close

ఆంధ్రప్రదేశ్

కదిలింది ప్రచార రథం

ఎన్నికల ప్రకటన వెలువడడంతో రాజకీయ సందడి
జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నసీఎం చంద్రబాబు నాయుడు
సొంత నియోజకవర్గాలపై నేతల దృష్టి
ఈనాడు - అమరావతి

న్నికలకు ఇక ఎంతో దూరం లేకపోవడంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలయింది. తెలుగుదేశం, వైకాపాలు ఇప్పటికే అంతర్గతంగా తమ అభ్యర్థుల్లో చాలామందికి పచ్చజెండా ఊపడంతో వారు ప్రచారాలు ప్రారంభించారు. అభ్యర్థిత్వాలపై స్పష్టత వచ్చిన వారు ఊళ్లకు ఊరేగింపులుగా వెళ్లి, ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అమావాస్య వెళ్లిపోవడంతో ప్రచారాలు మూడు రోజుల కిందట ఊపందుకోగా షెడ్యూలు వచ్చాక సందడి మరింత పెరిగింది. తెదేపా అధినేత చంద్రబాబు ఇప్పటికే చాలా జిల్లాల్లో అభ్యర్థులకు స్పష్టత ఇచ్చారు. పచ్చజెండా ఊపడంతో నాయకులు తమ నియోజకవర్గాలకే పరిమితమై ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు ఈ నెల 13 నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. వైకాపా అధినేత జగన్‌ అధికారికంగా ప్రకటించకపోయినా అనేకచోట్ల నియోజకవర్గ సమన్వయకర్తలే అభ్యర్థులుగా ఉంటారని అంతర్గతంగా ఉన్న స్పష్టత మేరకు వారంతా ప్రచారాన్ని పెంచారు. ‘రావాలి జగన్‌-కావాలి జగన్‌’ కార్యక్రమంతో ఓటర్లను కలుస్తున్నారు. ఎన్నికల శంఖారావాల పేరుతో జగన్‌ సభలు నిర్వహిస్తున్నారు. జనసేన తన ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాసు’ను ఓటర్లలోకి తీసుకువెళ్లేలా వివిధ చోట్ల ప్రచారం చేస్తోంది. రాష్ట్ర పర్యటన ముగించిన జనసేన అధిపతి పవన్‌కల్యాణ్‌ మళ్లీ ప్రచార సభలకు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సభపై దృష్టి పెట్టారు. రథయాత్రతో భారతీయ జనతా పార్టీ, ప్రత్యేక హోదా తామే తెస్తామంటూ కాంగ్రెస్‌.. ప్రచారం సాగిస్తున్నాయి. మంత్రుల వరకు చూస్తే పి.నారాయణ, పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అఖిలప్రియ, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత ప్రచారాన్ని మొదలు పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

విజయవాడ లోక్‌సభ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని నాని తరఫున ఆయన కుమార్తె శ్వేత ప్రచారం ప్రారంభించారు. కడపలో వైకాపా నుంచి అవినాష్‌రెడ్డి ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. శ్రీకాకుళంలో తెదేపాకు చెందిన జి.లక్ష్మీదేవి, పలాస నుంచి జి.శిరీష ప్రచారం ప్రారంభించారు. వైకాపా నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఒక్కో వర్గం నాయకులను కలుస్తూ మద్దతు సంపాదిస్తున్నారు. విజయనగరంలో తెదేపా లోక్‌సభ నియోజకవర్గ సమీక్షలపై పార్టీ దృష్టి సారించడంతో నాయకులంతా అదే హడావుడిలో ఉన్నారు. వైకాపాకు సంబంధించి చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ప్రచారం ఊపందుకుంటోంది. తునిలో యనమల రామకృష్ణుడుకు సన్మాన సభతోనే తెదేపా అభ్యర్థి కృష్ణుడు ప్రచారమూ ప్రారంభించినట్లయింది. వైకాపా నేతలు వివిధ నియోజకవర్గాల్లో నవరత్నాల ప్రచారాన్ని, పాదయాత్రలను నిర్వహిస్తూ ఓటర్ల వద్దకు వెళ్లారు. కాకినాడలో జగన్‌ సోమవారం సమర శంఖారావ సభ నిర్వహించారు.  కడప జిల్లాలో వైకాపా నుంచి అవినాష్‌రెడ్డి లోక్‌సభ స్థానంలో ప్రచారం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సినీనటి రోజా, భూమన కరుణాకర్‌రెడ్డి (వైకాపా) తదితరులు ప్రచారంలో నిమగ్నమయ్యారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు