విగ్రహానికి జగన్‌ పూలమాల వేసి ఎన్నికలకు సన్నాహకంగా డప్పు వాయించి శంఖం పూరించారు. సభలో వైకాపా పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు