close

ఆంధ్రప్రదేశ్

ఓటు నమోదుకు ప్రచారం చేయండి

15 వరకే గడువు
వివిధ పార్టీల నేతలకు గోపాలకృష్ణ ద్వివేది సూచన
ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరుగా నమోదయ్యేందుకు ఈ నెల 15 వరకే దరఖాస్తులు స్వీకరిస్తామని, దీనిని రాజకీయ పార్టీలూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఓటరు జాబితాలో తమ పేరుందో లేదో ప్రతి ఒక్కరూ చూసుకుని, లేకపోతే ఫారం-6లు సమర్పించాలని సూచించారు. ఓట్ల తొలగింపు కోసం మార్చి 10 తర్వాత వచ్చిన ఫారం-7లను ఈ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ అనంతరమే పరిశీలిస్తామన్నారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో సోమవారం రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో ఓట్ల తొలగింపు కోసం 7.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని, పరిశీలన అనంతరం వాటిలో 5.5 లక్షల దరఖాస్తులను తిరస్కరించామన్నారు. కొందరు ఓటర్లు చనిపోవడం, మరికొందరి పేర్లు రెండుమూడుసార్లు ఉండడం వంటివి కారణంగా చూపించి దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఈ నెల 26న ఓటర్ల తుది జాబితాకు అనుబంధ జాబితాను ప్రచురిస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీలన్నీ తప్పనిసరిగా దాన్ని పాటించాలన్నారు.

అతిక్రమిస్తే నోటీసులు ఇస్తాం
‘రాజకీయ పార్టీలు, బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను ప్రభావితం చేస్తున్నా వాటిపై అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. నియామవళిని, మార్గదర్శకాలను అతిక్రమిస్తే సంబంధిత రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు నోటీసులు ఇస్తాం. సి-విజిల్‌ యాప్‌ ద్వారా ప్రజలూ ఫిర్యాదు చేయొచ్చు. ఖర్చులను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిల్లో కమిటీలు ఉంటాయి. ఆయా సందర్భాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలు చేసే ఖర్చుల లెక్కలను పరిగణనలోకి తీసుకుంటాం. అభ్యర్థుల నామినేషన్‌ ప్రక్రియ మొదలు కాగానే ఖర్చులను వారి ఖాతాకు చూపిస్తాం’ అని ద్వివేది వివరించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు